2022 సంవత్సరం కాలగర్భంలో కలిసిపోబోతోంది!!

ABN , First Publish Date - 2022-12-31T04:21:48+05:30 IST

కాలచక్రం గిర్రున తిరిగిపోయింది! 2022 సంవత్సరం కాలగర్భంలో కలిసిపోబోతోంది!! జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ ఏడాది కాలంలో ఎన్నో సంచలనాలు.. మరెన్నో విషాదాలు.. ఇంకెన్నో గుర్తుండిపోయే, బాధపెట్టే, సంతోషించే ఘటనలు!! బాధయినా, సంతోషమైనా..

2022 సంవత్సరం కాలగర్భంలో కలిసిపోబోతోంది!!

కాలచక్రం గిర్రున తిరిగిపోయింది! 2022 సంవత్సరం కాలగర్భంలో కలిసిపోబోతోంది!! జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ ఏడాది కాలంలో ఎన్నో సంచలనాలు.. మరెన్నో విషాదాలు.. ఇంకెన్నో గుర్తుండిపోయే, బాధపెట్టే, సంతోషించే ఘటనలు!! బాధయినా, సంతోషమైనా.. గతం గతః. ఆ గతానికి బైబై చెబుతూనే కొత్త సంవత్సరానికి, కొత్త ఆశలకు సుస్వాగతం చెప్పాల్సిన సమయమిది. అంతేకాదు.. ఆ గత అనుభవాలే ఆధారంగా.. నూతన సంవత్సరం ఎలా ఉండే అవకాశం ఉందో అంచనా వేసుకునే సమయమూ ఇదే.

మహమ్మారికి మంగళం!

1COVID.jpg

దాదాపు ఏడాదిపాటు ప్రపంచదేశాలను గడగడలాడించి.. రెండేళ్లపాటు ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి కథ ఇక ముగిసినట్టే అనుకుంటున్న దశలో.. 2022 చివర్లో పుట్టింట(చైనాలో) దాని విశ్వరూపం మొదలైంది. దీంతో ప్రపంచదేశాలన్నీ మళ్లీ అప్రమత్తమయ్యాయి. జపాన్‌, అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో గణనీయంగా కేసులు పెరుగుతున్నాయి. భారత్‌లో కూడా జనవరిలో నాలుగో వేవ్‌ వస్తుందన్న ఆందోళనలు చాలా మందిలో నెలకొన్నాయి. అయితే.. కొత్త వేరియంట్‌ నేపథ్యంలో టెస్టుల సంఖ్య పెంచడం వల్ల కేసుల సంఖ్య కూడా సహజంగానే పెరుగుతుందని.. దాని గురించి ఆందోళన చెందాల్సిన పని లేదని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే... భారత్‌ ఎదుర్కొన్న డెల్టా వేరియంట్‌తో పోలిస్తే కొత్త వేరియంట్ల తీవ్రత చాలా తక్కువని, వేవ్‌ వచ్చినా ఆస్పత్రిపాలయ్యే, మరణించేవారి సంఖ్య చాలా చాలా తక్కువగా ఉంటుందని వారు చెబుతున్నారు. భయపడకుండా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తే సరిపోతుందని సూచిస్తున్నారు. పెద్దఎత్తున ఇన్ఫెక్షన్లు, సమర్థమైన వ్యాక్సిన్ల కారణంగా ప్రపంచదేశాలన్నింటిలోనూ ఇప్పటికే కరోనాకు హెర్డ్‌ ఇమ్యూనిటీ రావడం.. చైనాలోనూ మెజారిటీ జనాభా వైరస్‌ బారిన పడుతున్న నేపథ్యంలో ఇక ఆ మహమ్మారి కథ పూర్తిగా ముగిసిపోకున్నా.. సాధారణ జలుబులా మారిపోతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. 2023 నుంచి కొవిడ్‌ కేసుల సంఖ్యను, దానికి సంబంధించిన డేటాను ప్రచురించకూడదని యూకే ఇప్పటికే నిర్ణయించింది.

