NO salaries: జీతాలకు డబ్బుల్లేవ్‌!

ABN , First Publish Date - 2022-12-13T03:35:19+05:30 IST

డిసెంబరు నెల వచ్చి రెండు వారాలు గడిచిపోతున్నాయి. యినా 45 శాతం ఉద్యోగులకు జీతాలందలేదు. వేతనాలు, పెన్షన్ల రూపంలో ఇంకా రూ.2,000 కోట్లు చెల్లించాలి. నెలాఖరుకైనా అందుతాయో లేదోనని ఉద్యోగులు సందేహిస్తున్నారు.

NO salaries: జీతాలకు  డబ్బుల్లేవ్‌!

2 వారాలైనా పూర్తిగా అందని వేతనాలు

ఉద్యోగులకు ఇంకా 2,000 కోట్లు పెండింగ్‌

జీతాలు అందనివారిలో టీచర్లే అత్యధికం

12 రోజులుగా ఆర్బీఐకి అప్పు పడిన రాష్ట్రం

’ఓడీ’ గట్టెక్కేవరకు ఉద్యోగులకు పస్తులే

వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఆర్బీఐ జమ

ఈ నెల జీతాలందేనా.. ఉద్యోగుల్లో నైరాశ్యం

అమరావతి, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): డిసెంబరు నెల వచ్చి రెండు వారాలు గడిచిపోతున్నాయి. యినా 45 శాతం ఉద్యోగులకు జీతాలందలేదు. వేతనాలు, పెన్షన్ల రూపంలో ఇంకా రూ.2,000 కోట్లు చెల్లించాలి. నెలాఖరుకైనా అందుతాయో లేదోనని ఉద్యోగులు సందేహిస్తున్నారు. ఈ నెల మొదటి రోజు నుంచీ ప్రభుత్వం ఓవర్‌డ్రాఫ్టు (ఓడీ)లోనే ఉంది. అంటే ఆర్‌బీఐకి బాకీ పడుతూనే ఉంది. కార్పొరేషన్లను అడ్డం పెట్టుకుని బ్యాంకుల నుంచి తెస్తున్న దొంగ అప్పులు, కేంద్రం అనుమతిచ్చిన అప్పులు, రాజ్యాంగ విరుద్ధంగా కార్పొరేషన్ల ద్వారా దొడ్డిదారిన సమీకరిస్తున్న అప్పులు, ఇంకా ఉద్యోగులు తమ జీతం నుంచి దాచుకున్న డబ్బులు చాలక ప్రభుత్వం ఆర్‌బీఐ నుంచి ఏ రోజు అప్పు పుడితే ఆ రోజుకి తీసుకుని వాడేస్తోంది. ఈ అప్పులకు ఇతర అప్పుల్లాగా చెల్లించాల్సిన సమయం ఏళ్ల తరబడి ఉండదు. కనిష్ఠంగా 4 రోజుల నుంచి గరిష్ఠంగా 15 రోజుల వరకే ఉంటుంది. ఆర్‌బీఐ నుంచి అందినకాడికి అప్పైతే తెచ్చిన ప్రభుత్వం దాన్ని గడువులోగా చెల్లించలేకపోయింది. అందుకే ఉద్యోగులకు జీతం రూపంలో అందాల్సిన డబ్బులను ఓడీ అప్పు గడువు దాటడంతో ఆర్‌బీఐ ఖజానా నుంచి ఎప్పటికప్పుడు డబ్బు మినహాయించుకుంటోంది.

అందుకే జీతాలివ్వడానికి ఖజానాలో చిల్లిగవ్వ కూడా మిగలడం లేదు. దీంతో అసలీ నెల జీతాలు వస్తాయా అని ఉద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల ప్రారంభంలోనే ఆర్‌బీఐ నుంచి ప్రభుత్వం వేజ్‌ అండ్‌ మీన్స్‌, స్పెషల్‌ డ్రాయల్‌ లిమిట్స్‌, ఓడీ పేరుతో దాదాపు రూ.4,500 కోట్ల అప్పు తెచ్చి వాడేసింది. ఏళ్ల తరబడి, నెలల తరబడి ఉంచుకోవడానికి వీల్లేని అప్పు ఇది. ఈ అప్పుల్లో ఓడీ అప్పు రూ.1,400 కోట్లు దాటితే ఆ దాటిన మొత్తాన్ని నాలుగు పని దినాల్లో, రూ.1,400 కోట్ల లోపు ఉంటే 14 పని దినాల్లోగా ఆర్‌బీఐకి చెల్లించాలి. లేదంటే ఆర్‌బీఐ నేరుగా ఖజానా నుంచి మినహాయించుకుంటుంది. ఉద్యోగులకు ప్రతి నెలా వేతనాలు, పెన్షన్లు కలిపి రూ.5,500 కోట్లు అవసరమవుతాయి. ఈ నెల ప్రభుత్వం 1,2 తేదీల్లో రూ.2,600 కోట్లు చెల్లించింది. వారానికి ఇంకో రూ.900 కోట్లు చెల్లించి చేతులు దులుపుకుంది. మళ్లీ ఇప్పటివరకు పైసా చెల్లించలేదు.

టీచర్లపై పగ

వేతనాలు పడని ఉద్యోగుల్లో ఎక్కువ మంది టీచర్లే ఉన్నారు. దీంతో వారంతా తమపై ప్రభుత్వం పగ బట్టిందని, తాము ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తుండడంతో వేతనాలు సకాలంలో ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వం తన సొంత అవసరాలకు, సొంత అజెండాకు ఎడాపెడా అప్పులు పుట్టించి సమయానికి పనులు పూర్తి చేస్తోంది కానీ, ఉద్యోగుల వేతనాల విషయానికొచ్చే సరికి ఆ శ్రద్ధ కనిపించడంలేదు. మనస్సు ఉండాలేగానీ ప్రభుత్వం వద్ద ఆదాయ మార్గాలకేమీ కొదవలేదు. ఆర్‌బీఐ వద్ద ఓడీ అప్పును ఏదో రకంగా చెల్లించి ఉద్యోగులకు జీతాలివ్వడం పెద్ద సమస్య కాదు. కానీ, డబ్బుల్లేవు....ఆర్‌బీఐ వద్ద ఓడీలో ఉన్నాం... ప్రస్తుతానికి ఇవ్వలేమంటూ ఆర్థికశాఖ ఉన్నతాధికారులు తేల్చిచెప్తున్నట్టు సమాచారం.

Updated Date - 2022-12-13T04:12:05+05:30 IST

Read more