పవన్‌ కల్యాణ్‌ రాజకీయ ఉగ్రవాది

ABN , First Publish Date - 2022-10-17T10:13:11+05:30 IST

‘‘జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ రాజకీయ ఉగ్రవాది. నాయకుడినిబట్టి కార్యకర్తలు కూడా సైకోలు, సంఘ విద్రోహులుగా తయారవడంలో ఆశ్చర్యం లేదు. పవన్‌ కల్యాణ్‌ ఎయిర్‌పోర్టులో దిగకముందే కొంతమంది సైకోలతో రాష్ట్ర

పవన్‌ కల్యాణ్‌ రాజకీయ ఉగ్రవాది

నాయకుడినిబట్టే కార్యకర్తలు.. సైకోలుగా తయారు

బ్లేడ్లుతో ‘కొడాలి’ హత్యకు వ్యూహం

మా పార్టీ విధానం మూడు రాజధానులు

పవన్‌ పార్టీ విధానం మూడు పెళ్లిళ్లు: మంత్రి అమర్‌నాథ్‌


విశాఖపట్నం, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): ‘‘జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ రాజకీయ ఉగ్రవాది. నాయకుడినిబట్టి కార్యకర్తలు కూడా సైకోలు, సంఘ విద్రోహులుగా తయారవడంలో ఆశ్చర్యం లేదు. పవన్‌ కల్యాణ్‌ ఎయిర్‌పోర్టులో దిగకముందే కొంతమంది సైకోలతో రాష్ట్ర మంత్రులు, ఇతర నేతలపై దాడిచేయించారు’’ అని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ విమర్శించారు. విశాఖలోని ఒక హోటల్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి విశాఖ వచ్చారా? లేక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బాణీని వినిపించడానికి వచ్చారా? మూడు నెలల ముందే విశాఖలో జనవాణి ప్రకటించామని పవన్‌ చెప్పడంలో వాస్తవం లేదు.


సినిమా నటుడు అనేసరికి ఎవరైనా చూడడానికి వస్తారు. అందులో భాగంగానే శనివారం పవన్‌ను చూసేందుకు ఒక ఐదు వేల మంది వరకూ వచ్చారు. వారంతా ఓట్లు వేస్తారనుకోవడం అవివేకం. అదే జరిగితే రాష్ట్రాన్ని, దేశాన్ని సినిమా నటులే పరిపాలించాల్సి ఉంటుంది. మేము మూడు రాజధానుల గురించి మాట్లాడుతుంటే పవన్‌ కల్యాణ్‌ మూడు పెళ్లిళ్లు చేసుకోవాలంటూ ప్రజలను ప్రేరేపిస్తుండడం ఆశ్చర్యంగా ఉంది. మా ప్రభుత్వ విధానం మూడు రాజధానులు అయితే ఆయన పార్టీ విధానం ప్రస్తుతానికి మూడు పెళ్లిళ్లు. మా పార్టీ నేత కొడాలి నానిని హత్య చేసేందుకు కొంతమంది జనసేన కార్యకర్తలు బ్లేడ్లు పట్టుకుని ఎయిర్‌పోర్టులో వ్యూహం పన్నినట్టు నాకు తెలిసింది. ఎవరిని చంపేస్తారు? ఇది ప్రజాస్వామ్యమేనా? ఇలాంటివి జరిగితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు’’ అని మంత్రి అమర్‌ హెచ్చరించారు. 


పవన్‌నూ లోపలేస్తాం 

‘‘ఎయిర్‌పోర్టులో మంత్రులపై హత్యాయత్నం చేసినవారిని అరెస్టుచేస్తే వారిని వదిలేవరకూ తాను కదలనని పవన్‌ కల్యాణ్‌ బెట్టుచేయడం సరికాదు. ఆయన కూడా ఏదోఒకటి చేస్తే వారితోపాటే లోపలకు తోసేస్తాం. పవన్‌ కల్యాణ్‌ విశాఖలో ఉన్నంతవరకూ ఆడపిల్లలు బయటకురావద్దు. పొరపాటున ఎవరైనా వస్తే ఎక్కడ తాళికట్టేస్తాడోనని భయపడుతున్నాం’’ అని ఎద్దేవా చేశారు. 

Updated Date - 2022-10-17T10:13:11+05:30 IST