జగనన్నా.. చదువులెట్టన్నా!!

ABN , First Publish Date - 2022-07-17T08:49:52+05:30 IST

నూతన విద్యా విధానం పేరిట రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు విద్యార్థులకు శాపంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే ఇరుకు..

జగనన్నా.. చదువులెట్టన్నా!!

రెండే గదులు.. 275 మంది విద్యార్థులు

విలీనం పేరుతో మరో 98 మంది విద్యార్థులు

అనకాపల్లి తారకరామ పాఠశాలకు కొత్త కష్టాలు 


అనకాపల్లి రూరల్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి): నూతన విద్యా విధానం పేరిట రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు విద్యార్థులకు శాపంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే ఇరుకు గదుల్లో అవస్థలు పడుతూ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులను విలీనం పేరుతో మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తోంది. అనకాపల్లి పట్టణ పరిధిలో గల అక్కిరెడ్డిపాలెం శివారు తారకరామ కాలనీలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఇందుకు ఉదాహరణ. ఇక్కడ రెండు తరగతి గదులు, మరో రెండు రేకుల షెడ్లు మాత్రమే ఉన్నాయి. 3 నుంచి 10వ తరగతి వరకు 275 మందికిపైగా విద్యార్థులున్నారు. ఒక్కో గదిలో రెండు తరగతులు, బయట రేకుల షెడ్లలో మరో రెండు తరగతులు, కొందరికి వరండాలో పాఠాలు బోధిస్తున్నారు.


దీంతో ఏకాగ్రత కుదరక విద్యార్థులకు పాఠాలు అర్థంకాక అవస్థలు పడుతున్నారు.  ఇదిలా ఉంటే.. సమీప పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులు చదువుతున్న మరో 98 మంది విద్యార్థులను  ఈ పాఠశాలలో విలీనం చేసేందుకు ఇటీవల విద్యా శాఖ అధికారులు మ్యాపింగ్‌ చేశారు. దీంతో ఇక్కడున్న విద్యార్థులకు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. అదనపు తరగతి గదులు నిర్మించాలని ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఎప్పటి నుంచో అధికారులను కోరుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. వర్షాలు కురిస్తే  విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతం.  రేకుల షెడ్ల కింద బోధన సాధ్యం కాకపోవడంతో సెలవులిచ్చిన సందర్భాలు లేకపోలేదు. వసతులు కల్పించాల్సిందిపోయి, అందుకు భిన్నంగా విలీనం పేరుతో మరో 98 మందిని పంపేందుకు మ్యాపింగ్‌ చేయడాన్ని గ్రామస్థులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రోపాధ్యాయ సంఘం నేతలు ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్‌ దృష్టికి తీసుకువెళ్లారు.

Read more