మాధవ్‌కు ఎంపీగా ఉండే అర్హత లేదు

ABN , First Publish Date - 2022-08-10T09:08:35+05:30 IST

మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన కిరాతకులకు అండగా నిలుస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని సస్పెండ్‌ చేయాలని ఏపీ మహిళా అఖిలపక్ష సంఘాల సమావేశం డిమాండ్‌ చేసింది.

మాధవ్‌కు ఎంపీగా ఉండే అర్హత లేదు

  • ఈ ప్రభుత్వాన్ని సస్పెండ్‌ చేయాలి
  • రౌండ్‌టేబుల్‌ సమావేశం డిమాండ్‌


అమరావతి, విజయవాడ, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన కిరాతకులకు అండగా నిలుస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని సస్పెండ్‌ చేయాలని ఏపీ మహిళా అఖిలపక్ష సంఘాల సమావేశం డిమాండ్‌ చేసింది. ఈమేరకు జాతీయ మహిళా కమిషన్‌కు లేఖ రాయాలని నిర్ణయించింది. సంఘం ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, లోక్‌సత్తా పార్టీల మహిళా నేతలు పాల్గొన్నారు. వాసవ్య మహిళ మండలి అధ్యక్షురాలు చెన్నుపాటి కీర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు అనిత మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై ముఖ్యమంత్రి ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రెండు వేల మంది ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరిగాయని తెలిపారు. ప్రజాప్రతినిధులే మహిళల మీద అఘాయిత్యాలు చేస్తున్నారని, వారిని జగన్‌ నిరోధించకపోగా పదవులతో సత్కరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


రేప్‌, మర్డర్‌ కేసులో నిందితుడిని ఎంపీని చేసిన ఘనత జగన్‌దన్నారు. చట్టసభలో కొనసాగే అర్హత మాధవ్‌కు లేదన్నారు. తప్పు చేసిన ఎంపీకి రాష్ట్ర మహిళా కమిషన్‌ నోటీసులు ఇవ్వకుండా డీజీపీకి నోటీసులు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. సభ్యసమాజం సిగ్గుపడేవిధంగా మాధవ్‌ వ్యవహరించాక కూడా సజ్జల ఆయన్ను సమర్ధించడం దుర్మార్గమని కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ అన్నారు.  బాధితురాలిని వైసీపీ నేతలు ప్రాణాలతో ఉంచారా? అన్న అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు. మాధవ్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోని పక్షంలో పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని  సీపీఐ నాయకురాలు దుర్గా భవానీ చెప్పారు. లోక్‌సత్తా నాయకురాలు ఎన్‌.మాలతి, జనసేన కోఆర్డినేటర్‌ రావి సౌజన్య, జోత్స్న, నోరి పల్లవి, పలువురు సామాజిక కార్యకర్తలు, మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు. 


అనితకు బెదిరింపులు

సమావేశంలో పాల్గొన్న అనితకు ఓ వైసీపీ కార్యకర్త ఫోన్‌ చేశారు. ఎంపీ అశ్లీల వీడియో వివాదాన్ని ఎందుకు పెద్దది చేస్తున్నారంటూ అనితను ప్రశ్నించారు. మాధవ్‌ వ్యవహారంపై అతిగా స్పందించవద్దంటూ హెచ్చరించారు. ఈ విషయాలను అనిత రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వినిపించారు. కాగా.. సమావేశం అనంతరం డీజీపీకి వినతిపత్రం ఇవ్వడానికి మహిళా నేతలు మంగళగిరి వచ్చారు. లోపలికి వెళ్లకుండా వారిని పోలీసులు అడ్డుకొన్నారు. వారితో మహిళా నేతలు వాగ్వాదానికి దిగారు. 


హోంమంత్రికి సిగ్గనిపించడం లేదా: అనిత

మాధవ్‌ ఉదంతంపై హోంమంత్రి తానేటి వనిత చేసిన వ్యాఖ్యలపై మహిళా నేతలు మండిపడ్డారు. ‘ఇది రాజకీయ కుట్ర అనడానికి హోంమంత్రికి సిగ్గనిపించడం లేదా? ఐదు రోజుల తర్వాత బయటకు వచ్చి రాజకీయ కుట్ర అంటారా? ఆ వీడియోలో ఉంది మీ ఎంపీ అవునా కాదా? మహిళల గౌరవాన్ని కాపాడలేకపోతే రాజీనామా చేసి ఇంట్లో కూర్చుంటే మంచిది. ఎందుకా పదవి’ అని అనిత ధ్వజమెత్తారు.

Updated Date - 2022-08-10T09:08:35+05:30 IST