పోలవరంపై కొత్త పేచీ!

ABN , First Publish Date - 2022-10-05T08:21:09+05:30 IST

పోలవరంపై కొత్త పేచీ!

పోలవరంపై కొత్త పేచీ!

పొరుగు రాష్ట్రాలను కేంద్రం ఒప్పిస్తేనే ముందుకు

రాజకీయ ఎజెండాగా మార్చేస్తున్న తెలంగాణ, ఒడిసా, ఛత్తీ్‌సగఢ్‌

12 ప్రశ్నలు సంధించిన తెలంగాణ

సమగ్ర అధ్యయనం కోరిన ఒడిసా

వారిని ఒప్పించాల్సింది కేంద్రమే!

లేదంటే ప్రాజెక్టు భవిష్యత్‌ అగమ్యగోచరమే

సాగునీటి నిపుణుల ఆందోళన


పోలవరం ప్రాజెక్టు డిజైన్ల ఆమోదం, నిధుల కోసం కేంద్రంతో పోరాడుతున్న రాష్ట్రప్రభుత్వానికి.. వేరే కోణంలో గడ్డు పరిస్థితి తలెత్తింది. పొరుగు రాష్ట్రాలు దీనిని రాజకీయ ఎజెండాగా మార్చేస్తున్నాయి. కేంద్రం ముందుకెళ్లకుండా మోకాలడ్డేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొత్త కొత్త పేచీలకు దిగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కేంద్రం ఎదుట పలు సందేహాలు పెట్టి.. వాటిని నివృత్తి చేస్తేనే ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తామని షరతు పెడుతోంది. జాతీయ హోదా ప్రాజెక్టుగా దానిని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే. పొరుగు రాష్ట్రాలు చెప్పే అభ్యంతరాలకు సంజాయిషీ ఇవ్వాల్సిందీ అదే. అయితే వాటి సందేహాలను ఎలా నివృత్తి చేస్తుందన్నది కీలకంగా మారింది.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పోలవరం ప్రాజెక్టు పూర్తిపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కేంద్రం నుంచి ఇప్పటిదాకా నిధుల కోసం పోరాడుతున్న రాష్ట్రప్రభుత్వం.. ఇప్పుడు పొరుగు రాష్ట్రాల వ్యతిరేకతను అధిగమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిధుల సమస్య కాస్తా అనుమతుల వైపు మళ్లి.. క్రమేపీ రాజకీయ చట్రంలోకి వెళ్లిపోయే ప్రమాదాలు కనిపిస్తున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇందుకు ప్రధాన కారణం పొరుగు రాష్ట్రాలు దీనిని రాజకీయ ఎజెండాగా మార్చే యత్నాలు చేయడమే! అదే జరిగితే ప్రాజెక్టు భవిష్యత్‌ అగమ్యగోచరమేనని సాగునీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు అదేశాల మేరకు.. గత నెల 29వ తేదీన ప్రాక్టు కారణంగా ముంపుబారినపడే ఛత్తీ్‌సగఢ్‌, ఒడిసా, తెలంగాణతో పాటు.. లబ్ధిదారు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌తో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శులూ లేవనెత్తిన కీలకమైన సాంకేతిక సమస్యలపై ఈ నెల 7వ తేదీన జరిగే సమావేశంలో చర్చించి పరిష్కరించాలని ఆదేశించారు. ఆ సమస్యలకు కేంద్ర జల సంఘం, పీపీఏ, డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌ (డీడీఆర్‌పీ), ప్రాజెక్టు అధికారులు సమాధానాలు చెబుతారని రాష్ట్రాలకు కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. ప్రాజెక్టుపై సాంకేతిక సందేహాలకు సంబంధించిన ప్రశ్నావళిని సోమవారం (ఈ నెల 3వ తేదీ)నాటికి పంపాలని ఆయా రాష్ట్రాలకు సూచించింది. దీంతో తెలంగాణ నీటి పారుదల శాఖ సోమవారం జలశక్తి శాఖ, పీపీఏలకు 12 అంశాలతో కూడి ప్రశ్నావళిని పంపి.. వాటిపై సమాచారాన్ని కోరింది. ఇందులోనే కొత్త వాదన తెరపైకి తెచ్చింది. పోలవరం ప్రాజెక్టును 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని తట్టుకునేలా డిజైన్‌ చేసినప్పటికీ.. 58 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశముందని తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌ కొత్త సందేహాన్ని లేవనెత్తారు. స్పిల్‌వే గేట్లను ఎత్తి ఉంచినప్పటికీ ప్రవాహ వేగాన్ని నిరోధిస్తుందని.. ఫలితంగా బ్యాక్‌ వాటర్‌ భద్రాచలాన్ని ముంచేస్తుందని తెలంగాణ అంటోంది. ఈ ఏడాది జూలైలో వచ్చిన వరదకు తెలంగాణలోని 118 గ్రామాలు ముంపునకు గురయ్యాయని.. పోలవరం ప్రాజెక్టు వల్లే ఇలా జరిగిందని.. ఆ గ్రామాలన్నిటికీ భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలను 2013 భూసేకరణ చట్టం ప్రకారం చేపటాలని డిమాండ్‌ చేస్తోంది. ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి హానీ జరగదని సంతృప్తి చెందినప్పుడు మాత్రమే పోలవరం నిర్మాణానికి అభ్యంతరం లేదని ప్రకటిస్తామని.. అప్పటి దాకా సహకరించేది లేదని రజత్‌కుమార్‌ తేల్చిచెప్పారు. తమ భూభాగంలోని ముంపు ప్రాంతాలకు సంబంధించి కరకట్టల నిర్మాణం.. నీటి నిల్వల ప్రభావం వంటి అంశాలపై సమగ్ర అధ్యయన నివేదిక ఇవ్వాలని జలశక్తి శాఖను ఒడిసా కోరింది.


