శ్రీబాగ్‌ ఒప్పందంపై అవగాహన లేని మంత్రులు: బైరెడ్డి

ABN , First Publish Date - 2022-12-07T00:23:19+05:30 IST

శ్రీబాగ్‌ ఒప్పందంపై వైసీపీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు అవగాహన లేదని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాయలసీమ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి అన్నారు.

శ్రీబాగ్‌ ఒప్పందంపై అవగాహన లేని మంత్రులు: బైరెడ్డి
మాట్లాడుతున్న బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి

కర్నూలు(ఎడ్యుకేషన్‌), డిసెంబరు 6: శ్రీబాగ్‌ ఒప్పందంపై వైసీపీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు అవగాహన లేదని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాయలసీమ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. మంగళవారం కర్నూలులోని కన్వెన్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు. శ్రీబాగ్‌ ఒప్పందంలో మూడు రాజధానుల అంశం లేదని తెలిపారు. కర్నూలులో పరిపాలనా రాజధానిని ఏర్పాటు చేయాలని ఉందని, అంతేకానీ న్యాయ రాజధాని ఏర్పాటు కాదని అన్నారు. ఏడాదిన్నర సంవత్సర కాలంలో ఎన్నికలు రాబోతున్నాయనీ, రాయలసీమ ప్రజలను నయవంచనకు గురి చేసేందుకు వైసీపీ న్యాయ రాజధాని అంశాన్ని తీసుకువచ్చి లబ్ధిపొందేందుకు కుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం రాయలసీమ నినాదానంతో నయవంచనకు పాల్పడుతోందన్నారు. రాయలసీమ గర్జనకు పాఠశాలల, కళాశాలల విద్యార్థులను తరలించారని ఆరోపించారు. రాజకీయ సదస్సుకు విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడమేమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర విభజన జరిగేటప్పుడు జగన్మోహన్‌ రెడ్డి ఎక్కడికి వెళ్లారనీ బైరెడ్డి ప్రశ్నించారు. వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులను పూర్తి చేయడంలో వైసీపీ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. దేశంలోనే కర్నూలు జిల్లా పేదరికంలో అట్టడుగు బాగంలో ఉందని నిత్‌అయోగ్‌ చెప్పడం దారుణమన్నారు. ఈ నెల 7న ఉదయం 11 గంటలకు సీమగర్జనతో మలినమైన ఎస్టీబీసీ కాలేజీ మైదానాన్ని పాలతో శుద్ధి చేస్తామని బైరెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో రవికుమార్‌, సీమకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:23:21+05:30 IST