వ్యాయామంతో గుండెపోటు రాదు

ABN , First Publish Date - 2022-02-23T07:57:42+05:30 IST

‘‘గుండెపోటుకు వ్యాయామం, ఒత్తిడి, యోగా కారణాలు కాదు. జన్యుపరమైన కారణాలే ఎక్కువ ప్రభావం చూపుతాయి. గతేడాది కన్నడ హీరో పునీత్‌, రెండురోజుల క్రితం మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణాలు ఒకే కోవకి చెందినవిగా కనిపిస్తున్నాయి’’ అని వైద్యనిపుణులు విశ్లేషిస్తున్నారు.

వ్యాయామంతో గుండెపోటు రాదు

జన్యు కారణాలతోనే ఎక్కువ ప్రభావం.. ‘ఆంధ్రజ్యోతి’తో వైద్య నిపుణులు


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘‘గుండెపోటుకు వ్యాయామం, ఒత్తిడి, యోగా కారణాలు కాదు. జన్యుపరమైన కారణాలే ఎక్కువ ప్రభావం చూపుతాయి. గతేడాది కన్నడ హీరో పునీత్‌, రెండురోజుల క్రితం మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణాలు ఒకే కోవకి చెందినవిగా కనిపిస్తున్నాయి’’ అని వైద్యనిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘‘ముందస్తు జాగ్రత్తలతో 80శాతం పైగా గుండెపోటును గుర్తించే అవకాశం ఉంటుంది. ఆకస్మిక గుండెపోటు 20, 30ఏళ్ల వారికి కూడా వస్తోంది. దీనికి పుట్టుకతో వచ్చిన సమస్యలే కారణాలు కావచ్చు. 40నుంచి 50ఏళ్ల వారికి ఆకస్మిక గుండెపోటు రావడానికి... వారిలో ముందే రెండు లేదా మూడు రక్త నాళాలు పూడిపోయి ఉండవచ్చు. కార్డియాక్‌ అరెస్టు అయ్యేవారిలో 15ఏళ్ల ముందే గుండె రక్తనాళాల్లో కాల్షియం లేదా కొవ్వు చేరుకుని ఉంటుంది. ఇది చాలా సైలెంట్‌గా ఉండి ఒక్కసారి స్ట్రోక్‌ రూపంలో బయటపడుతుంది. రక్తనాళాల్లో 25శాతం కాల్షియం ఉంటే 100శాతం కొవ్వు పట్టిందని అర్థంచేసుకోవాలి. శరీరంలో కాల్షియం స్కోర్‌ ఉందంటే.. గుండె ప్రమాదంలో ఉందని భావించాల్సి వస్తుంది.


కాల్షియం స్కోర్‌ పరీక్షను గేట్‌ కీపర్‌గా చెబుతాం. కాల్షియం స్కోర్‌ బయటపడితే ట్రేస్‌ టెస్ట్‌ చేయించుకోవాలి. దీన్ని గేట్‌ కీపర్‌ 2గా పరిగణిస్తారు. అక్కడా సమస్యలు ఉంటే సీటీ యాంజియో చేయించుకుంటే మంచింది. ఛాతీలో నొప్పి రాకముందు కాల్షియం స్కోర్‌, యాంజీయోగ్రామ్‌ చేయించుకోవాలి. కాల్షియం స్కోర్‌ 1000 ఉన్నవారికి గుండెపోటు వచ్చే అవకాశం 37రెట్లు అధికం. 40ఏళ్లు దాటిన ప్రతిఒక్కరూ ఏటా సాధారణ పరీక్షలతో పాటు గుండె సంబంధిత పరీక్షలూ చేయించుకోవాలి’’ అని వైద్యులు సూచిస్తున్నారు. 


జన్యుపరమైన సమస్యలు

చిన్నవయసులో గుండెపోటుకు గురయ్యే వారిలో జన్యుపరమైన సమస్యలు బయటపడుతున్నాయి. ఇలాంటివారిలో ఇమ్యూనిటీ జీన్స్‌ ఉంటున్నాయి. కొంతమందిలో సమస్య జటిలమయ్యే వరకూ లక్షణాలు కనిపించడం లేదు. ఇమ్యూనిటీ తగ్గినప్పుడు కుప్పకూలిపోతున్నారు. ఈ మధ్యకాలంలో గుండెపోటుతో ఆస్పత్రుల్లో చేరేవారిలో 70శాతం మంది చిన్న వయసు వారే.

డాక్టర్‌ రమేశ్‌, ఎండీ, ఆస్టర్‌ రమేష్‌ హాస్పిటల్స్‌


ముందు జాగ్రత్త తప్పనిసరి

వ్యాయామానికి, గుండెపోటుకు సంబంధం లేదు. ఏటా గుండెకు సంబంధించిన వైద్యపరీక్షలు చేయించుకోవాలి. ఎవరైనా కూర్చునే సమయంలో ఆలసటగా కనిపించినా, గుండెనొప్పితో కుప్పకూలినా వెంటనే సీపీఆర్‌ చేస్తే ఉపశమనం లభిస్తుంది. తర్వాత ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి తరలించాలి.

డాక్టర్‌ పద్మ మొవ్వ, ఎండీ, సెంటినీ హాస్పిటల్స్‌

Updated Date - 2022-02-23T07:57:42+05:30 IST