55 ఇనాం గ్రామాల్లో భూ సర్వే

ABN , First Publish Date - 2022-12-01T02:59:43+05:30 IST

రాష్ట్రంలో 1956లో ఇనాం చట్టం రద్దయింది. ఇనాం భూములపై రైతులకు హక్కులు కల్పిస్తూ రైత్వారీ పట్టాలు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ఇనాం (రైత్వారీ పట్టాలు, గ్రామాలు) చట్టం-1956 తీసుకొచ్చారు.

55 ఇనాం గ్రామాల్లో భూ సర్వే

సెటిల్మెంట్‌, సర్వే జరగని గ్రామాల్లో నిర్వహణ

1956 తర్వాత తొలిసారిగా ప్రక్రియకు ఏర్పాట్లు

అనంతరం రైత్వారీ పట్టాల జారీకి నిర్ణయం

మార్గదర్శకాలు జారీ చేసిన రెవెన్యూ శాఖ

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో 1956లో ఇనాం చట్టం రద్దయింది. ఇనాం భూములపై రైతులకు హక్కులు కల్పిస్తూ రైత్వారీ పట్టాలు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ఇనాం (రైత్వారీ పట్టాలు, గ్రామాలు) చట్టం-1956 తీసుకొచ్చారు. దీని ప్రకారం రాష్ట్రంలోని 9వేల గ్రామాల్లో భూములను సర్వే చేసి, ఇనాం సెటిల్మెంట్‌ ప్రక్రియ పూర్తిచేసి రైతులకు పట్టాలు ఇచ్చారు. అయితే, పలు కారణాలతో ఇప్పటి వరకు 33 ఇనాం గ్రామాల్లో ఇనాందారులైన రైతులకు భూములపై హక్కులు కల్పించే ప్రక్రియ చేపట్టలేదు. మరో 22 గ్రామాల్లో ఇనాం భూముల సర్వే కూడా నిర్వహించలేదు. వీటికి సంబంధించి కొన్ని వేల కేసులు రెవెన్యూ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. సివిల్‌ కోర్టుల్లోనూ భారీగా కేసులున్నాయి. ఈ 55 గ్రామాల్లో ఇప్పుడు భూముల సమగ్ర సర్వే చేయనున్నారు. ఏపీ సర్వే సరిహద్దుల చట్టం-1923 ప్రకారం ఆయా గ్రామాల్లో భూముల సర్వేకు నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు. ఇనాం భూములు కలిగిన రైతులు, సంస్థలు, వ్యక్తులకు సెక్షన్‌9(1) నోటీసులు ఇస్తారు. సర్వే పూర్తయ్యాక సెక్షన్‌ 9(2) నోటీసు ఇచ్చి రైతుల సంతకాలు తీసుకుంటారు. గ్రామంలో, రైతుల భూముల సర్వే పూర్తయ్యాక సెక్షన్‌ 13 కింద తుది నోటిఫికేషన్‌ ఇస్తారు. అనంతరం ఇనాం రద్దు చట్టం-1956 కింద 55 గ్రామాల్లో సెటిల్‌మెంట్‌ ఆపరేషన్లు చేపడుతూ మండల తహసీల్దార్‌ లేదా ఇనాం డిప్యూటీ తహసీల్దార్‌ (ఇనాం డీటీ) చట్టంలోని సెక్షన్‌ 7(1) కింద నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. ఇనాం రైతుల జాబితాలు తయారు చేసి జిల్లా సెటిల్‌మెంట్‌ అధికారి అయిన జేసీ ఆమోదం తీసుకుంటారు. ఆ తర్వాత రైత్వారీ పట్టాల వివరాలను గ్రామాల వారీగా బహిర్గతం చేస్తారు. అనంతరం రైతులకు రైత్వారీ పట్టాలు జారీ చేస్తారు. ఈ విషయంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే పట్టాలు జారీ అయిన 60 రోజుల వ్యవధిలో ఇనామ్‌ రద్దు చట్టంలోని సెక్షన్‌ 7(2) కింద రెవెన్యూ కోర్టులో అప్పీల్‌ చేయాలి. ఆ గడువులోగా ఏ అభ్యంతరం, అప్పీల్‌ రాకపోతే పట్టాలు జారీ చేస్తూ తహసీల్దార్‌ ఇచ్చిన ఆదేశమే ఫైనల్‌ అవుతుంది. ఒకవేళ రైతుల అప్పీల్‌పై రెవెన్యూ కోర్టు ఆదేశాలు ఇస్తే ఆ మేరకు కోర్టు సూచించిన వ్యక్తులు, సంస్థల పేరిట తహసీల్దార్‌ కొత్తగా రైత్వారీ పట్టాలు జారీ చేయాలి. పట్టాల జారీ, రద్దులో సంబంధిత వ్యక్తుల విన్నపాలు వినకుండా ఏ నిర్ణయం తీసుకోరాదని సెక్షన్‌ 14(ఏ)(2) స్పష్టం చేస్తోంది.

