ఇంటిని అమ్మేశాడు.. కన్నవారినే గెంటేశాడు!

ABN , First Publish Date - 2022-04-24T09:42:11+05:30 IST

బిడ్డల్ని కనిపెంచి.. ఉన్నత స్థానానికి ఎదగాలని తల్లిదండ్రులు కలలుగంటారు. వారి కోసం అహరహరం కష్టపడుతూ..

ఇంటిని అమ్మేశాడు.. కన్నవారినే గెంటేశాడు!

ఆలయం వద్ద దీనంగా వృద్ధ దంపతులు

ఆశ్రమంలో చేర్పించిన పోలీసు అధికారి


నరసరావుపేట రూరల్‌, ఏప్రిల్‌ 23: బిడ్డల్ని కనిపెంచి.. ఉన్నత స్థానానికి ఎదగాలని తల్లిదండ్రులు కలలుగంటారు. వారి కోసం అహరహరం కష్టపడుతూ.. ఎన్నో త్యాగాలుచేస్తారు. వృద్ధాప్యంలో బిడ్డలు తమను కంటికి రెప్పలా కాపాడతారని ఆశ పెట్టుకుంటారు.  అయితే పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని గాంధీపేటకు చెందిన బద్దురి వెంకట సుబ్బారెడ్డి, సీతారావమ్మ అనే వృద్ద దంపతుల పట్ల కన్నకొడుకు కర్నరశంగా వ్యవహరించాడు. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. ఇద్దరు కుమారులు గతంలో చనిపోయారు. ఉన్న ఒక్క కుమారుడు ఉద్యోగరీత్యా కాకినాడలో ఉంటున్నాడు. అతడు తల్లిదండ్రులు ఉంటున్న ఇంటిని రూ.30లక్షలకు విక్రయించి, ఆ డబ్బుతో కాకినాడ వెళ్లిపోయాడు. తల్లిదండ్రులకు ఏ విషయమూ చెప్పకుండా వారిని ఆ ఇంటివద్దనే వదిలేశాడు. ఇంటిని కొన్నవారు వచ్చి తమ ఇంటిని ఖాళీ చేయాలనడంతో  హతాశులయ్యారు. తమను ఇసప్పాలెం అమ్మవారి గుడివద్ద వదిలిపెట్టమని కన్న్లీళ్లతో వేడుకున్నారు. దీంతో ఇంటిని కొనుగోలు చేసిన వ్యక్తి వారిని శుక్రవారం ఆలయం వద్ద వదిలి వెళ్లాడు. రెండు నులక మంచాలు, దుస్తులతో రోజంతా అక్కడే దీనంగా గడిపారు. సీతారావమ్మకు మతిస్థిమితం లేకపోవడం, భర్త సుబ్బారెడ్డి లేవలేని స్థితిలో ఉండటం చూపరులను కంటితడి పెట్టించింది. శనివారం రూరల్‌ ఎస్‌ఐ బాలనాగిరెడ్డి దంపతులిద్దరినీ నరసరావుపేటలోని వృద్ధాశ్రమంలో చేర్పించారు. 

Read more