కౌలూ లేదు..ఉపాధీ లేదు..!

ABN , First Publish Date - 2022-07-12T09:16:27+05:30 IST

రాజధానికి భూములిచ్చిన రైతులకు అడుగడుగునా కష్టాలు...కన్నీరు ఎదురవుతున్నాయి. ఏడేళ్లుగా ఈ రైతులు కౌలు అందుకుంటూనే ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం

కౌలూ లేదు..ఉపాధీ లేదు..!

బతికేదెలా అని ప్రశ్నిస్తున్న రాజధాని రైతులు

అసైన్డ్‌ నెపంతో పట్టా భూమికీ కౌలు నిలిపివేత

సీఐడీ విచారణ అంటూ ఏడాదిగా సాకులు

4,500 ఎకరాల పరిధిలో 3వేలమందికి దగా

న్యాయపోరాటానికి సిద్ధమౌతున్న రైతన్నలు

4నెలలుగా కూలీలు, పేదలకు ఆగిన భృతి

టీడీపీ హయాంలో రైతులతోపాటు, కూలీలకూ న్యాయం

20వేలమంది కడుపుపై కొట్టిన జగన్‌ సర్కారు


గుంటూరు, జూలై 11: రాజధానికి భూములిచ్చిన రైతులకు అడుగడుగునా కష్టాలు...కన్నీరు ఎదురవుతున్నాయి. ఏడేళ్లుగా ఈ రైతులు కౌలు అందుకుంటూనే ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక చెల్లింపుల్లో జాప్యం చేసినా మొత్తంమీద తొలి రెండేళ్లు కౌలు జమయింది. కానీ, అసైన్డ్‌ నెపంతో ఈ ఏడాది పూర్తిగా ప్రభుత్వం కౌలు నిలిపివేసింది. ఇలా మూడువేల మంది రైతులకు చెందిన 4,500 ఎకరాల భూమికి కౌలు ఆగిపోయింది. అదేమంటే సీఐడీ విచారణ జరుగుతోందంటూ అధికారులు కుంటిసాకులు చెబుతుని రైతులు ఆగ్రహిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో ఒకే రెవెన్యూలో అత్యధికంగా పట్టాభూములు, అసైన్డ్‌ భూములు కలిసిఉన్నాయి. అయితే రైతులకు వచ్చిన ప్లాట్లను అమ్ముకోనిపక్షంలో రెండూ ఒకే రెవెన్యూ పరిధిలో ఉన్నప్పటికీ అందులో అసైన్డ్‌ భూమి ఎంతో దానికి మాత్రమే కౌలును వైసీపీ ప్రభుత్వం నిలిపివేసింది.


ఇళ్ల ప్లాట్లు అమ్ముకున్న రైతులకు అసైన్డ్‌తోపాటు, పట్టాభూమి కౌలు కూడా నిలిపివేసింది. ఉదాహరణకు మాదాల సురేంద్ర అనే రైతు 5.5 ఎకరాల పట్టా భూమి, నాలుగుఎకరాల అసైన్డ్‌ భూమిని ల్యాండ్‌ పూలింగ్‌లో ఇచ్చాడు. ఇందుకు గాను ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లలో 700 చదరపు గజాలు ఆయన అమ్ముకున్నాడు. అయితే.. అధికారులు మొత్తం 9.5 ఎకరాలకూ కౌలు నిలిపివేశారు. రాజధానిలోని 29 గ్రామాల పరిధిలో వేలమంది రైతులకి ఇదే చేదు అనుభవం ఎదురయింది.


ఒకే రెవెన్యూలో పట్టా, అసైన్డ్‌

మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సిపాయిలకు 1920 నుంచి 30 వరకు ప్రభుత్వం భూములిచ్చింది. పదేళ్ల తరువాత వాటిని అమ్ముకునే వెసులుబాటు కల్పించింది. ఈ భూములపై కొనసాగుతున్న క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లను 2007 నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. రైతులు 2014 జూలైలో హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఆ తరువాత రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ ప్రాంతంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం ల్యాండ్‌పూలింగ్‌ అమలు చేసింది. ఈ సందర్భంగా సీఆర్‌డీఏ జీవోఎంఎస్‌-41 జారీ చేసింది. దానిప్రకారం అసైన్డ్‌ భూములను కూడా పట్టాభూముల ప్యాకేజీ ప్రకారమే తీసుకోవాలని నిర్ణయించారు. ఇందులో మెట్ట భూములకు 1250 చదరపు గజాలు, జరీ భూములకు 1450 చదరపు గజాల చొప్పున ప్లాట్లను లబ్ధిదారులకు మంజూరు చేశారు. ఆయా ప్లాట్ల రిజిస్ట్రేషన్లు కూడా పూర్తయ్యాయి.