కాంగ్రె్‌సకు జీవన్మరణ సమస్య

2CONGRESS-LOGO.jpg

వరుసగా రెండుసార్లు సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయూ కూటమి గెలుపుతో ఇప్పటికే దయనీయ పరిస్థితికి చేరిన కాంగ్రె్‌సకు.. కొత్త ఏడాది నిజంగా జీవన్మరణ సమస్యే! ఎందుకంటే.. తదుపరి సార్వత్రిక ఎన్నికలు జరిగేది వచ్చే ఏడాదే అయినా, దానికి కావాల్సిన పూర్వరంగం అంతా ఈ ఏడాదే 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల రూపంలో ఏర్పడబోతోంది మరి! ఆ తొమ్మిది రాష్ట్రాల్లో నాలుగు కాంగ్రె్‌సకు అత్యంత కీలకమైనవి. విపక్షాలన్నీ ‘హస్తం’ వెనుక ర్యాలీ అవ్వాలా.. లేక శతాధిక వసంతాల ఆ పార్టీయే అనామకంగా వాటి వెనుక నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా.. అనే విషయాన్ని తేల్చేది ఆ నాలుగు రాష్ట్రాల ఎన్నికలే. అవి కర్ణాటక, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీ్‌సగఢ్‌. వీటిలో.. దక్షిణాదిన బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీకి సానుకూల పవనాలు వీస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోనూ శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సర్కారుపై ఉన్న వ్యతిరేకతపై కాంగ్రెస్‌ ఆశలు పెట్టుకుంది. ఎన్నికలకు రాష్ట్రస్థాయి మేనిఫెస్టోతో సరిపెట్టకుండా జిల్లాలవారీగా మేనిఫెస్టోలు విడుదల చేయాలని నిర్ణయించి ఆమేరకు వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు.. బీజేపీ కూడా ప్రభుత్వ వ్యతిరేకతను తప్పించుకునేందుకు ఈసారి శివరాజ్‌సింగ్‌ను కాకుండా మరొకరిని సీఎం అభ్యర్థిగా ప్రకటించి, ఎన్నికలకు వెళ్లబోతోందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక, ఛత్తీ్‌సగఢ్‌లో.. 2018 తర్వాత వచ్చిన ఐదు ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థులే గెలిచారు. ఆ రాష్ట్ర సీఎం బాఘెల్‌ ఇటీవలే 3 కొత్త జిల్లాలు ప్రారంభించి అక్కడ రూ.900 కోట్లకు పైగా సొమ్ముతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఆ రాష్ట్రంలో మరోసారి గెలుపుపై కాంగ్రెస్‌ భరోసాతో ఉంది. మిగిలింది.. అతి పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన రాజస్థాన్‌. అక్కడ కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత విభేదాలతో.. సీఎం అశోక్‌ గహ్లోత్‌, సచిన్‌ పైలట్‌ వర్గాల మధ్య ఘర్షణతో సతమతమవుతోంది. బీజేపీ ఈ అంశంపైనే ఆశలు పెట్టుకుని ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ రాష్ట్రాలతోపాటు.. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌, మిజోరం, తెలంగాణ రాష్ట్రాలకు, 2018 నుంచి రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్ము, కశ్మీర్‌కు 2023లో ఎన్నికలు జరగనున్నాయి.

