రైతు భరోసా కేంద్రానికి తాళం

ABN , First Publish Date - 2022-07-07T08:29:28+05:30 IST

రైతు భరోసా కేంద్రానికి తాళం

రైతు భరోసా కేంద్రానికి తాళం

22 నెలలుగా అద్దె చెల్లించాలంటున్న ఇంటి యజమాని

మార్చి నుంచి సచివాలయంలోనే సిబ్బంది విధులు


పి.గన్నవరం, జూలై 6: రైతులకు గ్రామస్థాయిలో సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటుచేసిన రైతు భరోసా కేంద్రాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లి రైతుభరోసా కేంద్రానికి 22 నెలలుగా అద్దె చెల్లించడంలేదని మూడు నెలలు క్రితం ఇంటి యజమాని తాళం వేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై ఇంటి యజమాని ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వాడ్రేవుపల్లి గ్రామంలో వ్యవసాయ అధికారులు ఇంజేటి చంద్రకాంతం ఇల్లు అద్దెకు తీసుకుని రైతు భరోసా కేంద్రం ఏర్పాటుచేశారు. ఆమె అండమాన్‌లో ఉండటంతో ఆ ఇంటిని బంధువు కుసుమ చక్రవర్తి చూసుకుంటున్నారు. అద్దె ఒప్పందం సమయంలో చక్రవర్తికి సంబంధించిన వివరాలు అధికారులకు అందించాడు. ఆ వివరాల ప్రకారం ఐదు నెలలు పాటు అద్దె వచ్చిందని అనంతరం 17 నెలలు గడిచిన తరువాత జనవరి నెలలో అద్దె కోసం అధికారులను అడిగితే ఇల్లు డాక్యుమెంట్స్‌ ఎవరి పేరున ఉంటే వారి వివరాలు ఇవ్వాలని చెప్పారు. దీంతో వారం రోజుల్లో చంద్రకాంతం వివరాలు ఇచ్చానని అయినప్పటికీ అద్దె బకాయి రాకపోవడంతో మార్చిలో రైతు భరోసా కేంద్రానికి తాళం వేశానని చెప్పాడు. దీంతో చేసేది లేక వ్యవసాయ అధికారులు రైతు భరోసా కేంద్రాన్ని సచివాలయంలోనే నిర్వహిస్తున్నారు. కాగా రైతు భరోసా కేంద్రానికి సంబంధించిన ఫర్నీచర్‌ మొత్తం తాళంవేసిన అద్దె భవనంలోనే ఉంది. ఇదే విషయంపై వ్యయసాయశాఖ ఏడీఏ ఎస్‌జేవీ రామమోహనరావును వివరణ కోరగా.. అద్దె ఒప్పందం సమయంలో చక్రవర్తి వివరాలు ఇచ్చారని నిబంధనలు మారడంతో ఇంటి యజమాని వివరాలు తీసుకున్నామని ప్రస్తుతం బిల్లు పెట్టామని అద్దె బకాయి మొత్తం త్వరలోనే యజమానికి అందిస్తామని తెలిపారు.


Updated Date - 2022-07-07T08:29:28+05:30 IST