నెల్లూరు అడవి సేఫ్‌!

ABN , First Publish Date - 2022-09-21T09:37:31+05:30 IST

నెల్లూరు జిల్లా రాపూరు మండలం పంగిలి గ్రామ పరిధిలోని అటవీ పోరంబోకు భూముల వ్యవహారంపై యంత్రాంగం అప్రమత్తమైంది. ‘అటవీ భూమిలో రాబందులు’ శీర్షికన సోమవారం ‘ఆంధ్రజ్యోతి’

నెల్లూరు అడవి సేఫ్‌!

1803 ఎకరాలు రిజర్వు ఫారెస్టుగా మార్పు సర్వే చేసి 

కొట్టేయాలనుకున్న పెద్దలు

వీరి పన్నాగం బయటపెట్టిన ‘ఆంధ్రజ్యోతి’ 

కదిలిన రెవెన్యూ..రిజర్వ్‌పై ప్రతిపాదనల తయారీ

244 ఎకరాల్లో పట్టాల రద్దుకు నిర్ణయం


నెల్లూరు, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : నెల్లూరు జిల్లా రాపూరు మండలం పంగిలి గ్రామ పరిధిలోని అటవీ పోరంబోకు భూముల వ్యవహారంపై యంత్రాంగం అప్రమత్తమైంది. ‘అటవీ భూమిలో రాబందులు’ శీర్షికన సోమవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనంతో రెవెన్యూ అధికారులు కదిలారు. ఇప్పటివరకు రెవెన్యూ పరిధిలో ఉన్న 1803 ఎకరాలను రిజర్వ్‌ ఫారె్‌స్టగా మార్చేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు తయారవుతున్నాయి. మంగళవారం రాత్రి రెవెన్యూ అధికారులు ఇదే పనిలో నిమగ్నమయ్యారు. భవిష్యత్‌లో ఎటువంటి అక్రమాలకు తావులేకుండా బుధవారం నాటికే ఈ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని నిర్ణయం తీసుకున్నారు.


పంగిలి తుర్రువారిపాలెం చుట్టూ ఉన్న 1803 ఎకరాల అటవీ పోరంబోకు భూములపై కొందరు పెద్దల కన్ను పడింది. గుట్టుచప్పుడు కాకుండా సర్వే జరిపి ఆ భూములను కొట్టేయాలనుకున్నారు. అయితే, ఇంతలో ‘ఆంధ్రజ్యోతి’ కథనం వెలుగులోకి రావడం, ఆక్రమణ యత్నాలు బయటపడటంతో వారి ఆటలు సాగలేదు. దీనిపై సోమవారం నుంచి నెల్లూరు జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. మంగళవారం కూడా రాపూరు మండల అధికారులను, జిల్లా అటవీ శాఖ అధికారులను, రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులను పిలిచి విచారించారు. ఈ క్రమంలో 2008లోనే 244 ఎకరాల అటవీ పోరంబోకును ఎనిమిదిమంది పేరుపై రిజిస్ట్రేషన్‌ చేసినట్లు గుర్తించారు. 2015లో ఈ డాక్యుమెంట్ల ఆధారంగా వెబ్‌ల్యాండ్‌లో మ్యుటేషన్‌ చేసినట్లు నిర్ధారించారు. అయితే ఇది ఆర్‌ఎ్‌సడీ కొనుగోలుగా అడంగల్‌లో చూపిస్తున్నప్పటికీ, లింకు డాక్యుమెంట్‌ లేకుండా రిజిస్ట్రేషన్‌ జరిగినట్లు తేల్చారు. దీంతో 244 ఎకరాలకు సంబంధించిన పట్టాలను రద్దు చేయాలని జిల్లా ఉన్నతాధికారులు నిర్ణయించారు. బుధవారం ఈ ప్రక్రియను పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు అందాయి.


అలానే 1803 ఎకరాల అటవీ పోరంబోకు భూములపై భవిష్యత్తులోనూ ఇటువంటి ఇబ్బందులే ఎదురయ్యే ప్రమాదముందని భావించారు. వాటిని రిజర్వ్‌ ఫారెస్ట్‌ కిందకు చేర్చాలని నిర్ణయం తీసుకున్నారు. 1990లో 115 జీవో ద్వారా 2,500 ఎకరాలను రిజర్వ్‌ ఫారె్‌స్టగా గుర్తించగా, ఇప్పుడు అదే పద్ధతిలో మిగిలిన భూములను కూడా గుర్తించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. కాగా, 2008లో 244 ఎకరాల అటవీ పోరంబోకు భూములను ఎలా రిజిస్ట్రేషన్‌ చేశారన్న వివరాలను పూర్తిస్థాయిలో సేకరిస్తున్నారు. అలానే 2016లో అటవీ పోరంబోకు అని తెలిసి కూడా, ఎలా మ్యుటేషన్‌ చేశారని అప్పటి అధికారులను విచారిస్తున్నారు. ఈ విచారణ పూర్తయితే పలువురు అధికారులపై చర్యలు తీసుకునే అవకాశమున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 

Read more