ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మారుతుందా!
ABN , First Publish Date - 2022-10-17T09:51:43+05:30 IST
రాజధాని విషయంలో హైకోర్టు నిష్పక్షపాతంగా తీర్పునిచ్చిందని, అసెంబ్లీలో చట్టబద్ధంగా అమరావతిని రాజధాని చేస్తే దాన్నిఎలా మారుస్తారని లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు
అప్పులు చేస్తే రాష్ట్రం దివాలా తీస్తుంది: లోక్సత్తా అధినేత జేపీ
విజయవాడ, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): రాజధాని విషయంలో హైకోర్టు నిష్పక్షపాతంగా తీర్పునిచ్చిందని, అసెంబ్లీలో చట్టబద్ధంగా అమరావతిని రాజధాని చేస్తే దాన్నిఎలా మారుస్తారని లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానిని మార్చుకుంటూపోతే తుగ్లక్ చర్యగా భావించాల్సి వస్తుందన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం అమరావతినే రాజధానిగా కొనసాగించాలని లోక్సత్తా మొదటినుంచీ స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. రాష్ట్రంలో అప్పులు విపరీతంగా పెరిగిపోయాయని, ప్రభుత్వం ఇలా అప్పులు చేస్తూ పోతే ఆర్థికలోటు ఏర్పడి రాష్ట్రం దివాలా తీయడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేశారు. తాత్కాలిక అవసరాలకు ఎడాపెడా అప్పులు చేసుకుంటూ వెళ్తే ఎలా.. అని ప్రశ్నించారు. చేసిన అప్పులను రాష్ట్ర భవిష్యత్తుకు వినియోగిస్తేనే సామాన్యుల ఆర్థిక ప్రగతికి దోహదమవుతాయని అభిప్రాయపడ్డారు. పేదలకు సంక్షేమ ఫలాలు ఒక్కటే సరిపోదని, ఆర్థిక పరిపుష్టి కావాలని అన్నారు. విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పన కూడా ముఖ్యమన్నారు.
దేశంలో పలు రంగాల్లో ఇతర రాష్ర్టాలు ఎగుమతుల్లో ముందున్నాయని, ఏపీ స్థానం ఎక్కడని ప్రశ్నించారు. ఏపీలో వనరులు పుష్కలంగా ఉన్నా వాటిని వినియోగించుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేదన్నారు. రాబోయే రోజుల్లో అభివృద్ధి సూచీలో ఏపీ అట్టడుగు స్థానంలో ఉంటుందని హెచ్చరించారు. వైసీపీ నాయకులు రాష్ట్ర భవిష్యత్తును ఫణంగా పెట్టి ప్రజల ఆర్థిక ప్రగతిని నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత నడుం బిగించి రాష్ట్ర రాజకీయాల్లోకి రాకపోతే ముందు తరాల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందన్నారు. మాతృభాషలోనే విద్యా ప్రమాణాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్లుగా ప్రైవేటు వైద్యులను నియమించాలన్నారు. అసెంబ్లీ సమావేశాల వెగటు పుట్టిస్తున్నాయన్నారు. తెలుగునాట రాజకీయ తీరు మారాలని హితవు పలికారు.