5జీ బూమ్‌

25G.jpg

దేశంలో 5జీ సేవలు 2022లోనే అందుబాటులోకి వచ్చినప్పటికీ.. నామమాత్రంగా దేశంలోని కొన్ని ప్రధాన నగరాలకు, ఆయా నగరాల్లోనూ కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యాయి! కొన్ని చోట్ల 5జీ సేవలు అందుబాటులోకి వచ్చినా.. కాల్‌ డ్రాప్‌, మొబైల్‌ డేటా సేవలకు అంతరాయం ఏర్పడడం వంటి ఫిర్యాదులు బాగా వినిపించాయి. దీంతో టెలికం కంపెనీలు ఈ సమస్యలను పరిష్కరించడంపై దృష్టిసారించాయి. ఫలితంగా 2023లో 5జీ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయనడంలో సందేహం లేదు. దీనివల్ల స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో కూడా 5జీ ఫోన్లకు డిమాండ్‌ విపరీతంగా పెరుగుతుందని.. 2023 సెప్టెంబరు ముగిసేనాటికి దేశంలో 10 కోట్ల 5జీ స్మార్ట్‌ఫోన్లు అమ్ముడవుతాయని ‘కౌంటర్‌పాయింట్‌ రిసెర్చ్‌’ సంస్థ అంచనా వేస్తోంది.

ఆకాశం నీ లక్ష్యంరా..

2ROCKET.jpg

కరోనా కారణంగా గడిచిన రెండేళ్లుగా భారీ ప్రాజెక్టులు చేపట్టని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ ఏడాది విదేశీ ఉపగ్రహాలను సైతం రోదసిలోకి పంపి వాణిజ్యపరంగా సత్తా చాటింది. ఈఏడాది మన ఇస్రో లాంచ్‌చేసిన మొత్తం ఉపగ్రహాల సంఖ్య ఏకంగా.. 381. ఇక.. 2024జూన్‌ నాటికి నిర్వహించబోయే గగన్‌యాన్‌కు సంబంధించిన పనులను ఇస్రో ఈ ఏడాది వేగవంతం చేయనుంది. ఈ మిషన్‌కు సంబంధించిన తొలి ట్రయల్‌ను 2023 చివర్లో చేపట్టే అవకాశం ఉంది. ఇక, సూర్యుడిపై పరిశోధనలు చేపట్టేందుకు నాసా ‘పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌’ తరహాలోనే.. ఇస్రో కూడా సూర్యుడిపై పరిశోధనలకు ‘ఆదిత్య ఎల్‌1’ పేరిట చేపట్టిన ప్రాజెక్టును 2023 మార్చిలో లాంచ్‌ చేసే అవకాశం ఉంది. ఇక, 2019 జూలైలో నిర్వహించిన చంద్రయాన్‌ 2 ఆఖరు నిమిషంలో విఫలమైన నేపథ్యంలో.. ఇస్రో ‘చంద్రయాన్‌ 3’ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ ప్రయోగాన్ని 2023లో చేపట్టాలని నిర్ణయించింది. ఇంకా.. ఎక్స్‌ కిరణాల అధ్యయనానికి సంబంధించిన ‘ఎక్స్‌రే పోలారిమీటర్‌ శాటిలైట్‌’ ప్రయోగం కూడా 2023లోనే చేపట్టనున్నారు. మంగళ్‌యాన్‌2 (మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌ 2), శుక్రయాన్‌ మిషన్లను ఇస్రో వేగవంతం చేయనుంది. కాగా. విక్రమ్‌-ఎస్‌ రాకెట్‌ను లాంచ్‌చేసిన ప్రైవేట్‌ స్పేస్‌ లాంచ్‌ కంపెనీ ‘స్కైరూట్‌ ఏరోస్పేస్‌’.. 2023లో తొలి శాటిలైట్‌ను లాంచ్‌ చేయనుంది.

బీఆర్‌ఎస్‌ పరిస్థితేంటి?

