Pattabhiram: కమీషన్ల కోసమే ‘సహకారం’ ధారాదత్తం

ABN , First Publish Date - 2022-12-16T00:30:20+05:30 IST

‘‘రాష్ట్రంలోని సహకార డెయిరీలను నామరూపాలు లేకుండా నాశనం చేయాలనే కుతంత్రంతోనే సైకో స్టార్‌ జగన్‌రెడ్డి ‘అమూల్‌ బేబీ’ అవతారం ఎత్తాడు.

Pattabhiram: కమీషన్ల కోసమే ‘సహకారం’ ధారాదత్తం

‘పాడి’ని గుప్పెట్లో పెట్టుకోవడానికే అమూల్‌ బేబీ అవతారమెత్తిన సైకో స్టార్‌

చిత్తూరు డెయిరీని పునరుద్ధరిస్తామని చెప్పి 650 కోట్ల విలువైన ఆస్తులను పరాధీనం చేశారు: పట్టాభి

అమరావతి, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలోని సహకార డెయిరీలను నామరూపాలు లేకుండా నాశనం చేయాలనే కుతంత్రంతోనే సైకో స్టార్‌ జగన్‌రెడ్డి ‘అమూల్‌ బేబీ’ అవతారం ఎత్తాడు. రూ.వేల కోట్ల విలువైన సహకార డెయిరీల ఆస్తులను గంపగుత్తగా గుజరాత్‌ సంస్థ అమూల్‌కు ధారాదత్తం చేయడం ఏంటి? ఏడాదిలో అధికారం కోల్పోయి, చెంచల్‌గూడ జైలుకెళ్లే జగన్‌రెడ్డికి చిత్తూరు డెయిరీని 99 ఏళ్లకు గుజరాత్‌ సంస్థకు లీజుకిచ్చే అధికారం ఎక్కడిది? పాడి పరిశ్రమను తన గుప్పెట్లో పెట్టుకుని, కమీషన్ల కోసం కక్కుర్తి పడి జగన్‌రెడ్డి అమూల్‌ జపం చేస్తున్నాడు’’ అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ధ్వజమెత్తారు. గురువారం టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘అమూల్‌తో ఒప్పందం చేసుకున్నప్పుడు లక్షలాది పాడి రైతులకు లబ్ధి చేకూర్చేందుకే వేల కోట్ల ప్రభుత్వ ధనం ఖర్చు పెడుతున్నట్లు అందరినీ నమ్మించాడు. ఇప్పుడేమో అడ్డగోలుగా చిత్తూరు డెయిరీని అమూల్‌కు కట్టబెట్టారు. గతంలో ఒంగోలు డెయిరీని అప్పగించారు. సంగం డెయిరీని కబ్జా చేయడానికి ప్రయత్నించారు. సంగం చైర్మన్‌ నరేంద్రపై తప్పుడు కేసులు బనాయించారు. మళ్లీ ఇప్పుడు సంగం డెయిరీని ప్రభుత్వపరం చేస్తామంటున్నారు. సహకార రంగంలో పాడి రైతులకు మేలు చేస్తున్న డెయిరీలను కబ్జా చేసి, పాడి రైతులను గుజరాత్‌ సంస్థకు బానిసల్ని చేయాలని చూస్తున్నాడు.

ఏడాదికి రూ.కోటి చొప్పున 99 ఏళ్లకు చిత్తూరు డెయిరీని అమూల్‌కు లీజుకు ఇవ్వడం ఏంటీ? ఇప్పుడున్న రేటు కనీసం పదేళ్ల తర్వాత ఉంటుందా? ఆ మాత్రం ఆలోచన లేకుండా ఏకంగా 99 ఏళ్లకు ఒకే రేటుకు లీజుకిస్తారా? మూతపడ్డ డెయిరీని పునరుద్ధరిస్తామని చెప్పి, రూ.650 కోట్ల విలువ చేసే చిత్తూరు డెయిరీని పరాధీనం చేస్తారా? పాడి రైతులకు బోనస్‌ ఇస్తూ, బీమా అమలు చేస్తూ, సబ్సిడీపై పశుగ్రాసం, దాణా, గేదెలకు ఉచిత వైద్యం అందిస్తున్న సహకార డెయిరీలు ఎందుకు చేదు అయ్యాయి? ఏపీలో పాడి రైతులకు నయాపైసా సాయం చేయని అమూల్‌ ముద్దు అయిందా? సంగం డెయిరీ, కృష్ణా మిల్క్‌ యూనియన్‌ ఏటా పాల రైతులకు బోనస్‌ పంచుతూ, పాడి రైతు కుటుంబాలకు అనేక రకాలుగా అండగా నిలుస్తుంటే.. వాటి ఆదరణ చూసి ఓర్వలేక పాడి రైతుల విరోధి అప్పలరాజు, అమూల్‌ బేబీ జగన్‌రెడ్డి కలిసి కమిషన్ల కోసం గుజరాత్‌ సంస్థకు ఒత్తాసు పలుకుతున్నారు’’ అని పట్టాభి విమర్శించారు.

Updated Date - 2022-12-16T00:30:21+05:30 IST