ప్రశాంత విశాఖలో ‘కోనసీమ’ దాడులు!
ABN , First Publish Date - 2022-10-17T09:48:25+05:30 IST
ప్రశాంత విశాఖలో ‘కోనసీమ’ దాడులు!
ఎయిర్‌పోర్టులో దాడి.. కోడికత్తి తరహాదే!!
మంత్రులపై వాళ్లే చేసుకుని జనసేన నేతలపై నెడుతున్నారు: పవన్ ఆగ్రహం
విశాఖపట్నం, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వ్యక్తి.. ప్రశాంత విశాఖ నగరంలో కోనసీమ తరహా దాడులు కోరుకుంటున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన అటువంటి అవకాశం కల్పించదని స్పష్టం చేశారు. కోడికత్తి తరహాలోనే విశాఖ ఎయిర్‌పోర్టులో మంత్రులపై వాళ్లే దాడులు చేసుకుని.. తిరిగి జనసేన మీదకు నెడుతున్నారని విమర్శించారు. ఆదివారమిక్కడి పోర్టు కళావాణి స్టేడియంలో జనసేన ‘జనవాణి’ కార్యక్రమం నిర్వహించాలనుకుంది. అయితే శనివారం అర్ధరాత్రి జనసేన నేతలు, కార్యకర్తల అరెస్టు నేపథ్యంలో ఆదివారం ఉదయం పవన్ నోవాటెల్ హోటల్లో విలేకరులతో మాట్లాడారు. విశాఖలో ఏదో ఒకరకంగా గొడవలు పెట్టాలని ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. వైసీపీ విశాఖ గర్జన కంటే ముందుగానే తమ జనవాణి కార్యక్రమాన్ని నిర్ణయించామన్నారు. ఎయిర్‌పోర్టు నుంచి ర్యాలీగా వస్తున్న సమయంలో ఓ పోలీసు ఉన్నతాధికారి తన కారుపైకి ఎక్కి.. అభిమానులకు అభివాదం చేయొద్దని ఆపాలని చూశారని, అసలీ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోందో అర్థం కావడం లేదన్నారు. తమ పార్టీ నాయకులను అరెస్టు చేసి తీసుకెళ్లారని, అంత తప్పు ఏం చేశామని ప్రశ్నించారు.
పోలీసు శాఖపై గౌరవం..
ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్న వ్యక్తి కింద పోలీసులు పనిచేయాల్సి రావడం దురదృష్టకరం. పైనుంచి వచ్చిన ఆదేశాలు పాటించాల్సిన పరిస్థితి వారికి ఏర్పడింది. నాపైజులుం ప్రదర్శించిన పోలీసులు వివేకా హత్య, కోడి కత్తి కేసుల్లో ఎందుకంత వేగంగా విచారణ చేయడం లేదు? ఎస్.కోటలో గంజాయి దొంగలు రెచ్చిపోతున్నా పట్టించుకోని పోలీసులు... జనసేనను ఇబ్బందిపెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తుండడం దారుణం. ప్రజా గొంతుకను వినిపించే వారిని అణచివేయాలని చూడడం దుర్మార్గం. రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా శాంతంగా ఉన్నాం. జనవాణి చేయకూడదని చెబుతున్న పోలీసులు.. గతంలో సీఎంను ఉరితీయాలన్న వ్యక్తిని ఏం చేశారు? ఇష్టంవచ్చినట్టు వ్యవహరిస్తుంటే చేతులు కట్టుకు కూర్చోవాలా..? లా అండ్ ఆర్డర్ సమస్యను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. గొడవ పెంచేందుకు రాత్రి ఓ పోలీసు ఉన్నతాధికారి తీవ్రంగా యత్నించారు.
ప్రభుత్వాలు ఉంటాయి, పోతాయి.. కానీ అధికారులు 35ఏళ్లపాటు పనిచేయాలి. మాకు సానుకూలంగా ఉండాలని చెప్పడం లేదు. న్యాయం చేయాలని కోరుతున్నాం. రాజధానుల గురించి మాట్లాడేందుకు రాలేదు. జనవాణిలో పాల్గొనేందుకు వచ్చాను. నా దృష్టిలో మూడు రాజధానులు లేవు. ఒకే రాజధానికి కట్టుబడి ఉన్నాను. రాజు వచ్చినప్పుడల్లా రాజధాని మారుస్తామంటే ఎలా? సీఎంలు మారినప్పుడల్లా రాజధానులు మారతాయా..?
