ఫొటోషూట్‌, డ్రోన్‌షాట్‌ల కోసం చంపేశారు

ABN , First Publish Date - 2022-12-31T06:01:31+05:30 IST

రాష్ట్రంలో చెడిపోయిన రాజకీయ వ్యవస్థతో యుద్ధం చేస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు

ఫొటోషూట్‌, డ్రోన్‌షాట్‌ల కోసం చంపేశారు

రాజకీయాలంటే కెమెరాలతో షూటింగ్‌ కాదు

చెడిపోయిన రాజకీయవ్యవస్థతో యుద్ధం చేస్తున్నా

పింఛను పెంచుతామంటే ఓర్వలేకపోతున్నారు

దత్త పుత్రుడు, దత్త తండ్రిది ఒకటే తరహా

మూడు ప్రాంతాల సమానాభివృద్ధికి కట్టుబడ్డా

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వ్యాఖ్యలు

నర్నీపట్నంలో వైద్యకళాశాలకు శంకుస్థాపన

అనకాపల్లి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చెడిపోయిన రాజకీయ వ్యవస్థతో యుద్ధం చేస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. జనవరి ఒకటో తేదీ నుంచి పేదలకు పింఛన్‌ పెంచుతామంటే ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. శుక్రవారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మునిసిపాలిటీ పరిధిలోని జోగినాథునిపాలెంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. తొలుత మాకవరపాలెం మండలం భీమబోయినపాలెంలో 52.15 ఎకరాల్లో రూ.500 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన వైద్య కళాశాల భవన నిర్మాణానికి, రూ.470 కోట్లతో చేపట్టనున్న ఏలేరు-తాండవ పంట కాలువల అనుసంధానం పథకానికి, అదేవిధంగా నర్సీపట్నం మునిసిపాలిటీలో అబీద్‌ సెంటర్‌ నుంచి పెదబొడ్డేపల్లి మదుం, శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి పెదబొడ్డేపల్లి వరకు రూ.16.6 కోట్లతో చేపట్టనున్న రహదారి విస్తరణ పనులకు శిలా ఫలకాలను ఆ ప్రాంగణంలోనే సీఎం జగన్‌ ఆవిష్కరించారు. అనంతరం సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘ఫొటోషూట్‌ల కోసం..డ్రోన్‌ షాట్‌ల కోసం జనం బాగా రాకపోయినా కూడా వచ్చారని చూపించడం కోసం...కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు చిన్న సందుగొందుల్లోకి, ఇరుకు రోడ్డులోకి జనాన్ని నెట్టారు. ఎనిమిది మందిని చంపేశారు. గతంలో పుష్కరాల సందర్భంలోనూ షూటింగ్‌ల కోసం డైరెక్టర్‌ను పక్కనపెట్టుకొని ఏకంగా 29 మందిని చంపేశారు. ఇంతకంటే ఘోరం ఎక్కడైనా ఉంటుందా?’’ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబును చూసి...ఇదేం ఖర్మరా బాబు మనకు...మన రాష్ట్రానికి అని ప్రజలు అనుకుంటున్నారని విమర్శించారు. మరొకరు రాజకీయాల్లోకి వచ్చి 14 సంవత్సరాలు అయ్యిందంటూ జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై విమర్శలు గుప్పి ంచారు. ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా ఆయన వెంటలేరని, రెండుచోట్ల పోటీ చేస్తే రెండుచోట్లా ప్రజలు ఓడించారన్నారు. ‘‘ఆయనకు నిర్మాత, డైరెక్టర్‌ చంద్రబాబు. చంద్రబాబు ఎప్పుడు షూటింగ్‌ అంటే అప్పుడు పవన్‌ కాల్షీట్లు ఇస్తారు. ఎక్కడ షూటింగ్‌ అంటే అక్కడకు వస్తారు. బాబు స్ర్కిప్టు ఇస్తారు. బాబుకు అనుకూలంగా ఆయన యాక్ట్‌చేసి చూపిస్తారు. ఇదీ ఈయన స్టైల్‌. దత్త పుత్రుడు, దత్త తండ్రి.. ఇద్దరిదీ ఒకటే స్టైల్‌’’ అని వ్యాఖ్యానించారు. రాజకీయాలంటే డ్రోన్‌ కెమెరాలతో షూటింగ్‌ కాదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేదల జీవితాల్లో మార్పునకు ప్రయత్నించడమే నిజమైన రాజకీయమన్నారు. ‘‘చంద్రబాబు రాష్ట్రంలో ఏ మంచి పని జరిగినా తానే చేశానని, తనవల్లే జరిగిందని చెప్పుకొంటారు. చివరికి సింధు బ్యాడ్మింటన్‌లో గెలిచినా...ఆమెకు ఆడడం తానే నేర్పించానని అంటారు. ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో నీళ్లు ఉండవు, రెవెన్యూ డివిజన్‌ కోసం కూడా ఆయన ప్రయత్నించలేదు. వైసీపీ వచ్చాకే కుప్పంలో రెవెన్యూ డివిజన్‌ వచ్చింది’’ అని అన్నారు. చంద్రబాబును చూస్తే గురుకొచ్చే స్కీమ్‌లు.. వెన్నుపోటు, మోసాలు అని వ్యాఖ్యానించారు. ‘‘ప్రతి వర్గాన్నీ వంచించిన చంద్రబాబు పెట్టే సభలకు జనం ఎందుకువస్తారు? రూ.87,612 కోట్లు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి, రైతులను నిండా మోసం చేశారు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు రూ.14,204 కోట్లు రుణమాఫీ చేస్తానని.. వడ్డీలు కూడా కట్టొద్దని చెప్పి మోసం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను, పూర్తిగా తన ప్రత్యేక ప్యాకేజీ కోసం తాకట్టు పెట్టా రు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని, ఉద్యోగం ఇవ్వలేకపోతే రూ.2 వేలు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఎగ్గొట్టారు. అందుకని ఆయనకు థాంక్యూ బాబూ అని చెప్పడానికి రైతులు, మహిళలు, నిరుద్యోగులు వస్తారా?’’ అని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిని దుష్టచతుష్టయం అడ్డుకుంటోందని మరోసారి మీడియాపై అక్కసు వెళ్లగక్కారు.

Updated Date - 2022-12-31T06:01:31+05:30 IST

Read more