22ఏ కోడ్‌లో స్వల్పమార్పులు
ABN , First Publish Date - 2022-09-28T08:49:18+05:30 IST
నిషేధ భూముల జాబితా కోడ్‌లో ప్రభుత్వం స్వల్పమార్పులు చేసింది. ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ చట్టం-1908లోని నిషేధ భూముల జాబితా 22(ఏ)1(ఏ) నుంచి ‘ఇ’ కేటగిరీలు ఉన్న విషయం తెలిసిందే.
నిషేధ భూముల జాబితాలో గందరగోళం నివారించేందుకే!
అమరావతి, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): నిషేధ భూముల జాబితా కోడ్‌లో ప్రభుత్వం స్వల్పమార్పులు చేసింది. ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ చట్టం-1908లోని నిషేధ భూముల జాబితా 22(ఏ)1(ఏ) నుంచి ‘ఇ’ కేటగిరీలు ఉన్న విషయం తెలిసిందే. ఈ కేటగిరీల్లో స్వల్పమార్పులు చేశారు. ప్రస్తుతం 22(ఏ)1(ఏ)లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో నిషేధించబడిన భూములు అనేది రికార్డుల్లో ఉండేది. ఇకపై అసైన్డ్ భూములుగా రికార్డు బుక్‌ల్లో నమోదు చేయాలని రెవెన్యూశాఖ నిర్ణయించింది. 22(ఏ)1(బి)లో ప్రస్తుతం కేంద్ర-రాష్ట్రాలకు చెందిన భూములు అనే పదం ఉంది. ఇకపై ఈ కేటగిరీని ప్రభుత్వ సొంత భూములుగా మార్చనున్నారు. 22(ఏ)1(సి)లో ఎలాటి మార్పులూ లేవు. దేవదాయ, వక్ఫ్‌భూములుగానే కొనసాగనుంది. 22(ఏ)1(డి)ని మిగులు భూములుగా పరిగణించనున్నారు. ప్రస్తుతం 22(ఏ)1((ఇ)కేటగిరీని రాష్ట్ర ప్రభుత్వ ఆసక్తి కలిగిన భూములుగా పరిగణిస్తున్నారు.
ఇకపై దీనిని కేంద్ర-రాష్ట్రప్రభుత్వాల ఆసక్తి కలిగిన భూములుగా మార్చనున్నారు. నిషేధ భూముల జాబితాలో గందరగోళం నివారించేందుకే కోడింగ్‌లో స్వల్పమార్పులు చేసినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇటీవల జరిగిన రెవెన్యూ కాన్ఫరెన్స్‌లో ఈ అంశంపై సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నిషేధ భూములకు సంబంధించి కొత్త కోడింగ్ ప్రకారం ఫైల్‌బుక్‌లు నిర్వహించాలని రెవెన్యూశాఖ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.