జోరు వాన.. ఆగని నడక

ABN , First Publish Date - 2022-09-30T03:00:51+05:30 IST

ఒకవైపు మండుటెండ ఉక్కపోత.. ఇంకోవైపు పెనుగాలులు, జోరువాన.. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ రాజధాని అమరావతి లక్ష్యం రైతులు నడక సాగించారు.

జోరు వాన.. ఆగని నడక

దెందులూరు: ఒకవైపు మండుటెండ ఉక్కపోత.. ఇంకోవైపు పెనుగాలులు, జోరువాన.. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ రాజధాని అమరావతి లక్ష్యం రైతులు నడక సాగించారు. ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ, వివిధ పార్టీల నుంచి మద్ధతు, సామాన్యుల దీవెనలే స్ఫూర్తిగా వందలాది మంది ఏలూరు జిల్లా దెందులూరు మండలంలో గురువారం కదంతొక్కారు. నినాదాలతో హోరెత్తించారు. పాదయాత్ర 18వ రోజున దాదాపు 16 కిలోమీటర్లు కొవ్వలి గ్రామం నుంచి పెరుగుగూడెం వరకు పాదయాత్ర సాగింది. దారి పొడవునా ఇసుకేస్తే రాలనంత జనం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు భారీగా తరలివచ్చారు. వీరికి మహిళలు తోడయ్యారు. అట్టహాసంగా కిలోమీటర్ల కొలది రోడ్లన్నీ కిక్కిరిసాయి. పూల జల్లు కురిసింది. దెందులూరు మండలం కొవ్వలి గ్రామం నుంచి గురువారం ఉదయం మాజీ ఎమెల్యే చింతమనేని ప్రభాకర్‌ సూర్య రధం ఎదుట పూజలు చేసి యాత్రను ఆరంభించారు. కొవ్వలి గ్రామంలో మహిళలు పోటెత్తారు. భారీగా తరలివచ్చి పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు మద్ధతు పలికారు. తిలకాలు దిద్దారు. అమరావతి మనదేనంటూ పిడికిలి బిగించి నినదించారు. భారీగా విరాళాలు ప్రకటించారు. అమరావతి స్ఫూర్తి, రైతులు చేస్తున్న సుదీర్ఘ పాదయాత్ర ఫలితం ఎక్కడికీపోదని, సానుకూలంగానే ఉంటుందని మహిళలంతా ముక్త కంఠంతో పలికారు. పాదయాత్ర ఆరంభ సూచికగా గుమ్మడికాయలు కొట్టి యాత్రలో పాలు పంచుకున్న అందరికీ సంప్రదాయబ్దదంగా దిష్టితీశారు. వీరితోపాటు పెద్ద సంఖ్యలో చిన్నారులు తరలివచ్చారు. వివిధ నృత్యాలు, వేషధారణలతో మద్ధతు ప్రకటించారు. అమరావతి మనదేనంటూ చిన్నారులు కదం తొక్కడం యాత్రకు సరికొత్త శోభనిచ్చింది. కొవ్వలి గ్రామం ఎటు చూసినా వివిధ ప్రాంతాల నుంచి పాదయాత్రకు సంఘీభావం తెలపడానికి వచ్చిన వారితో కిక్కిరిసిపోయింది. 

Read more