మంత్రి పెద్దిరెడ్డి... ఆంధ్రా వీరప్పన్‌: టీడీపీ

ABN , First Publish Date - 2022-04-10T08:32:43+05:30 IST

‘‘చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆంధ్రా వీరప్పన్‌..

మంత్రి పెద్దిరెడ్డి... ఆంధ్రా వీరప్పన్‌: టీడీపీ

అమరావతి, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): ‘‘చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆంధ్రా వీరప్పన్‌... అవినీతి అనకొండ. అధికారాన్ని, ముఖ్యమంత్రి జగన్‌రెడ్డితో సాన్నిహిత్యాన్ని అడ్డుపెట్టుకొని ఆయన చేసిన దోపిడీ ఈ మూడేళ్ళలో రూ.6,000 కోట్లు దాటిపోయింది. ఎర్ర చందనంతో మొదలుపెట్టి మట్టి, ఇసుక, గనులు, భూములు దేనినీ వదలకుండా స్వాహా చేశారు’’ అని టీడీపీ ఆరోపించింది. ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమా మహేశ్వరరావు శనివారం ఇక్కడ మాట్లాడారు. ‘‘చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డికి శివశక్తి డైరీ ఉంది. పాడి రైతులను బెదిరించి వారి నుంచి అతి తక్కువ ధరకు... కేవలం రూ.18లకు పాలు కొనుగోలు చేశారు. అలా ఈ మూడేళ్లలో దానిపై ఆయన రూ.700 కోట్లు సంపాదించారు. అదే జిల్లాలో మామిడి పండ్ల నుంచి పల్ప్‌ తీసే ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడా అంతే. ఆయనకు భయపడి రైతులు ఇచ్చిన రేటుకు అమ్ముకున్నారు. 


ఆ రకంగా రూ.200 కోట్లు ఆర్జించారు. తిరుపతి, పుంగనూరు, పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లి, నగరి ప్రాంతాల్లో ఆయన, కుటుంబ సభ్యులు, అనుచర గణం యథేచ్ఛగా భూ కబ్జాలకు పాల్పడ్డారు. సుమారు రూ.800 కోట్ల విలువైన 800 ఎకరాల భూమి వారి కబ్జాలకు గురైంది. రూ.60 కోట్లు విలువ చేసే తిరుపతిలోని హాథీరాంజీ మఠానికి చెందిన 3ఎకరాలను, పుంగనూరు, తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో 388 ఎకరాల భూమిని ఆయన కొట్టేశారు. ఆ భూముల విలువ రూ.1,000 కోట్లు ఉంటుంది’’ అని ఆరోపించారు. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ ముఠాల నుంచి ఆయన వందల కోట్లు దండుకొంటున్నారన్నారు. మద్యంను దుకాణాలకు సరఫరా చేసే రవాణా కంట్రాక్టు కూడా ఆయనదేనన్నారు. ఇసుక అక్రమ రవాణా చేసి రూ.250 కోట్ల వరకూ సంపాదించారని వివరించారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి ధైర్యం ఉంటే వీటిపై విచారణ జరిపించాలని బొండా డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-04-10T08:32:43+05:30 IST