1KCRDSC_0265.jpg

ఈ ఏడాది కేసీఆర్‌కు రాజకీయపరంగా జీవన్మరణ సమస్యే. టీఆర్‌ఎ్‌సను జాతీయ పార్టీ(బీఆర్‌ఎస్‌)గా మార్చి.. ఇతర రాష్ట్రాలకూ విస్తరిస్తామని.. పైకి బింకంగా చెబుతున్నా తమ కార్యక్షేత్రమైన తెలంగాణలోనే బీజేపీ నుంచి ఆ పార్టీకి గట్టి సవాలు ఎదురవుతున్న పరిస్థితి. నిరుడు సకలశక్తులూ ఒడ్డి పోరాడినా హుజూరాబాద్‌లో ఓటమి తప్పలేదు. ఈ ఏడాది మునుగోడులో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ యంత్రాంగం మొత్తం అక్కడే తిష్ఠవేసి ప్రచారం చేసినా, కమ్యూనిస్టులను సైతం కలుపుకొని పోయినా.. ఫామ్‌హౌజ్‌లో ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ ప్రయత్నించిందంటూ ఎంత హడావుడి చేసినా.. గెలుపు దక్కడమే ‘పదివేలు’ అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది! ఇది రాష్ట్రంలో ప్రభుత్వంపై ప్రజలకున్న వ్యతిరేకతకు నిదర్శనం అని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ పరిస్థితి ఇలా ఉండగా.. పార్టీ పేరును భారత్‌ రాష్ట్ర సమితిగా మార్చి ఇతర రాష్ట్రాలకూ విస్తరించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయన్నది ప్రశ్నార్థకమే. 2023లో ముందస్తు ఎన్నికలకు వెళ్లినా.. షెడ్యూలు ప్రకారమే జరిగినా.. ఇక్కడ విజయం సాధిస్తే మాత్రమే ఆ పార్టీ ‘జాతీయ’ ఆకాంక్షల దిశగా అడుగులు వేసే అవకాశం ఉందని విశ్లేషకులు తేల్చిచెబుతున్నారు.

మాంద్యం ముప్పు

లాక్‌డౌన్లు, కరోనా వేవ్‌ల దెబ్బకు 2021లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ తల్లకిందులయ్యాయి. 2022లో నెమ్మదిగా పుంజుకుంటున్న దశలో పులిమీద పుట్రలా రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వచ్చిపడింది. దీంతో పలుదేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. కొత్త ఏడాదిలో కూడా పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదని.. ప్రపంచం ఆర్థిక మాంద్యం ముప్పు ముంగిట ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2023లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి రేటు (గ్లోబల్‌ గ్రోత్‌) 2.7 శాతం మేర పడిపోతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) అంచనా వేస్తోంది. ద్రవ్యోల్బణం కట్టడికి అన్ని దేశాల రిజర్వు బ్యాంకులు తీసుకుంటున్న, తీసుకోబోయే నిర్ణయాలు.. చైనాలో కరోనా విశ్వరూపం పర్యవసానాలు.. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో ముడిచమురు ధరలు.. ఈ మూడే 2023లో ఆర్థిక మాంద్యం ముప్పు ఉండేదీ లేనిదీ నిర్ణయించే కీలక అంశాలని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మాంద్యం వచ్చినా రాకున్నా.. కొత్త ఏడాదిలో ఆర్థిక వృద్ధి గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత నెమ్మదిగా ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు.