తెలంగాణ కోరిన సమాచారమిదీ..

తమ ప్రశ్నావళిని, తాము కోరుతున్న సమాచారాన్ని తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌రావు కేంద్రానికి, పీపీఏకి మెయిల్‌ చేశారు.

తెలంగాణ ప్రాంతంలో 2005లో చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ వివరాలను వెల్లడించాల్సిందే.

2019లో కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలోని సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) గుర్తించిన తెలంగాణలో ముంపునకు గురయ్యే భూభాగం.. సహాయ పునరావాసానికి అయ్యే వ్యయం తదితర వివరాలు.

స్పిల్‌వే పారామీటర్లు.. ఫ్లడ్‌ ఇన్‌ఫ్లో హైడ్రోగ్రాఫ్‌ డిజైన్‌.. స్పిల్‌వే రేటింగ్‌ కర్వ్‌ .. ఎలివేషన్‌ కేపాసిటీ కర్వ్‌ వివరాలు..

25.53 లక్షల క్యూసెక్కుల, 36 లక్షల క్యూసెక్కుల ప్రవాహ సమయంలో బ్యాక్‌వాటర్‌ ప్రభావంపై 2006 వరదల సమయంలో కేంద్ర జల సంఘం నిర్వహించిన అధ్యయన నివేదికలోని ప్రధానాంశాలు.. వాటి విశ్లేషణ ఆధారంగా ముంపు నివారణ చర్యలు. వరద కాలువ నిర్మాణ ప్రణాళిక.

పేరూరు, భద్రాచలం, కుంట(కూనవరం), పోలవరం (జీ అండ్‌ డీ) సైట్‌లలో స్టేజ్‌ డిశ్చార్జ్‌ కర్వ్‌ వేలిడేషన్‌ వివరాలు.

మేథమెటికల్‌ మోడలింగ్‌లో రీచ్‌వారీ డిశ్చార్జ్‌ సమాచారం.

మేథమెటికల్‌ మోడలింగ్‌లో సరిహద్దు గ్రామాల స్థితిగతులు. క్షేత్రస్థాయిలో మోడల్‌ స్టడీ వివరాలు.

పది నదులపై నిర్మించిన రేడియల్‌ గేట్ల అధ్యయనం ఆధారంగా.. పోలవరం ప్రాజెక్టు రేడియల్‌ గేట్ల డిజైన్లు.. వాటి పనితీరు.

ఈ ఏడాది జూన్‌ 1 నుంచి వరద కారణంగా భద్రాచలం, పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి జలాలు ప్రతి గంటకూ సముద్రంలో కలిసిన సమాచారం.

ఎగువ, దిగువ కాఫర్‌డ్యాంల వద్ద రోజువారీ నీటి నిల్వ సమాచారం.

గరిష్ఠ నీటి నిల్వ కారణంగా తెలంగాణ భూభాగంలోని స్థానిక వాగులు, కాలువలపై ప్రభావం. 


ఉదాసీనంగా ఉంటే ముప్పే

ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నిధులిస్తే చాలని భావిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు.. అదొక్కటే చాలదని .. పొరుగు రాష్ట్రాల సహకారమూ కావలసిందేనని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. గరిష్ఠ స్థాయిలో 194.60 టీఎంసీల నీటి నిల్వ దిశగా చర్యలు తీసుకోకుండా.. హడావుడిగా 41.15 మీటర్ల కాంటూరులో కేవలం 90 టీఎంసీల నిల్వకే పరిమితం చేసేసి.. ప్రాజెక్టు పూర్తిచేసేశామన్న ఘనత దక్కించుకోవాలని జగన్‌ ప్రభుత్వం ఉబలాటపడుతోంది.  ప్రజాప్రయోజనాల కోసం సమయం వచ్చినప్పుడు పొరుగు రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయో ఈ ఉదంతం స్పష్టం చేస్తోందని నిపుణులు అంటున్నారు. పొరుగు రాష్ట్రాలకు నచ్చజెప్పే బాధ్యతను కేంద్రానిపై నెట్టేసి రాష్ట్రప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తే మొదటికే ముప్పు వస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఆ రాష్ట్రాలను కేంద్రం ఒప్పించేదాకా ప్రాజెక్టు నిర్మాణం ముందుకు సాగదని హెచ్చరిస్తున్నారు.

Read more