Breaking : APPSC Chairman గా గౌతమ్ సవాంగ్..
ABN , First Publish Date - 2022-02-17T16:54:29+05:30 IST
ఆంధ్రప్రదేశ్ డీజీపీగా పనిచేసిన గౌతమ్ సవాంగ్‌ను జగన్ సర్కార్ అవమానకర రీతిలో

అమరావతి : ఆంధ్రప్రదేశ్ డీజీపీగా పనిచేసిన గౌతమ్ సవాంగ్‌ను జగన్ సర్కార్ అవమానకర రీతిలో సాగనంపిదని తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆయనకు ఏపీ ప్రభుత్వం పదవిని ఫిక్స్ చేసింది. ఏపీపీఎస్సీ చైర్మన్‌గా గౌతమ్ సవాంగ్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గురువారం ఉదయం ఇందుకు సంబంధించి ప్రతిపాదనలను గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్‌కు ప్రభుత్వం పంపింది. అయితే.. గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. రెండ్రోజుల క్రితం డీజీపీ పోస్ట్ నుంచి సవాంగ్ బదిలీ అయ్యారు. ఏపీపీఎస్సీ చైర్మన్‌గా ఉన్న ఉదయ్‌భాస్కర్ పదవీ కాలం ఆరు నెలల క్రితం ముగిసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ ఖాళీగానే ఉంది. ఈ నేపథ్యంలో సవాంగ్‌ను చైర్మన్‌గా నియమించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఇవాళ ఉదయం ఆ పదవిని కేటాయించింది. ఈ పోస్ట్ ఇవ్వడంపై సవాంగ్ ఇంతవరకూ స్పందించలేదు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే... గౌతమ్ సవాంగ్‌ను పోలీస్ బాస్‌గా నియమించింది. ప్రత్యర్థులపైకి పోలీసులను విచ్చలవిడిగా ప్రయోగించడమూ మొదలైంది. పాలకుల రాజకీయ లక్ష్యాలు ఎలా ఉన్నప్పటికీ... ఐపీఎస్ అధికారిగా, డీజీపీగా నిబంధనల ప్రకారం వెళ్లాల్సిన గౌతమ్ సవాంగ్ పూర్తిస్థాయిలో ప్రభుత్వ పెద్దలకు సహకరించారు. దాడులు జరుగుతున్నా, తప్పుడు కేసులు పెడుతున్నా చూసీ చూడనట్లు ఉండిపోయారు. దీంతో... గతంలో ఏ డీజీపీ ఎదుర్కోనన్ని విమర్శలను ఎదుర్కొన్నారు. వివాదాస్పదుడిగా మిగిలిపోయారు. ఇలా గౌతమ్ సవాంగ్‌ను ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంది. అయినా సరే... సర్కారు వారికి ఆయన సేవలపై ‘సంతృప్తి’ కలగలేదు. చివరికి ఆయన్ను సాగనంపేసి.. ఆయన స్థానంలో కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని జగన్ సర్కార్ నియమించింది. అయితే.. సవాంగ్‌ను ఇంత సడన్‌గా బదిలీ చేయడం వెనుక పెద్ద కథే నడిచిందని అటు సోషల్ మీడియాలో.. ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.