కొత్తగా 12,615 కేసులు

ABN , First Publish Date - 2022-01-21T09:01:30+05:30 IST

కొత్తగా 12,615 కేసులు

కొత్తగా 12,615 కేసులు

చిత్తూరు, విశాఖల్లో 2వేలకు పైగా 

మూడు జిల్లాల్లో ఐదుగురి మృతి 

26 శాతానికి పెరిగిన పాజిటివిటీ 

53 వేలకు పైగా యాక్టివ్‌ కేసులు 

కర్నూలు, ప్రకాశంలలో 20 మంది 

విద్యార్థులకు, 11మంది టీచర్లకూ


అమరావతి, జనవరి 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య వేలల్లో పెరుగుతోంది. బుధవారం 24శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు గురువారం మరో రెండు శాతం పెరిగి 26కు చేరింది. దీనితో పాటు యాక్టివ్‌ కేసులు కూడా 53,871కు పెరిగాయి. గడిచిన 24గంటల్లో 47,420మందికి పరీక్షలు నిర్వహించగా 12,615 మందికి కరోనా నిర్ధారణ అయిందని ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది. వీటిలో చిత్తూరు జిల్లాల్లో అత్యధికంగా 2,338 కేసులు నమోదయ్యాయి. విశాఖలో 2,117, గుంటూరు 1,066, విజయనగరం 1,039, నెల్లూరు 1,012, అనంతపురం 951, కర్నూలు 884, ప్రకాశం జిల్లాలో 853 చొప్పున కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 21,40,056 మంది కరోనా బారినపడగా 20,71,658 మంది కోలుకున్నారు. ఒకరోజు వ్యవధిలో విశాఖపట్నంలో ముగ్గురు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఐదుగురు కరోనాతో మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ మరణాల సంఖ్య 14,527కు చేరింది. ఇదిలాఉండగా, కర్నూలు జిల్లా ఆత్మకూరు పరిధిలోని బైర్లూటి గిరిజన రెసిడెన్షియల్‌ స్కూల్‌లో 8మంది విద్యార్థులకు కరోనా సోకింది. ఈ పాఠశాలలో 90మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 30మందికి ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించగా 8మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రకాశం జిల్లాలో గురువారం 12మంది విద్యార్థులకు, 11మంది ఉపాధ్యాయులు, ఇద్దరు బోధనేతర సిబ్బందికి కరోనా సోకినట్లు తేలింది. కాగా, రాష్ట్రంలోని అన్ని జైళ్లలో శుక్రవారం నుంచి ములాఖత్‌లను నిలిపివేస్తున్నట్టు జైళ్లశాఖ ఐజీ ఇండ్ల శ్రీనివాస్‌ తెలిపారు. 


బడులకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదు: సురేశ్‌.. రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నా, వైరస్‌ సోకినవారికి అంత తీవ్రత లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ అన్నారు. పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఎక్కడైనా పిల్లలకు కరోనా వస్తే ఆ పాఠశాల వరకు మూసేస్తామని, శానిటైజ్‌ చేసిన తర్వాత  మళ్లీ ప్రారంభిస్తామని చెప్పారు. 

Updated Date - 2022-01-21T09:01:30+05:30 IST