ఏడాదికి లక్ష బాదుడు

ABN , First Publish Date - 2022-04-06T07:59:46+05:30 IST

వైసీపీ ప్రభుత్వ పాలనపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ప్రచార సమరానికి సిద్ధమైంది.

ఏడాదికి లక్ష బాదుడు

  • ‘బాదుడే బాదుడు’ పేరుతో ఇంటింటి ప్రచారం 
  • ఒక్కో కుటుంబంపై పడుతున్న భారం ఇది
  • కరపత్రాలతో ప్రచార సమరానికి టీడీపీ సిద్ధం 

అమరావతి, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ పాలనపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ప్రచార సమరానికి సిద్ధమైంది. పథకాల కింద ఇచ్చే డబ్బుతో సామాన్యులను ఎంతో ఆదుకొంటున్నట్లు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొడుతూ ఈ ప్రభుత్వ హయాంలో సామాన్యుల జేబులు గుల్ల అవుతున్నాయని సాక్ష్యాలతో సహా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి కుటుంబానికి వచ్చేది ఎంతున్నా పోయేది ఏడాదికి రూ.లక్షకు పైగానే ఉంటోందని ఆ పార్టీ అంచనా వేసింది. పథకాల ద్వారా 25శాతం కుటుంబాలకే సాయం అందితే, పడుతున్న భారం మాత్రం నూరు శాతం కుటుంబాలకు ఉందని ఆ పార్టీ ప్రచార కార్యక్రమం చేపట్టింది. ప్రతి కుటుంబంపైనా ఏడాదికి రూ.లక్ష భారం ఎలా పడుతోందో లెక్కలతో సహా వివరిస్తూ కరపత్రాలు ముద్రిస్తోంది. ‘బాదుడే బాదుడు’ పేరుతో ఇంటింటికీ తిరిగి ప్రజల్లో చర్చ తేవాలని టీడీపీ నిశ్చయించింది.


ఆ పార్టీ రూపొందించిన లెక్కల ప్రకారం 2019లో ఒక సామాన్య కుటుంబం నెలవారీ సంపాదన సగటున రూ.15వేలు ఉండేది. అందులో ఖర్చులు రూ.11వేలు పోను రూ.4వేలు మిగిలేవి. 2022లోనూ సంపాదన అదే రూ.15వేలుగా ఉంది. కానీ ఖర్చు మాత్రం రూ.20వేలకు పెరిగిపోయింది. దీనివల్ల ఒక్కో కుటుంబానికి నెలకు రూ.9వేల లోటు తేలుతోందని, ఈ లెక్కన 12నెలలకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.లక్షా 8 వేల అదనపు భారం పడుతోందని ఆ పార్టీ పేర్కొంది. వైసీపీ ప్రభుత్వ బాదుడుపై తాము చేస్తున్న పోరాటంలో అందరూ కలసి రావాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు మంగళవారం ఒక ట్వీట్‌లో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2022-04-06T07:59:46+05:30 IST