వాయిదాల ‘ట్యాబ్‌’లు!

ABN , First Publish Date - 2022-09-28T08:47:07+05:30 IST

విద్యార్థులకు అందించాలని భావించిన ట్యాబ్‌లు వారి చేతికి ఎప్పుడు అందుతాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది. పదే పదే ట్యాబ్‌ల పంపిణీ

వాయిదాల ‘ట్యాబ్‌’లు!

సెప్టెంబరులో ఇస్తామని గతంలో ప్రకటన

నవంబరులో ఖాయమన్న మంత్రి బొత్స

ఇప్పుడు డిసెంబరులో ఇచ్చే యోచన!

విద్యార్థుల ఆశలపై సర్కారు నీళ్లు 

‘బైజూస్‌’ కంటెంట్‌పైనా సందేహాలు

బేసిక్‌ మాత్రమే ఇచ్చే యోచనలో సంస్థ

మిగిలిన సబ్జెక్టుకు ధర చెల్లించక తప్పదా?

ఇలాగైతే.. భారమేనంటున్న తల్లిదండ్రులు


(అమరావతి-ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు అందించాలని భావించిన ట్యాబ్‌లు వారి చేతికి ఎప్పుడు అందుతాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది. పదే పదే ట్యాబ్‌ల పంపిణీ అంశం వాయిదా పడుతోంది. అదేవిధంగా ల్యాప్‌ట్యా్‌పలు ఇస్తామని మాటమార్చి ట్యాబ్‌లకు వచ్చిన ప్రభుత్వం చివరికి వాటి పంపిణీపై స్పష్టత ఇవ్వలేకపోతోంది. సెప్టెంబరు నెలాఖరులో కొందరికి, అక్టోబరు నెలాఖరులో కొందరికి ఇస్తామని గతంలో ప్రకటించింది. అయితే.. దీనిపై ఇటీవల శాసన మండలిలో మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ.. బాలల దినోత్సవం(నవంబరు 14) రోజున పంపిణీ చేస్తామని వెల్లడించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన విద్యార్థులు ఆశలు పెట్టుకున్నారు. కానీ, సర్కారు మాత్రం ఈ వాయిదాలను పెంచుకుంటూనే పోతోంది. తాజాగా ఇప్పుడు ట్యాబుల పంపిణీని డిసెంబరుకు వాయిదా వేసినట్లు తెలిసింది. ట్యాబ్‌లు సరఫరా చేసే సంస్థ సకాలంలో అందించలేకపోవడం, వాటిలో కంటెంట్‌ నింపడంలో సాంకేతిక సమస్యలు కారణమని నిపుణులు భావిస్తున్నారు. ఇలా పదే పదే వాయిదాలు పడటంతో ట్యాబ్‌లపై విద్యార్థుల్లో అసహనం వ్యక్తమౌతోంది. విద్యా సంవత్సరం చివరి నాటికి వీటిని ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కాగా, ఎనిమిదో తరగతి విద్యార్థులతో పాటు ఆ తరగతికి బోధించే ఉపాధ్యాయులకు కూడా ట్యాబ్‌లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మొత్తం 5,18,740 మందికి ట్యాబ్‌లు ఇవ్వాల్సి ఉంది. ఒక్కో ట్యాబ్‌ను రూ.12,800 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. మొత్తం రూ.664 కోట్లు దీనికి ప్రభుత్వం వెచ్చించింది. ఆ ట్యాబ్‌ల్లో బైజూస్‌ సంస్థ కంటెంట్‌ను నిక్షిప్తం చేసి ఇస్తుంది. ఆ కంటెంట్‌ ఆధారంగా ఉపాధ్యాయులు పాఠాలు చెప్పాలని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది.


బైజూస్‌ లబ్ధి కోసమేనా?!

ఈ ట్యాబ్‌ల కొనుగోలు వెనుక బైజూస్‌ సంస్థ కీలక పాత్ర పోషిస్తోందని తెలుస్తోంది. భారీ నష్టాల్లో కూరుకుపోయిన ఆ సంస్థ పరపతిని పెంచుకునేందుకు ఏకంగా ప్రభుత్వం ద్వారా వారి ఉత్పత్తులకు ప్రచారం చేసుకునే ప్రణాళికను ఏపీలో అమలుచేస్తోందనే వాదన ఉంది. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఈ సంస్థ డిజిటల్‌ పాఠాలకు డిమాండ్‌ ఉన్నా.. విద్యా సంస్థలు తెరుచుకున్న తర్వాత ఆ సంస్థ కంటెంట్‌కు డిమాండ్‌ పడిపోయింది. ఈ సమయంలో ఆ సంస్థకు ప్రభుత్వమే బ్రాండ్‌ అంబాసిడర్‌ తరహాలో ప్రచారం చేసిందని విమర్శలు వచ్చాయి. కాగా, వారి కంటెంట్‌ను పూర్తి ఉచితంగా ఇస్తామని చెప్పిన బైజూస్‌ ఎంతకాలం ఇస్తుందో తెలపలేదు. పైగా వాటిలోనూ బేసిక్‌ కంటెంట్‌ మాత్రమే ప్రభుత్వ విద్యార్థులకు ఇస్తారని తెలుస్తోంది.


బేసిక్‌ కంటెంట్‌ దాటి లోతైన సబ్జెక్టు కావాలనుకుంటే అటు ప్రభుత్వం ద్వారాగానీ లేదా విద్యార్థులుగానీ అదనపు నగదు చెల్లించక తప్పదనే వాదన వినిపిస్తోంది. ఇదే నిజమైతే తమపై భారం పడడం ఖాయమని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


ల్యాప్‌ట్యాప్‌ నుంచి ట్యాబ్‌కు

పాఠశాల విద్యా వ్యవస్థను గందరగోళం చేసిన వైసీపీ ప్రభుత్వం ల్యాప్‌ట్యా్‌పల విషయంలోనూ మాట తప్పింది. స్వయంగా ముఖ్యమంత్రి జగన్‌ చేసిన ప్రకటననే అమలుచేయలేక వెనకడుగు వేసింది. ‘అమ్మఒడి’ నగదు వద్దనుకున్న విద్యార్థులకు ల్యాప్‌ట్యా్‌పలు ఇస్తామని గతంలో సీఎం జగన్‌ ఆర్భాటంగా ప్రకటించారు. 2022-23 విద్యా సంవత్సరం నుంచే ఇది అమల్లోకి వస్తుందన్నారు. ఈ క్రమంలో అమ్మఒడికి బదులుగా ల్యాప్‌ట్యాప్‌ కోరుకునే విద్యార్థుల నుంచి ఆప్షన్లు సైతం తీసుకున్నారు. దీంతో ఏకంగా 7 లక్షల మందికిపైగా విద్యార్థులు ల్యాప్‌ట్యా్‌పలకు ఆప్షన్‌ ఇచ్చారు. తీరా విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేనాటికి ల్యాప్‌ట్యా్‌పలు భారీ ఖర్చుతో కూడుకున్నదని.. దానిస్థానంలో ట్యాబులు ఇస్తామని సీఎం జగనే స్వయంగా ప్రకటించారు. పైగా ల్యాప్‌ట్యా్‌పలు, సెల్‌ఫోన్ల పోటీతో ట్యాబ్‌ల అమ్మకాలు తగ్గిపోయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వాటిని కొనుగోలు చేయాలని నిర్ణయించింది. 

Read more