Vemireddy: రేడియంట్‌ స్థలంలో కుంభకోణం లేదు: వేమిరెడ్డి

ABN , First Publish Date - 2022-11-08T04:48:38+05:30 IST

విశాఖలోని రేడియంట్‌ డెవలపర్స్‌ స్థలానికి సంబంధించి ఎలాంటి కుంభకోణాలు జరగలేదని, ఆ స్థలానికి పూర్తి హక్కుదారులు వారేనని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

Vemireddy: రేడియంట్‌ స్థలంలో కుంభకోణం లేదు: వేమిరెడ్డి

నెల్లూరు(జడ్పీ) నవంబరు 7: విశాఖలోని రేడియంట్‌ డెవలపర్స్‌ స్థలానికి సంబంధించి ఎలాంటి కుంభకోణాలు జరగలేదని, ఆ స్థలానికి పూర్తి హక్కుదారులు వారేనని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణ చేయడం సరికాదన్నారు. 50 ఎకరాల భూమిని రేడియంట్‌ డెవలపర్స్‌కు టీడీపీ హయాంలో జీవో 77 ద్వారా కేటాయించారని తెలిపారు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన వివాదాలు రావడంతో రేడియంట్‌ సంస్థ కోర్టుని ఆశ్రయించిందని, సుప్రీం కోర్టు తీర్పుతో 2019, ఫిబ్రవరిలో అప్పటి సీఎం చంద్రబాబు సదరు స్థలాన్ని ఆ సంస్థకు అప్పగించినట్లు చెప్పారు. రేడియంట్‌ సంస్థతో తనకు 30 ఏళ్లుగా వ్యాపార లావాదేవీలు ఉన్నాయని, తనపై ఉన్న గుడ్‌విల్‌తో ఆ సంస్థ ఒప్పందం చేసుకుందని తెలిపారు. ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఉంటే విల్లాలకు అనుమతులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయని ప్రశ్నించారు. పత్రాలకు సంబంధించిన ఆర్‌ఓసీలో వైఎస్‌ అనిల్‌ తల్లి భారతమ్మ పేరు ఉంటే ఆమెను ముఖ్యమంత్రి సతీమణి భారతమ్మగా భావించి విమర్శలు చేయడం సంస్కారం కాదన్నారు.

Updated Date - 2022-11-08T04:48:39+05:30 IST