సీసీఏల్‌ఏకు కీలక అధికారం

ఇనాం గ్రామాల్లో సర్వే, రైత్వారీ పట్టాల జారీ వ్యవహారంలో ఎప్పుడైనా జోక్యం చేసుకునే అధికారం భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌కు ఉంది. ఇనాం రద్దు చట్టంలోని సెక్షన్‌ 14(ఏ)(1) ప్రకారం మొత్తం కార్యక్రమం నిర్వహణలో ఎక్కడైనా తప్పులు జరిగినట్లు తేలినా, ఫిర్యాదులు వచ్చినా, రైతుల నుంచి విన్నపాలు వచ్చినా లేదా తన దృష్టికే ఏదైనా సమస్య వస్తే సుమోటోగా సీసీఎల్‌ఏ జోక్యం చేసుకొని, పరిష్కరించే అధికారం ఈ చట్టం కల్పిస్తోంది. మండల స్థాయిలో తహసీల్దార్‌, ఇనాం డీటీ, జిల్లా స్థాయిలో జేసీ నిర్వహించే రెవెన్యూ కోర్టుల్లో న్యాయం లభించకున్నా నేరుగా సీసీఎల్‌ఏ దృష్టికి సమస్యలను తీసుకెళ్లవచ్చని ఈ సెక్షన్‌ పేర్కొంటోంది.

రైతులూ బహుపరాక్‌...

ఇనాం గ్రామాల్లో భూముల సర్వే, రైత్వారీ పట్టాల జారీ చాలా కీలకమైన అంశం. దాదాపు 1956 నుంచి జరగని ఈ ప్రక్రియ ఇప్పుడు మొదలు కాబోతుంది. ఇనాం భూములున్న రైతులు సర్వే సమయంలో గ్రామంలోనే అందుబాటులో ఉండాలని రెవెన్యూ నిపుణులు సూచిస్తున్నారు. ‘‘సర్వే సమయంలో స్థానికంగా లేకపోతే 9(1), 9(2) నోటీసులు అందుకోలేరు. అప్పుడు ఆ భూములపై ఏం సర్వే చేశారు? నివేదికల్లో ఏం పొందుపరుస్తారో తెలిసే అవకాశమే ఉండదు. కాబట్టి రైతులు సర్వే సమయంలో కచ్చితంగా స్థానికంగా ఉండి, విధిగా సర్వే నోటీసులు అందుకోవాలి. నోటీసులు ఇవ్వని పక్షంలో తహసీల్దార్‌ దృష్టికి తీసుకెళ్లాలి. నోటీసులు అందుకోవడం, కొలుతల్లో తేడాలుంటే అప్పీల్‌ చేసుకోవడం చట్టం కల్పించిన హక్కులు. ఇనాం భూములపై కన్నేసిన భూ బకాసురులు, అక్రమార్కులు వాటిని అడ్డగోలుగా దక్కించుకునేందుకు చూస్తారు. కాబట్టి భూముల సర్వేను కీలకమైనదిగా రైతులు భావించాలి’’ అని రెవెన్యూ నిపుణుడు పద్మనాభయ్య సూచించారు.

రాష్ట్రంలో భూముల సర్వేలో మరో కీలకమైన అంకానికి తెర లేచింది. ఇనాం సెటిల్మెంట్‌ జరగని గ్రామాలతో పాటు ఇప్పటి వరకు అసలు సర్వే జరగని గ్రామాల్లోని ఇనాం భూములను కొత్తగా కొలవడానికి సర్కారు సిద్ధమైంది. ఏపీ సర్వే సరిహద్దుల చట్టం-1923 ప్రకారం భూముల సమగ్ర సర్వే చేసి, ఆంధ్రప్రదేశ్‌ ఇనాం రద్దు(రైత్వారీ గ్రామాలు) చట్టం- 1956 ప్రకారం రైత్వారీ పట్టాలు ఇవ్వాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) జి.సాయిప్రసాద్‌ మార్గదర్శకాలు జారీ చేశారు.

Updated Date - 2022-12-01T03:00:04+05:30 IST