అధికారం ఒక్కరి వద్దే కేంద్రీకృతం..
ఒకేచోట అభివృద్ధి కేంద్రీకృతం కాకూడదని వికేంద్రీకరణ గురించి మాట్లాడుతున్న వైసీపీ నేత.. మరి మంత్రులకు అధికారాలను ఎందుకు వికేంద్రీకరించడం లేదు? బూతులు తిట్టడానికి వికేంద్రీకరణ చేస్తూ, అధికారం మాత్రం ఒకవ్యక్తి చేతిలో కేంద్రీకృతం చేసుకుంటున్నాడు. 35లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల నిధులు రూ.450కోట్ల వినియోగాన్ని, ఇసుకలో హక్కు ఎవరికి ఉండాలన్నది ఒక వ్యక్తి నిర్ణయిస్తాడు. ఆరు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేయకుండా అధికారం చలాయిస్తున్నది ఒక వ్యక్తే. అదానీ డేటా సెంటర్, అమర్‌రాజా బ్యాటరీస్, లులూ వంటి అనేక సంస్థలు రాష్ట్రం నుంచి వెళ్లిపోవడానికి ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయాలే కారణం. ఇవన్నీ అధికార కేంద్రీకృతం వల్ల జరిగినవి కావా? వీళ్లా వికేంద్రీకరణ గురించి మాట్లాడేది? అధికారంలో ఉండి లక్షమందితో గర్జిస్తామంటే ఎలా? ప్రోగ్రామ్స్‌ను అమలు చేయాల్సిన ప్రభుత్వం నిరసనలు తెలపడం ఎంతవరకు సమంజసం? వైసీపీ గూండాలు, రౌడీలు బెదిరింపులు నాకు కొత్త కాదు. 2019 ఎన్నికల సమయంలోనూ నన్ను చంపేస్తానని బెదిరించారు. ఉడత ఊపులకు, తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు. ఈ గూండాలు, క్రిమినల్స్‌ను ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు. అక్రమంగా అరెస్టు చేసిన మా నాయకులను బేషరతుగా విడుదల చేయాలి. వారు లేకుండా జనవాణికి వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నాను.
వారిని విడుదల చేసేంత వరకు ఇక్కడే ఉంటా. నేర చరితులు రాజకీయాల్లో ఉంటే ఇటువంటి ఇబ్బందులే ఎదురవుతాయి. వారిని అడ్డుకునే ప్రయత్నంలో నేను చనిపోయినా సంతోషమే. భవిష్యత్‌లో అందరి లెక్కా తేలుస్తాం. అన్నింటికీ సిద్ధపడే వచ్చాం. ఉత్తరాంధ్ర, వైజాగ్ ప్రశాంతమైన ప్రదేశం.. శాంతిభద్రతల సమస్య ఉండకూడదని సైలెంట్‌గా ఉన్నాం. మావాళ్లపై పెట్టిన కేసులను న్యాయపరంగానే ఎదుర్కొంటాం. ఉత్తరాంధ్రపై ప్రేమ ఒలకబోస్తున్న ప్రభుత్వ పెద్దలు.. ధర్మాన ప్రసాదరావు ఆక్రమించుకున్నారని చెబుతున్న మాజీ సైనికులకు చెందిన 71 ఎకరాలు తిరిగి వాళ్లకు ఇప్పించాలి. వైసీపీ వాళ్లకు నేనంటే భయం పట్టుకుంది. వైసీపీ ఆక్రమణలు చూడాలంటే నా జీవితకాలం సరిపోదు. విశ్వనగరంగా అభివృద్ధి చెందిన విశాఖను రాజధానిగా అభివృద్ధి చేయాలా? నా పెళ్లి, యాక్టింగ్ గురించి మాట్లాడే నాయకులు.. నేను యాక్టింగ్ నేర్చుకున్న ముంబైని, పెళ్లిళ్లు చేసుకున్న వేర్వేరు ప్రాంతాలను రాజధానులు చేస్తారా..?
