పరాకాష్ఠకు ఫొటోల పిచ్చి
ABN , First Publish Date - 2022-10-10T08:36:39+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వ సమష్టి బాధ్యతను సాంతం ముఖ్యమంత్రి క్రెడిట్‌లో వేసి ఆయన్ను శాశ్వత ఆరాధ్యుడిగా చేసేందుకు అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు.
- రీ సర్వే భూమి రికార్డులపై జగన్ ఫొటోలు
- ‘శాశ్వతం’గా కనిపించేలా కసరత్తు
- ప్రతి ఎల్‌పీఎమ్ రికార్డుపైనా సీఎం చిత్రం
- మంత్రి, అధికారుల ఫొటోలు కూడా
- భూమి హక్కు పత్రాల్లోనూ ఇదేవరస
- తమ వ్యక్తిగత రికార్డులపై వారి ఫొటోలు
- ఎందుకని రైతన్నల అభ్యంతరం
- గతంలో ఎన్నడూ లేని సంప్రదాయం
భూములు రైతుల వ్యక్తిగత ఆస్తి. వారసత్వంగా వచ్చినవి కావచ్చు.. లేదా కష్టార్జితంతో కొన్నవి కావచ్చు. ప్రభుత్వానికి ఎలాంటి సంబంధమూ లేదు. రికార్డులు, రిజిస్ట్రేషన్ పరంగా చట్టబద్ధత మాత్రమే కల్పిస్తుంది. ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన భూముల విషయంలోనూ అంతే. అయితే, ఇప్పుడు రీ సర్వే భూమి రికార్డుల్లో జగన్ ఫొటోలు ‘శాశ్వతం’గా కనిపించేలా ముద్రిస్తున్నారు. పనిలో పనిగా మంత్రి, అధికారుల ఫొటోలు కూడా వేసేస్తున్నారు. పథకం ‘పేరు’ నుంచి ఈ ఫొటోల ఎగ్జిబిషన్ వరకు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ సమష్టి బాధ్యతను సాంతం ముఖ్యమంత్రి క్రెడిట్‌లో వేసి ఆయన్ను శాశ్వత ఆరాధ్యుడిగా చేసేందుకు అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇందుకోసం ఎన్నెన్నో కొత్త దారులు వెతుకుతున్నారు. రీ సర్వే జరుగుతున్న గ్రామాల్లో కొత్తగా రూపొందిస్తున్న భూమి రికార్డుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగ న్మోహన్‌రెడ్డి వెలుగుజిలుగులతో శాశ్వతంగా కనిపించేలా రెవెన్యూ, సర్వే శాఖలు భారీ ఫొటో ఎగ్జిబిషన్‌కు దిగాయి. సీఎం ఫొటో చెరిగిపోకుండా కలకాలం నిలిచేలా అత్యంత కీలకమైన ఎల్‌పీఎమ్ రికార్డుల్లోనూ ముద్రిస్తున్నారు. సీఎంతో పాటు తమకు కొంత చోటు ఉండాలనుకుని అధికారులు కూడా వారి ఫొటోలు సిద్ధం చేసుకుంటున్నారు. వేలకోట్ల ప్రజాధనంతో చేపడుతున్న ఈ యజ్ఞంలో ముఖ్యమంత్రి, మంత్రి, అధికారుల ఫొటోలు ఎందుకు? రైతులకు ఇచ్చే వ్యక్తిగత పట్టాలు, రికార్డులపై వారి ముఖచిత్ర ప్రదర్శన దేనికోసం? అన్న అభ్యంతరాలు రైతాంగం నుంచి వినిపిస్తున్నాయి.
‘పేరు’ నుంచే విమర్శలు..
100 ఏళ్ల తర్వాత భూముల సర్వే చేస్తున్నామని, రాష్ట్రంలో భూ వివాదాలు లేకుండా చేస్తామని భూముల సమగ్ర సర్వేను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తనతో పాటు తన తండ్రి పేరు కలిసివచ్చేలా నామకరణం చేశారు. వైఎ్‌సఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం అని పేరు పెట్టారు. ట్యాగ్‌లైన్‌గా ‘మీ భూమి.. మా హామీ’ అని చేర్చారు. దీనిపై మొదట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. రైతుల భూములకు ‘సర్కారీ హామీ’ అని ఉండాలి తప్ప.. ‘మా హామీ’ అని ఎలా రాస్తారంటూ రెవెన్యూ నిపుణులు ప్రశ్నించారు. ఈ పథకానికి సీఎం, ఆయన తండ్రి పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందని సందేహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఏ అంశంపైనా అటు సీఎం, ఇటు అధికారులు సమాధానం చెప్పలేదు. ఒక్క పేరుతోనే అయిపోలేదు.. కలర్ సినిమా ఇంకా చాలానే ఉందని అధికారులు రకరకాల ఎపిసోడ్‌లు విడుదల చేస్తున్నారు.
మొదట రాళ్లపై ‘ఫొటో’ ప్లాన్
సర్వే కోసం ఉపయోగించే సరిహద్దు రాళ్లపై స్కీమ్ పేరుతో పాటు సీఎం జగన్ ఫొటోలు ముద్రించాలని తొలుత అధికారులు ప్రయత్నించారు. ఈ మేరకు గ్రానైట్ రాళ్లపై సీఎం ఫొటోలు ముద్రించి ఆయన ఆమోదం కోసం ప్రకాశం నుంచి విజయవాడకు తీసుకొచ్చారు. ఈ అంశాన్ని అప్పట్లో ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చింది. ‘శిలలపై జగనన్న చిత్రాలు’ అనే శీర్షికతో సరిహద్దు రాళ్ల అంశాన్ని బయటపెట్టింది. దీనిపై తీవ్ర విమర్శలు, అసంతృప్తి వ్యక్తం కావడంతో రాళ్లపై ఫొటోలు వద్దనుకున్నారు.
