నవరత్నాలపై నవ సందేహాలు

ABN , First Publish Date - 2022-07-09T08:46:43+05:30 IST

వైసీపీ ప్రభుత్వం నవరత్నాలను అమలు చేస్తున్న తీరుపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నల వర్షం కురిపించారు. నవరత్నాల అమలుపై ‘నవ

నవరత్నాలపై నవ సందేహాలు

పథకాల నుంచి లబ్ధిదారులను తొలగించలేదా?

సంపూర్ణ మద్యపాన నిషేధం ఏదీ?

పోలవరం ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారు?

ప్రభుత్వానికి పవన్‌ ప్రశ్నల వర్షం


అమరావతి, జూలై 8 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం నవరత్నాలను అమలు చేస్తున్న తీరుపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నల వర్షం కురిపించారు. నవరత్నాల అమలుపై ‘నవ సందేహాలు’ లేవనెత్తారు. శుక్రవారం ఇందుకు సంబంధించిన ప్రశ్నలను నవ సందేహాలు పోస్టర్‌ ద్వారా వివరించారు. ఈ పోస్టర్‌ను ట్విటర్‌లో పోస్టు చేశారు. దీంతో పాటు ట్విటర్‌లో మరికొన్ని పోస్టర్లను పోస్టు చేశారు. ‘బడిదొంగ మామయ్య... మా బడినెత్తుకెళ్తున్నాడు..?’ అంటూ మరో పోస్టర్‌ను షేర్‌ చేశారు. ‘హేతుబద్ధీకరణ పేరిట 8 వేల బడుల్ని మూసివేసి, పిల్లల్ని బడులకు దూరం చేస్తున్న జగన్‌ మామ’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నవరత్నాల అమలుపై ప్రభుత్వానికి పవన్‌ సంధించిన ప్రశ్నలు.. 


రైతు భరోసా రత్నం: 64 లక్షల మందికి మేలు అని చెప్పి, 50 లక్షల మందికే రైతు భరోసా ఇవ్వడం నిజం కాదా? మూడేళ్లలో 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే, కేవలం 700 మందికే ఆర్థిక సాయాన్ని పరిమితం చేయలేదా?


అమ్మఒడి రత్నం: అమ్మఒడి ద్వారా 43 వేలమందికి మాత్రమే లబ్ధి చేకూర్చి, 83 వేలమందికి ఇచ్చామని ఎందుకు అబద్ధపు ప్రచారం చేస్తున్నారు?


పెన్షన్లు: పెన్షనర్ల జాబితాను కుదించి 5 లక్షల మందిని తొలగించిన మాట వాస్తవం కాదా?


సంపూర్ణ మద్యపాన నిషేధం: మద్యం ఆదాయం 2018-19లో రూ.14 వేల కోట్లు ఉంది. 2021-22లో రూ.22 వేల కోట్లకు పెరిగింది. ఇదేనా మద్యపాన నిషేధం? ఈ ఆదాయం చూపించే రూ.8 వేల కోట్ల బాండ్లు అమ్మలేదా? 


జలయజ్ఞం: పోలవరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన ఎప్పుడు పూర్తి చేస్తారో చెబుతారా?


ఆరోగ్యశ్రీ: ఆరోగ్యశ్రీ పథకం నుంచి ఆస్పత్రులు ఎందుకు తప్పుకొంటున్నాయి? సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి వైద్యం ఖర్చు ఎందుకు చెల్లించడం లేదు? 


ఫీజు రీయింబర్స్‌మెంట్‌: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయకపోవడం వల్ల విద్యార్థులకు హాల్‌ టికెట్లు ఆపేస్తున్న మాట నిజం కాదా? పీజీ విద్యార్థులకు ఫీజు చెల్లింపులు ఎందుకు నిలిపివేశారు? 


పేదలందరికీ ఇళ్లు: చెరువులు, గుట్టల్లో స్థలాలు ఇచ్చిన మాట నిజమా? కాదా? ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఎందుకు మంజూరు చేయలేదు? 


ఆసరా: పొదుపు సంఘాల సంఖ్యను ఏటా ఎందుకు తగ్గిస్తున్నారు? అక్కచెల్లెమ్మల అభయ హస్తం నిధులు రూ.2 వేల కోట్లు ఎటుపోయాయి?

Updated Date - 2022-07-09T08:46:43+05:30 IST