Fan Reverse: జగన్‌కు అనుకోని షాక్.. చంద్రబాబుకు ఫుల్ మైలేజ్..!

ABN , First Publish Date - 2022-09-29T02:13:02+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం పీలో ఇప్పుడు హాట్‌టాఫిక్‌గా మారింది....

Fan Reverse: జగన్‌కు అనుకోని షాక్.. చంద్రబాబుకు ఫుల్ మైలేజ్..!

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు (Tdp Chief Chandrababu naidu) ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం (Kuppam) ఏపీలో ఇప్పుడు హాట్‌టాఫిక్‌గా మారింది. టీడీపీ కంచుకోటలో చంద్రబాబును ఓడిస్తామని అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కంకణం కట్టుకున్న వైసీపీ (Ycp) అందుకు తగ్గట్టుగానే ఎత్తుగడలు వేస్తూ ముందుకు సాగుతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సామదానదండోపాయాలను ప్రయోగిస్తున్నా వైసీపీ అరాచకాలపై టీడీపీ వీరోచిత పోరాటం చేస్తోంది. అయినా వైసీపీ అక్రమ కేసులకు టీడీపీ శ్రేణులు జైళ్ళకు వెళ్ళక తప్పడం లేదు. అరాచకాలు, దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులతో టీడీపీ శ్రేణులను వైసీపీ వేధింపులకు గురి చేస్తోంది. వైసీపీ చర్యలను నిరసిస్తూ టీడీపీ ఆందోళనలు చేస్తూనే ఉంది. ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న కుప్పం వైసీపీ అధికారంలోకి వచ్చాక పూర్తిగా మారిపోయింది. 


కక్ష కట్టి వైసీపీ చేపట్టిన పరిణామాలు ఒక్క టీడీపీ శ్రేణులకే కాదు. స్థానిక ప్రజలకు కూడా తీవ్ర ఇబ్బందులుగా మారాయి. ఈ పరిస్థితుల్లో టీడీపీ క్యాడర్‌లో మనోధైర్యాన్ని నింపడంతో పాటు ప్రజలు పడుతున్న ఇబ్బందులపై చంద్రబాబు దృష్టి సారించి ప్రతి మూడు, నాలుగు నెలలకొకసారి కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో గత నెల చివరి వారంలో చంద్రబాబు కుప్పం పర్యటనకు వెళ్లగా వైసీపీ శ్రేణులు ఫ్లెక్సీ గొడవలు సృష్టించాయి. వైసీపీ, టీడీపీ మధ్య పరస్పర దాడులు జరిగాయి. అయితే పోలీసులు మాత్రం 72 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కానీ వైసీపీ వారిలో ఏ ఒక్కరిపైనా కేసు నమోదు చేయకపోవడం విమర్శలకు తావిచ్చింది. 


ఇక.. చంద్రబాబు అన్న క్యాంటీన్ (Anna Canteen) ప్రారంభోత్సవ సందర్భంలోనూ వైపీసీ ర్యాలీ చేపట్టి దాన్ని ధ్వంసం చేసింది. అదేమని.. నిరసనకు దిగితే పోలీసులు లాఠీచార్జీ చేయడం, సివిల్ డ్రస్‌లోని పోలీసులు.. టీడీపీ నేతల తలలు పగలగొట్టం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంలోనూ వైసీపీ నేతలపై పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. ఇక చంద్రబాబు తిరిగి వెళ్ళిన తర్వాత టీడీపీ మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులుతో పాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 72 మందికి గాను 8 మందిని అరెస్టు చేసి రిమాండ్‌లో భాగంగా చిత్తూరు సబ్‌జైలుకు తరలించారు. 


అరెస్ట్‌ విషయం తెలుసుకున్న చంద్రబాబు, నారా లోకేశ్ (Nara Lokesh), చంద్రబాబు జైలు దగ్గరకు వెళ్లి వారిని పరామర్శించారు. చంద్రబాబు, లోకేశ్ పర్యటనకు టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున చేరుకోవడంతో చిత్తూరు కిక్కిరిసిపోయింది. వైసీపీ అరాచక పాలన, అక్రమ కేసులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను ప్రజల్లో ఎడ్డగట్టారు. అదే సమయంలో 27 రోజుల తర్వాత హైకోర్టు నుంచి బైయిల్ రావడంతో అరెస్ట్‌ అయినవారు విడుదల అయ్యారు. బెయిల్‌పై విడుదలైన టీడీపీ నేతలు, కార్యకర్తలకు ఆ పార్టీ శ్రేణుల నుంచి ఘనస్వాగతం లభించింది. చిత్తూరు నుంచి కుప్పం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే అరెస్ట్‌ పరిణామాలు టీడీపీ శ్రేణులను కాస్తా ఇబ్బంది పెట్టినా.. ప్రజల్లో మాత్రం ఫుల్‌ మైలేజ్‌ వచ్చిందట. కానీ.. అక్రమ కేసులు పెట్టించి తాత్కాలిక ఆనందం పొందిన వైసీపీ శ్రేణులు మాత్రం.. టీడీపీకి వచ్చిన మైలేజ్‌ చూసి తెగ ఫీల్‌ అవుతున్నారట. టీడీపీ అరెస్ట్‌ల విషయంలో తప్పు చేశామా అని వైసీపీ శ్రేణులు లోలోపల మదనపడుతున్నాయట.