అప్పటి నుంచి రైతులకు ఏటా ప్రభుత్వం కౌలు ఇస్తోంది. తొలి ఏడాది రూ.30వేలు, ఆ తరువాత నుంచి ఏటా పది శాతం చొప్పున రూ.3000 పెంచుతూ వచ్చింది. మరోవైపు రాజధానిలో పలుగ్రామాల్లో గతంలో ప్రభుత్వం దళితులకు ఎకరం 33 సెంట్లు, ఎకరం 65 సెంట్లు ఇచ్చింది. ఆయా గ్రామాల్లో రైతులకు సంబంధించిన పట్టాభూమి, అసైన్డ్‌ భూమి ఒకే రెవెన్యూ పరిధిలో ఉంది. ఆ ప్రకారమే ల్యాండ్‌ పూలింగ్‌లో భూమి తీసుకొని ప్లాట్లు ఇచ్చారు. అయితే పలువురు రైతులు కుటుంబ అవసరాల నిమిత్తం తమకు కేటాయించిన ప్లాట్లలో కొంతమేర అమ్ముకున్నారు. దీనిని సాకుగా చూపించి.. ఆ భూములపై సీఐడీ విచారణ జరుగుతోందని చెబుతూ అనేక మంది రైతులకు కౌలు నిలిపివేసింది. అసైన్డ్‌ సాకుతో పట్టాభూములకు కూడా కౌలు నిలిపివేశారు. 


పేదలకు భృతి నిలిపివేత....

రాజధాని ప్రాంతంలోని భూమిలేని వారికి జీవనభృతి నిమిత్తం ప్రభుత్వం నెలకు రూ.2,500 చొప్పున ఇస్తూ వచ్చింది. అయితే గత మార్చి నుంచి నాలుగు నెలలుగా ఈ సాయాన్ని నిలిపివేశారు. దీంతో 20 వేల మంది నిరుపేద రైతులు ఉపాధి లేక  జీవనభృతి లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రాజధాని ప్రాంతంలో చింతమనేని శైలజ అనే మహిళ మృతి చెందారు. ఆమె పేరుతో ఉన్న కౌలును వారసుల పేరు కిందకు బదిలీ చేయటానికి ఏడాది కాలంగా సాధ్యం కావటం లేదు. బాధితులు అధికారుల చుట్టూ తిరుగుతూనేఉన్నారు. 


రాజధాని గ్రామం నీరుకొండకు చెందిన రైతు మువ్వా నరేశ్‌కు 26 ఎకరాల పట్టాభూమి, 4.30 ఎకరాల అసైన్డ్‌ భూమి ఉంది. ల్యాండ్‌ పూలింగ్‌లో భాగంగా అప్పటి ప్రభుత్వం ఒకే రెవెన్యూ పరిధిలోకి పట్టా, అసైన్డ్‌ భూములను తెచ్చింది. మొత్తం 30.30 ఎకరాలను నరేశ్‌ నుంచి తీసుకుని.. బదులుగా 40వేల గజాల స్థలాన్ని ఇచ్చింది. ప్రతి నెలా కౌలు సొమ్ము జమ చేస్తోంది. నరేశ్‌ అందులో వెయ్యి గజాలు అమ్ముకున్నారు. ఆయన అమ్మిన భూముల్లో అసైన్డ్‌ ఉన్నదని, దీనిపై సీఐడీ విచారణ జరుగుతున్నదంటూ ఏడాదిగా మొత్తం 30.30 ఎకరాల భూమికీ వైసీపీ సర్కారు కౌలు నిలిపివేసింది. మరి పట్టాభూములకు కూడా కౌలు ఆపేశారేం అని ప్రశ్నిస్తే...అసైన్డ్‌తో పాటు అవీ ఒకే రెవెన్యూ పరిధిలో ఉన్నాయని అధికారులు సాకులు చెబుతున్నారు. 


న్యాయపోరాటం చేస్తాం..

‘‘ప్రభుత్వం రాజధాని రైతులపై చేస్తున్న కక్షసాధింపుపై న్యాయపోరాటం చేస్తాం. ప్రభుత్వం జీవో నం. 41 జారీ చేసిన తర్వాతే అసైన్డ్‌ భూములకు కూడా పట్టా భూముల ప్యాకేజీ ఇచ్చి ల్యాండ్‌ పూలింగ్‌లో భూమి తీసుకుంది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసైన్డ్‌ భూమి నెపంతో రైతులను ఇబ్బందిపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. గడచిన ఏడేళ్లుగా రైతులకు కౌలు ఇచ్చి ఈ ఏడాది అసైన్డ్‌ పేరుతో కౌలు నిలిపివేయటం కక్ష సాధింపే అవుతుంది. దీనిపై కోర్టును ఆశ్రయిస్తాం’’ 

మాదల సురేంద్రబాబు, రాజధాని రైతు

Updated Date - 2022-07-12T09:16:27+05:30 IST