మూడోస్సారి..వరుసగా మూడో ఏడాది

గూగుల్‌ ట్రెండ్స్‌లో ఐపీఎల్‌ టాప్‌

2IPL-LOGO.jpg

వరుసగా మూడో ఏడాది గూగుల్‌ సెర్చ్‌లో ‘ఐపీఎల్‌’ టాప్‌లో నిలిచింది. 2020, 2021 సంవత్సరాల్లో దేశంలో అత్యధికులు ఐపీఎల్‌ గురించి సెర్చ్‌ చేసిన సంగతి తెలిసిందే. 2022లో కూడా అదే ట్రెండింగ్‌లో నిలవడం గమనార్హం. అంతర్జాతీయస్థాయిలోనూ గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌ పదో స్థానంలో నిలిచింది. అంతేకాదు.. అంతర్జాతీయంగా టాప్‌10లో నిలిచిన అంశాల్లో నాలుగు (ఐపీఎల్‌, ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌, ఇండియా వర్సెస్‌ సౌతాఫ్రికా, ఇండియా వర్సెస్‌ వెస్టిండీస్‌) క్రికెట్‌ సంబంధితమైనవే కావడం విశేషం. ఐపీఎల్‌తోపాటు... ఫిఫా వరల్డ్‌ కప్‌, ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌, కామన్వెల్త్‌ గేమ్స్‌, ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ క్రీడల విభాగంలో టాప్‌లో ఉన్నాయి. ఈ-శ్రమ్‌ కార్డు, కొవిన్‌.. సినిమాల్లో కేజీఎఫ్‌ చాప్టర్‌ 2, బ్రహ్మాస్త్ర పార్ట్‌1 టాప్‌ ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇంకా.. అగ్నిపథ్‌ స్కీమ్‌, నాటో, ఎన్‌ఎ్‌ఫటీ.. వ్యక్తుల్లో నూపుర్‌ శర్మ, ద్రౌపది ముర్ము, రిషి సునాక్‌ వంటివారు ట్రెండింగ్‌లో ఉన్నారు.

ఈవీలకు స్వర్ణయుగం

1EV.jpg

భారతదేశంలో 2022లో ఊపందుకున్న విద్యుత్తు వాహనాల వాడకం.. 2023లో మరింతగా పెరగనుంది. ప్రభుత్వాలు పెద్దఎత్తున ప్రోత్సాహకాలు ప్రకటించడంతో ఇప్పటికే చాలా మంది విద్యుత్తు వాహనాల కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారు. విద్యుత్తు వాహనాల కొనుగోలులో ఉత్తరప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉండగా.. తమిళనాడు, కర్ణాటక ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2023 ముగిసేనాటికి రోడ్లపై 22 లక్షల ఎలక్ట్రిక్‌ వాహనాలు ఉంటాయని అంచనా. 2024 నాటికి ఆ సంఖ్య 39లక్షలకు, 2025 నాటికి 56.2 లక్షలకు, 2026 నాటికి 75.1 లక్షలకు, 2027 నాటికి 91 లక్షలకు చేరుతుందని అంచనా.

ఆదాయపన్ను పరిమితి పెరిగేనా?

ఈ పర్యాయానికి ఎన్డీయే సర్కార్‌ 2023లో పెట్టబోయేదే ఆఖరు పూర్తిస్థాయి బడ్జెట్‌. 2024 ఎన్నికల సంవత్సరం కాబట్టి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ మాత్రమే ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. 2023లో నాలుగు కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు.. 2024లో సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది బడ్జెట్‌లో మోదీ సర్కారు పేద, మధ్య తరగతిపై కనికరం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదాయపన్ను పరిమితిపై వేతన, మధ్యతరగతి జీవులు భారీ ఆశలే పెట్టుకున్నారు. ఆదాయపన్ను పరిమితిని ప్రస్తుతమున్న రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఓటీటీల విస్ఫోటం

2OOT.jpg

కరోనా దెబ్బకు ప్రజలంతా లాక్‌డౌన్‌ సమయంలో ఇళ్లకే పరిమితమైనప్పుడు వారికి వినోదాన్ని పంచింది ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లే. గత రెండేళ్లలో దేశంలో ఓటీటీల విస్తృతి బాగా పెరిగింది. ప్రస్తుతం మనదేశంలో ఓటీటీ వినియోగదారుల సంఖ్య 4.5 కోట్లుగా ఉంది. 2023 చివరికి అది 5 కోట్లకు చేరుతుందని ‘మీడియా పార్ట్‌నర్స్‌ ఏసియా’ నివేదిక అంచనా వేసింది. ఓటీటీ మార్కెట్‌ విలువ రూ.12 వేల కోట్లకు చేరుతుందని పేర్కొంది.