ఇదిలావుంటే.. కుప్పాన్ని టార్గెట్‌ చేసిన జగన్‌రెడ్డి.. సందు దొరికినప్పుడల్లా చంద్రబాబు ఇలాకాలో పర్యటనలు చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం కుప్పంలో చేయూత ప్రారంభోత్సవ కార్యక్రమం పేరుతో పర్యటించి స్థానికుల నుంచి తీవ్ర అపవాదు మూటకట్టుకోవాల్సి వచ్చింది. జగన్‌రెడ్డి టూర్ సందర్భంగా కుప్పం చుట్టుపక్కల ప్రాంతాలను రెండు రోజులపాటు అష్టదిగ్బంధనం చేశారు. ప్రజల్ని ఇళ్ల నుంచి కదలనీయకుండా చేసి, షాపులు మూయించి బంద్‌ వాతావరణం సృష్టించారు. దీంతో ఏపీ ప్రభుత్వంపై, పోలీసులు తీరుపైనా కుప్పంతోపాటు చుట్టుపక్కలవారు తీవ్ర ఆగ్రహం చేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రి పర్యటనలోనూ చేపట్టని విధంగా పోలీసులు ఓవరాక్షన్ ప్రదర్శించడంతో స్థానికులే కాదు. తమిళనాడు, కర్ణాటక ప్రజలు కూడా మండిపడ్డారు. ప్రధాని పర్యటనలోనూ చేపట్టని విధంగా జగన్‌రెడ్డి తిరిగి వెళ్లేంత వరకూ కుప్పానికి నలువైపులా 15 కిలోమీటర్ల దూరంలోని అన్ని జాతీయ, గ్రామీణ రోడ్లను మూసివేయడంతో ప్రజాగ్రహం పెల్లుబికింది. 


ఇంతవరకూ ఇలా ఉంటే ఇక కుప్పం సభలో జగన్‌రెడ్డి చేసిన ప్రసంగం ప్రజలను మరింత ఆలోచింపజేస్తోంది. ఇన్నేళ్ళుగా చంద్రబాబు.. కుప్పానికి ఏం చేయలేదని.. ఆయన హైదరాబాద్‌కు లోకల్ అయితే.. కుప్పానికి నాన్ లోకల్ అంటూనే, కుప్పాన్ని పులివెందల్లా చేస్తానన్న వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నా.. కుప్పాన్ని వారికి ఇవ్వకుండా చంద్రబాబు పోటీ చేయడం ఏంటని ప్రశ్నించారు. వైసీపీ బీసీలకే కేటాయిస్తుందని వచ్చే ఎన్నికల్లోనూ భరత్‌ను కుప్పంలో వైసీపీ అభ్యర్థిగా పోటీకి దింపుతామని ఆయన్ను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని జగన్ ప్రకటించడం, స్థానికుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. భరత్‌ను గెలిపిస్తే మంత్రి అయితే చంద్రబాబును గెలిపిస్తే ఏకంగా ముఖ్యమంత్రి అవుతారు కదా అంటూ జగన్‌ను కౌంటర్‌ ఎటాక్‌ చేస్తున్నారట. అంతేకాదు కులాల గురించి మాట్లాడుతున్న జగన్.. ఆయన జిల్లాలో అందరికీ రెడ్లకే మంత్రి పదవులు ఇచ్చారని ఏం కడప జిల్లాలో బీసీలు కనిపించలేదా..? అంటూ ఓ రేంజ్‌లో ప్రశ్నలు సంధిస్తున్నారట. అటు జగన్‌రెడ్డి కుప్పం పర్యటనతో వైసీపీలోని వర్గ విభేదాలు ఒక్కసారిగా బహిర్గతం అయ్యాయి. భరత్‌ పేరును పదే పదే ప్రస్తావించడంతోపాటు ఆయన వర్గానికే ప్రాధాన్యం ఇచ్చారని వైసీపీలోని మరో వర్గం తీవ్ర అసంతృప్తికి లోనైందట..


మొత్తానికి జగన్ పర్యటనతో కుప్పం వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో తీవ్ర అపవాదు మూటగట్టుకోవాల్సి వచ్చింది. కుప్పం విషయంలో ఏదో ఊహించుకుంటున్న వైసీపీ అధినేతకు అనుకోని విధంగా షాక్‌ తగులుతోంది. ఏదేమైనా కుప్పం రాజకీయ పరిణామాలు ఇప్పుడే ఇలా ఉంటే.. రాబోయే రోజుల్లో ఇంకెలా ఉంటాయో చూడాలి మరి.
Read more