స్వర్ణకు ప్రత్యామ్నాయంగా ఎంటీయూ 1318

ABN , First Publish Date - 2022-05-19T08:49:12+05:30 IST

రాష్ట్రంలో స్వర్ణ రకం వరి వంగడానిదే హవా! రాష్ట్రవ్యాప్తంగా 24 లక్షల హెక్టార్లలో వరి సాగు చేస్తుంటే.. అందులో 19.07 లక్షల హెక్టార్లలో రైతుకు అధిగ దిగుబడినిచ్చే స్వర్ణ

స్వర్ణకు ప్రత్యామ్నాయంగా ఎంటీయూ 1318

పెనుమంట్ర, మే 18: రాష్ట్రంలో స్వర్ణ రకం వరి వంగడానిదే హవా! రాష్ట్రవ్యాప్తంగా 24 లక్షల హెక్టార్లలో వరి సాగు చేస్తుంటే.. అందులో 19.07 లక్షల హెక్టార్లలో రైతుకు అధిగ దిగుబడినిచ్చే స్వర్ణ రకమే ఉంటుంది. అయితే అధిక దిగుబడి ఉన్నప్పటికీ తుఫాన్‌ల ధాటికి చేలు పడిపోతుంటాయి. తెగుళ్లు ఎక్కువగా ఆశిస్తాయి. దీనికి నత్రజని వాడకం పెరగడంతో సాగు ఖర్చు పెరుగుతోంది. ఖర్చు తగ్గించి దిగుబడి పెరిగే వంగడాలు రూపొందించాలన్న విజ్ఞాపనల నేపథ్యంలో స్వర్ణకు ప్రత్యామ్నాయంగా పశ్చిమగోదావరి జిల్లా మార్టేరు వరి పరిశోధనా కేంద్రంలో పరిశోధకు ‘‘ఎంటీయూ 1318’’ రకం వరి వంగడాన్ని అందుబాటులోకి తెచ్చారు. సేంద్రియ వ్యవసాయానికి అనువైన ఈ వంగడం... గింజ రాలకుండా, తెగుళ్లను తట్టుకుని మిల్లర్లకు నూక శాతం రాని రకంగా ప్రాచుర్యం పొందింది. స్వర్ణకు సరిజోడీగా భావిస్తున్న ఈ వంగడాన్ని ప్రయోగాత్మకంగా సాగు చేసిన చోట స్వర్ణ రకానికంటే ఎకరాకు 10 నుంచి 15 శాతం అధిక దిగుబడి సాధించి శభాశ్‌ అనిపించింది.


మినీ కిట్‌.. సూపర్‌ హిట్‌

ఎంటీయూ 1318 విత్తనాలను 2020లో మినీ కిట్‌గా రైతులకు అందించారు. అప్పట్లో నివర్‌ తుఫాన్‌ను తట్టుకోవడంతోపాటు 2021లో జావిద్‌, గులాబ్‌ తుఫాన్‌లను కూడా ఈ రకం తట్టుకుని పడిపోకుండా నిలబడింది. తెగుళ్లను తట్టుకుని, రైతు క్షేత్రాల్లో ఆశించిన ఫలితాలు రావడంతో 2021లో రాష్ట్రంలో 42వేల మంది రైతులు దీన్ని సాగు చేశారు. 1318 రకం మినీ కిట్‌ పరిశీలన అనంతరం స్వర్ణకు ప్రత్యామ్నాయంగా ఎకరాకు 10 నుంచి 15 శాతం అఽధిక దిగుబడి సాధించి రైతుల మన్ననలు పొందింది. దోమపోటును, ఎండాకు తెగులును, అగ్గితెగులను పాక్షికంగా తట్టుకుంటూ దృఢమైన కాండం కలిగి చేను నిలబడి ఉంటుంది. అధిక దిగుబడులు ఇస్తూ 150 రోజులు పరిమితి కలిగి.. ధాన్యం ఎరుపుగా, బియ్యం తెల్లగా మధ్యస్థ సన్నంగా పచ్చిబియ్యానికి అనుకూలంగా ఉంటుంది. మార్టేరు పరిశోధనా స్థానంలో ఈ నెల 17 నుంచి ఎంటీయూ 1318 విత్తనాలు ఆరువేల క్వింటాళ్లు అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. కిలో 50 రూపాయలు, 30 కేజీలు 1,500 రూపాయలుగా నిర్ణయించారు.


సేంద్రియ వ్యవసాయానికి అనుకూలం

ఎంటీయూ 1318 రకానికి అధికంగా ఎరువులు వినియోగిస్తే కాలపరిమితి పెరిగిపోతుందని రైస్‌ విభాగం ప్రధాన శాస్త్రవేత్త పి.శ్రీనివాస్‌ చెప్పారు. తక్కువ నత్రజని నాట్లువేసే సమయంలో, చిరుపొట్టదశలో మాత్రమే వేయాలని, సేంద్రియ వ్యవసాయానికి ఈ వంగడం అనువైనదని తెలిపారు. గింజ రాలకుండా, తెగుళ్లను తట్టుకుని మిల్లర్లకు నూక శాతం రాని రకంగా ప్రాచుర్యం పొందిందని చెప్పారు.

Updated Date - 2022-05-19T08:49:12+05:30 IST