క్రికెట్‌.. హాకీ.. వరల్డ్‌కప్‌ పోటీలకు వేదికగా భారత్‌

ICC-MENS-CRICKET-WORLD-CUP.jpg

జాతీయ క్రీడ అయిన హాకీ వరల్డ్‌ కప్‌కు.. దేశ యువత అంతా అనధికారిక జాతీయ క్రీడగా భావించే క్రికెట్‌ వరల్డ్‌ కప్‌కు.. 2023లో భారతదేశమే ఆతిథ్యం ఇవ్వనుండడం విశేషం. 1987, 1996, 2011లోనూ మనదేశం వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లకు వేదిక అయినప్పటికీ.. 1987లో పాకిస్థాన్‌తో కలిసి, 1996లో పాకిస్థాన్‌, శ్రీలంకతో కలిసి, 2011లో శ్రీలంక, బంగ్లాదేశ్‌తో కలిసి ఈ పోటీలను నిర్వహించింది. కానీ, 2023లో వరల్డ్‌ కప్‌ను భారతదేశమే సోలోగా నిర్వహించనుంది. ఇక, అంతర్జాతీయ హాకీ సమాఖ్య 2023 పురుషుల హాకీ వరల్డ్‌కప్‌ పోటీలను కళింగ స్టేడియం (భువనేశ్వర్‌), బిర్సా ముండా ఇంటర్నేషనల్‌ హాకీ స్టేడియం (రూర్కెలా)లో జనవరి 13 నుంచి 29 దాకా నిర్వహించనుంది.

యుద్ధము.. శాంతి!

1WAR.jpg

కరోనా దెబ్బకు కుదేలైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుంటోందనుకున్న దశలో మొదలైన రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం.. ఈ ఏడాది మళ్లీ పలు దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసేసింది! ఈ యుద్ధంలో రెండు వైపులా చెరో లక్ష మంది సైనికులు చనిపోయి ఉంటారని అంచనా! ఈ యుద్ధం వల్ల ఈయూ దేశాలు ముడిచమురు సంక్షోభంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఇన్ని దేశాలకు ఇన్ని ఇక్కట్లు కలిగిస్తున్న ఈ యుద్ధం 2023లో ముగిసేనా? శాంతి నెలకొనేనా? లేక చాలామంది భయపడుతున్నట్టు అణుయుద్ధానికి దారి తీస్తుందా? అంటే.. క్షేత్రస్థాయిలో యుద్ధం తీవ్రంగానే కొనసాగుతున్నప్పటికీ ఉక్రెయిన్‌ నుంచి తాము విలీనం చేసుకున్న భూభాగాల్ని రష్యాలో భాగంగా పరిగణిస్తే చర్చలకు తాను సిద్ధమని పుతిన్‌ ప్రకటించడం ఒకింత ఆశావహ పరిణామం. దానికి తోడు.. అణ్వాయుధాలను విచక్షణ లేకుండా ముందుగా ప్రయోగించబోమని పుతిన్‌ ఇప్పటికే ప్రకటించడం కూడా ఊరటనిచ్చేదే. అలాగని పూర్తిగా వెనక్కి తగ్గేందుకు కూడా పుతిన్‌ సిద్ధంగా ఉన్నట్లు కనిపించట్లేదు. ‘ఇదొక సుదీర్ఘ ప్రక్రియ’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. చరిత్ర చూసినా.. ఇరాన్‌-ఇరాక్‌ యుద్ధం దాదాపు ఎనిమిదేళ్లు, వియత్నాం వార్‌ 20 ఏళ్లు సాగాయి! ఆ కోవలోనే రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కొనసాగితే ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలకు అది పెద్ద దెబ్బే! అందునా 2023లో భారీ మాంద్యం ముప్పు పొంచి ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ యుద్ధం ముగియడం ఎంతైనా అవసరం.

Updated Date - 2022-12-31T09:56:34+05:30 IST