కొత్త సీఎస్‌గా జవహర్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-11-30T03:37:41+05:30 IST

రాష్ట్రప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కొమ్మాశివయ్యగారి (కేఎస్‌) జవహర్‌రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుత సీఎస్‌ సమీర్‌ శర్మ

కొత్త సీఎస్‌గా జవహర్‌రెడ్డి

నేడు బాధ్యతల స్వీకారం.. ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’

సమీర్‌ శర్మ తర్వాత ఆయనేనని

నవంబరు 10నే వెల్లడి

సీఎంవోలోకి పూనం మాలకొండయ్య

ఆరుగురు సీనియర్‌ అధికారుల బదిలీ

పాఠశాల విద్యకు ప్రవీణ్‌ ప్రకాశ్‌

రవాణా, ఆర్‌అండ్‌బీ కార్యదర్శిగా ప్రద్యుమ్న

వై.మధుసూదన్‌రెడ్డికి వ్యవసాయం

జీఏడీలో రిపోర్టు చేయాలని

బుడితి రాజశేఖర్‌కు ఆదేశం

అమరావతి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కొమ్మాశివయ్యగారి (కేఎస్‌) జవహర్‌రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుత సీఎస్‌ సమీర్‌ శర్మ బుధవారం పదవీవిరమణ చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం జవహర్‌రెడ్డి ఆయన నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. వాస్తవానికి సమీర్‌ శర్మ పదవీకాలం పొడిగింపునకు కేంద్రం అంగీకరించలేదని.. ఈ నేపథ్యంలో జవహర్‌రెడ్డినే ఆయన స్థానంలో నియమించాలని జగన్‌ ప్రభుత్వం నిర్ణయించినట్లు ‘ఆంధ్రజ్యోతి’ గత నెల 10నే తెలిపింది. తర్వాత పూనం మాలకొండయ్య, శ్రీలక్ష్మి తదితర సీనియర్‌ ఐఏఎ్‌సల పేర్లను పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చినా.. చివరకు జవహర్‌రెడ్డినే సీఎస్‌గా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2024 జూన్‌ వరకూ ఆయనకు సర్వీసు ఉంది. ఆయన సీఎస్‌ కావడంతో సీఎం కార్యాలయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్యను ప్రభుత్వం నియమించింది. సీఎస్‌ పోస్టు కోసం పూనం కూడా తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. కానీ సీఎంవోలో విధులు నిర్వహించేందుకు అవకాశం కల్పించారు.

ఆమెతో పాటు ఆరుగురు సీనియర్‌ అధికారులను బదిలీచేశారు. సీఎ్‌సగా సమీర్‌శర్మ చివరి ఉత్తర్వులివే. పూనం నిర్వహిస్తున్న వ్యవసాయం, దాని అనుబంధ విభాగాల బాధ్యతలను ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారె్‌స్టగా విధులు నిర్వహిస్తున్న వై.మధుసూధన్‌రెడ్డికి అదనంగా అప్పగించారు. రవాణా, ఆర్‌అండ్‌బీ శాఖల ముఖ్య కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్‌ ప్రకాశ్‌ను పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీచేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న బుడితి రాజశేఖర్‌ను బదిలీ చేసి పోస్టింగ్‌ ఇవ్వలేదు. జీఏడీలో రిపోర్టు చేయాలని ఆయన్ను ఆదేశించారు. వ్యవసాయ మార్కెటింగ్‌ విభాగంలో ఉన్న ప్రద్యుమ్నను బదిలీ చేసి రవాణా, ఆర్‌అండ్‌బీ శాఖల కార్యదర్శిగా నియమించారు. గృహనిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాహుల్‌ పాండ్యాను బదిలీ చేసి వ్యవసాయ మార్కెటింగ్‌ కమిషనర్‌గా నియమించారు. మార్క్‌ఫెడ్‌ ఎండీగా కూడా ఆయ న అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. గృహనిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బి.మహ్మద్‌ దివాన్‌ మైదీన్‌ను నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

1991 నుంచి వివిధ పదవుల్లో..: 1990 బ్యాచ్‌కు చెందిన కేఎస్‌ జవహర్‌రెడ్డి 1964 జూన్‌ 2న జన్మించారు. స్వగ్రామం వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలంలోని కసనూరు. తల్లిదండ్రులు లక్ష్మీదేవమ్మ, ఈశ్వర్‌రెడ్డి. ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు ముద్దనూరులో.. 8, 9, 10 తరగతులు ఎర్రగుంట్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో.. ఇంటర్‌ కడప ఆర్ట్స్‌ కళాశాలలో ఇంటర్‌.. బీవీఎస్‌ (వెటర్నరీ సైన్స్‌) ఎస్వీ యూనివర్సిటీలో చదివారు. ఎస్వీ యూనివర్సిటీలో ఎంవీఎస్‌ గోల్డ్‌మెడల్‌ సాధించారు. 1990లో ఐఏఎ్‌సకు ఎంపికయ్యారు. ఏడాది శిక్షణ తర్వాత 1991 జూన్‌లో వరంగల్‌ అసిస్టెంట్‌ కలెక్టర్‌గా విధుల్లో చేరారు. అనంతరం మహబూబ్‌నగర్‌ అసిస్టెంట్‌ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఏడాది తర్వాత మూడు నెలలపాటు రెండో విడత శిక్షణ పూర్తిచేసుకుని వచ్చిన ఆయనకు నర్సాపూర్‌ అసిస్టెంట్‌ కలెక్టర్‌గా ప్రభుత్వం పోస్టింగ్‌ ఇచ్చింది. అనంతరం భద్రాచలం ఐటీడీఏ పీవోగా రెండేళ్ల పాటు విధులు నిర్వహించారు. ఆ తర్వాత తొమ్మిది నెలల పాటు నల్గొండ్‌ జాయింట్‌ కలెక్టర్‌గా పని చేశారు. మధ్యలో చిన్న చిన్న పోస్టుల్లో పనిచేసిన ఆయన.. 1999 ఏప్రిల్లో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. 2002 వరకు అక్కడ విధులు నిర్వహించారు. 2002 నుంచి 2005 మే వరకూ తూర్పుగోదావరి కలెక్టర్‌గా ఉన్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌ అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ ఎండీగా పనిచేశారు. 2009 ఆగస్టులో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి స్పెషల్‌ సెక్రటరీగా నియమితులయ్యారు. 2014 ఫిబ్రవరిలో పరిశ్రమల శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. అనంతరం పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి, ముఖ్య కార్యదర్శిగా ఐదేళ్ల పాటు పని చేశారు. 2019లో జగన్‌ ప్రభుత్వం రాగానే వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా ఆయన్ను నియమించింది. ఆ సమయంలోనే స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీగా పదోన్నతి లభించింది. తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) ఈవోగా ఆయన 19 నెలల పాటు పని చేశారు. అనంతరం ప్రభుత్వం జలవనరుల శాఖ స్పెషల్‌ సీఎ్‌సగా బదిలీ చేసింది. అక్కడ మూడు నెలలు మాత్రమే విధులు నిర్వహించిన ఆయన.. ఈ ఏడాది ఫిబ్రవరిలో సీఎం స్పెషల్‌ సీఎ్‌సగా.. తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 31 ఏళ్లుగా ఆయన నిర్వహిస్తూ వచ్చిన ప్రతి పోస్టూ కీలకమైనదే కావడం విశేషం. జవహర్‌రెడ్డి భార్య పద్మజ. వీరికి స్నేహిత్‌రెడ్డి ఒక్కడే కుమారుడు.

Updated Date - 2022-11-30T03:37:41+05:30 IST

Read more