పెన్షన్ చెల్లింపు విధాన నిర్ణయం!
ABN , First Publish Date - 2022-10-07T08:20:46+05:30 IST
పెన్షన్ చెల్లింపు విధాన నిర్ణయం!
కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు.. సెర్ప్ సీఈవో అఫిడవిట్
అమరావతి, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): పెన్షన్ చెల్లింపు పూర్తిగా విధానపరమైన నిర్ణయమని, ఈ వ్యవహారంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని అప్పటి సెర్ప్ కార్యనిర్వహణాధికారి (సీఈవో) మహ్మద్ ఇంతియాజ్ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. బడ్జెట్ నుంచి సంక్షేమ పథకాల కోసం నిధులు కేటాయిస్తున్న నేపథ్యంలో సొంతగా మార్గదర్శకాలు రూపొందించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కింద అర్హులుగా ఉన్న లబ్ధిదారులకు కేంద్రం కేటాయించే నిధులు కాకుండా రాష్ట్రం కూడా తన సొంత నిధులు ఖర్చు చేస్తుందన్నారు. కేంద్రం మంజూరు చేసిన పెన్షన్లతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో పెన్షన్లు చెల్లిస్తోందన్నారు. ప్రతి నెలా రూ.1,596 కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. ఒక కుటుంబంలో అర్హులు ఉన్నా ఒకటి కంటే ఎక్కువ పెన్షన్లు ఇవ్వడం లేదన్న పిటిషనర్ వాదన సరికాదన్నారు. అర్హులందరికీ పెన్షన్ అందాలనే ఉద్దేశంతో అర్హత నిబంధనలు సవరించామని.. అర్హత వయసును 65 నుంచి 60కి తగ్గించామని.. కుటుంబంలో 80 శాతం కన్నా ఎక్కువ అంగవైకల్యం ఉన్నవారు, డయాలసిస్ పేషెంట్లు, మానసిక రుగ్మతలతో బాధపడుతున్నవారు ఉంటే బహుళ పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. వైఎ్‌సఆర్ పెన్షన్ కానుక పథకం నిబంధనలు సవరిస్తూ రాష్ట్రప్రభుత్వం 2019 డిసెంబరులో జీవో 174 జారీ చేసింది. దాని ప్రకారం కుటుంబంలో ఒకటి కన్నా ఎక్కువ పెన్షన్లు ఇచ్చే వెసులుబాటు ఉన్నా.. దానిని వృద్ధులు, వితంతువులకు వర్తింపజేయకపోవడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది తాండవ యోగేశ్ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి, సెర్ప్ సీఈవో తదితరులకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపఽథ్యంలో సెర్ప్ సీఈవో కౌంటర్ దాఖలు చేశారు.