చెరిగిపోని విధంగా ఫొటోలు
ముఖ్యమంత్రి ఫొటోలు అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో ప్రముఖంగా కనిపించేలా ప్రదర్శిస్తున్నారు. చివరకు పోలీసు స్టేషన్‌లలో కూడా పెద్ద పెద్ద ఫొటోలను ఏర్పాటు చేశారు. అలాంటిది 100 ఏళ్ల తర్వాత జరుగుతున్న రీ సర్వేలో సీఎం ఫొటో లేకపోతే ఎలాగని అనుకున్నారో? ఏమో? మరో మాస్టర్ ప్లాన్ వేశారు. రీ సర్వే అనంతరం రైతులకు ఆర్‌ఓఆర్ చట్టం కింద ఇచ్చే భూమి హక్కుల పత్రం (పాస్ పుస్తకం)లో కవర్ పేజీ నుంచే సీఎం ఫొటో కనిపించేలా డిజైన్లు తయారు చేయించారు. కవర్ పేజీ, వెనుక పేజీలో రెండు విధాలుగా సీఎం కనిపించేలా డిజైన్లు ఖరారు చేశారు. ఇప్పటికే కొన్ని ప్రింటింగ్‌కు పంపించారు. ఇప్పుడు ఇది కూడా చాలదన్నట్టు సీఎం ఫొటో శాశ్వతంగా కనిపించేలా కొత్త వ్యూహం తెరపైకి తీసుకొచ్చారు. ల్యాండ్ పార్సిల్ మ్యాప్ (ఎల్‌పీఎమ్)లను కలిపి ఒక పుస్తకంగా ముద్రించి అందులో కవర్ పేజీ, వెనుక పేజీ, లోపలి పేజీల్లో ముఖ్యమంత్రి ఫొటోలు కనిపించేలా డిజైన్లు తయారు చేయించారు. ప్రతి గ్రామంలో కనీసం ఐదారు ఎల్‌పీఎమ్ పుస్తకాలు ముద్రిస్తారు.
ఒక్కో పుస్తకంలో ఒకటి నుంచి 50 లేదా 100 ఎల్‌పీఎమ్‌లు ఉంటాయి. ఇలా రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ప్రభుత్వ, ప్రైవేటు, రైతుల భూములతో కూడిన ఎల్‌పీఎమ్ బుక్‌లను ముద్రిస్తున్నారు. ఇవి శాశ్వతమైన రికార్డులు. ఒకవేళ ప్రభుత్వం మారినా వీటిని మార్చడానికి వీల్లేదు. కొత్తగా వచ్చే ప్రభుత్వం తమకు నచ్చిన పద్ధతిలో పాస్‌పుస్తకాలు ఇవ్వొచ్చు. కానీ ఎల్‌పీఎమ్‌లను మార్చడానికి వీల్లేదు. అవి మారాలంటే తిరిగి రీ సర్వే చేసి కొత్త రికార్డు తయారు చేయాలి. అందుకే చాలా లోతైన ఆలోచన చేసి భూమి రికార్డుల్లో ‘చెరిగిపోని’ విధంగా సీఎం ఫొటోలు భారీగా ముద్రిస్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ప్రింటింగ్ ప్రక్రియ పూర్తిచేశారు. జాయింట్ కలెక్టర్‌లకు వాటిని పంపించారు.
రైతుల పత్రాల్లో ఫొటోలు ఎందుకు?
ఫొటోల ముద్రణలో మరో ట్విస్ట్ కూడా ఉంది. సందేశాల పేరిట సీఎం ఫొటోతో పాటు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, సీసీఎల్‌ఏ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సర్వే కమిషనర్ ఫొటోలు కూడా అచ్చువేశారు. ఎవరి భూమి ఎక్కడుంది? దాని సరిహద్దులు ఏమిటి? అన్న విషయాలు తెలియజెప్పే ల్యాండ్ పార్సిల్ మ్యాప్ బుక్‌లో రీ సర్వే సందేశాల పేరిట వారి ఫొటోలు కలర్‌ఫుల్‌గా ముద్రించారు. ‘ఇది మాకు అవసరమా?’ అన్నది ఇప్పుడు రైతుల నుంచి గట్టిగా వినిపిస్తున్న ప్రశ్న. రైతులకు భూమి హక్కు పత్రాలు ఇచ్చే సమయంలో సీఎం, మంత్రి, అధికారులు తమ అభిప్రాయాలు తెలియజేయవచ్చు. కావాలంటే ఆ పేరిట ప్రత్యేకంగా పుస్తకాలు ముద్రించుకుని సొంత ప్రచారం చేసుకోవచ్చు. అంతేకానీ, రైతుల భూమి హక్కు పత్రాల్లో వీరి ఫొటోలు, సందేశాలు ఎందుకు? దీనికున్న హేతుబద్ధత ఏమిటి? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎన్నడూ ఆ సంప్రదాయం లేదని చెబుతున్నారు.