Amaravati: రాజధానిలో మళ్లీ జోష్‌

ABN , First Publish Date - 2022-12-22T02:42:56+05:30 IST

‘అమరావతి’లో భూముల లావాదేవీలు మళ్లీ జోరందుకున్నాయి. ధరలూ పుంజుకుంటున్నాయి. గత ఏడాది మార్చి నుంచి నవంబరు మధ్య జరిగిన లావాదేవీలతో పోల్చితే... ఈ ఏడాది మార్చి నుంచి నవంబరు వరకు జరిగిన క్రయ విక్రయాలు దాదాపు మూడు రెట్లు పెరిగాయి.

Amaravati: రాజధానిలో మళ్లీ జోష్‌

పుంజుకుంటున్న భూములు, ప్లాట్ల ధరలు

మారుతున్న రాజకీయ పరిణామాలతో మళ్లీ ఆశలు

జగన్‌పై వ్యతిరేకత పెరుగుతోందనే సంకేతాలు

మరోవైపు.. చంద్రబాబుకు భారీ జనాదరణ

అమరావతిపై హైకోర్టు తీర్పు కీలక మలుపు

ఆ తర్వాతే మళ్లీ అమరావతిపై అందరి చూపు

గతేడాదికంటే 3 రెట్లు ఎక్కువ లావాదేవీలు

అనంతవరం ప్రాంతంలో ఏకంగా 10 రెట్లు

హైకోర్టు పరిసరాల్లో మరింత ధరలు

నేలపాడు ప్రాంతంలో గజం 15 వేలు పైనే

హైకోర్టు తీర్పు తర్వాత రియల్టర్లలో విశ్వాసం

(గుంటూరు- ఆంధ్రజ్యోతి): ‘అమరావతి’లో భూముల లావాదేవీలు మళ్లీ జోరందుకున్నాయి. ధరలూ పుంజుకుంటున్నాయి. గత ఏడాది మార్చి నుంచి నవంబరు మధ్య జరిగిన లావాదేవీలతో పోల్చితే... ఈ ఏడాది మార్చి నుంచి నవంబరు వరకు జరిగిన క్రయ విక్రయాలు దాదాపు మూడు రెట్లు పెరిగాయి. వైసీపీ సర్కారుపై వ్యతిరేకత పెరుగుతున్న సంకేతాలు... చంద్రబాబు సభలకు లభిస్తున్న జనాదరణ... ఇతర రాజకీయ కారణాలు ఒకవైపు! అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు, దీనిపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ, మూడు రాజధానుల ముచ్చట ముందుకు కదలకపోవడం, ఈ బిల్లును ప్రభుత్వమే వెనక్కి తీసుకోవడం... వంటి న్యాయ, పరిపాలనాపరమైన కారణాలు మరోవైపు! ఈ రెండింటి నేపథ్యంలో మళ్లీ ‘అమరావతి’ వైపు అందరి కళ్లు పడుతున్నాయి. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని... రాజధానికి పూర్వ వైభవం వస్తుందనే ఆశలు చిగురిస్తున్నాయి. దీనివల్లే... అక్కడ భూ లావాదేవీలు బాగా పెరిగినట్లు చెబుతున్నారు.

పెరిగిన క్రయవిక్రయాలు

తుళ్లూరు సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసు పరిధిలో 2021 ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు 529 రిజిస్ట్రేషన్‌లు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు 1,509 రిజిస్ట్రేషన్‌లు జరిగాయి.

మందడం సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసు పరిధిలో ఏప్రిల్‌ 2021 నుంచి నవంబరు వరకు 707 రిజిస్ట్రేషన్‌లు... ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు 1,292 రిజిస్ట్రేషన్‌లు జరిగాయి.

అనంతవరం సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసు పరిధిలో 2021 ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు 113, ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు 1130 రిజిస్ట్రేషన్‌లు జరిగాయి. ఈ ప్రాంతంలో ఏకంగా పది రెట్లు ఎక్కువగా భూముల క్రయవిక్రయాలు జరగటం విశేషం. మిగతా ప్రాంతం కంటే ఇక్కడ కొంచెం తక్కువ ధర ఉండటంతో కొనుగోళ్లు ఎక్కువ జరిగాయి.

హైకోర్టు పరిసరాల్లోని తుళ్లూరు నేలపాడు రెవెన్యూ ప్రాంతంలో అత్యధిక ధర పలికింది. ఇక్కడ గజం రూ.15వేలకు పైగా వెచ్చించి కొనుగోలు చేశారు.

మంగళగిరి సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసు పరిధిలో 2021 ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు 6,756 రిజిస్ట్రేషన్‌లు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు 9,444 జరిగాయి.

వచ్చే ఏడాది ధరలు మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నప్పటికీ... అప్పులు, పిల్లల పెళ్లిళ్లు వంటి అవసరాలకు రైతులు అమ్ముకోకతప్పడం లేదు.

కలిసి వస్తున్న పరిణామాలు...

అమరావతిని అభివృద్ధి చేయాలని, మూడు రాజధానుల చట్టం చేయటం కుదరదని హైకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది.

ప్రభుత్వం రైతులతో చేసుకున్న ఒప్పందం చట్టం ప్రకారం జరిగిందని, ఇచ్చిన హామీ ప్రకారం అమరావతిని అభివృద్ధి చేయాలని ఈ ఏడాది మార్చి 3న కోర్టు తీర్పు ఇచ్చింది. అప్పటి నుంచి లావాదేవీలు ఊపందుకున్నాయి.

రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం చట్ట ప్రకారం రైతుల నుంచి భూములు తీసుకుందని, సుప్రీం కోర్టు కూడా మూడు రాజధానులకు అంగీకరించకపోవచ్చునని రియల్టర్లు భావిస్తున్నారు.

హైకోర్టు తీర్పు తర్వాత...

గత ఏడాది తక్కువ రేటుకు అమ్ముకున్నాను. హైకోర్టు తీర్పు తర్వాత ప్లాట్ల ధరలు పెరిగాయి. ఈ ఏడాది అమ్మకాలు, కొనుగోళ్లు పెరిగాయి. చట్టప్రకారం మూడు రాజధానులు కుదిరే పనికాదని తెలిసిపోయింది. రాజధాని అమరావతిలో రైతుల ప్లాట్లకు డిమాండ్‌ పెరుగుతోంది.

- షేక్‌ నాగుల్‌మీరా, రైతు, రాయపూడి గ్రామం

లావాదేవీలు బాగా జరిగాయి

రాజధాని అమరావతిలో గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు, కొనుగోళ్లు ఎక్కువయ్యాయి. హైకోర్టు తీర్పు తరువాత ధరలు కూడా పెరిగాయి. లావాదేవీలు బాగానే జరిపాం.

- షేక్‌ మహ బూబ్‌ సుభానీ (ఏఎస్‌ కన్సల్టెన్సీ), రాయపూడి

90 గజాల ప్లాటు అమ్ముకున్నాను

హైకోర్టు తీర్పు వచ్చిన తరువాత కొంచెం ధర పెరిగింది. 90 గజాల ప్లాటు అమ్ముకున్నాను. పాలకులు మూడు రాజధానుల పేరుతో రైతులను అన్ని రకాలుగా నష్టపరుస్తున్నారు.

- కాటా అప్పారావు, రైతు, తుళ్లూరు

Updated Date - 2022-12-22T02:42:57+05:30 IST