ఆగిన ఉద్యమ ‘డప్పు’

ABN , First Publish Date - 2022-03-19T07:55:00+05:30 IST

ప్రజాచైతన్యంలో కీలక భూమిక పోషించిన ‘డప్పు’ గుండె ఆగిపోయింది. ఆయన ఆలాపనకు ఆలంబనైన డప్పునే ఇంటిపేరుగా మార్చుకున్న పట్టపు రమేశ్‌(61) హృద్రోగ సమస్యలతో బాధపడుతూ శుక్రవారం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు.

ఆగిన ఉద్యమ ‘డప్పు’

  • అనారోగ్యంతో జననాట్యమండలి రమేశ్‌ మృతి
  • విద్యార్థిగా ఉండగానే కళలు, వాయిద్యాలపై ఆసక్తి
  • విజయవాడలో చికిత్సపొందుతూ మృతి
  • గుంటూరుజిల్లా జూలకల్లులో నేడు అంత్యక్రియలు
  • పీపుల్స్‌వార్‌లో పనిచేస్తూ చర్చల కాలంలో బయటకు..


విజయవాడ, మార్చి 18(ఆంధ్రజ్యోతి): ప్రజాచైతన్యంలో కీలక భూమిక పోషించిన ‘డప్పు’ గుండె ఆగిపోయింది. ఆయన ఆలాపనకు ఆలంబనైన డప్పునే ఇంటిపేరుగా మార్చుకున్న పట్టపు రమేశ్‌(61) హృద్రోగ సమస్యలతో బాధపడుతూ శుక్రవారం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు. దాదాపు నాలుగు దశాబ్దాల విప్లవ కళాజీవితం ఆయనది. రమేశ్‌ అంత్యక్రియలు గుంటూరు జిల్లా జూలకల్లు గ్రామంలో శనివారం నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. రమేశ్‌ అసలు పేరు ఎలియాజర్‌. గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతం అంగలకుదురు గ్రామంలో 1960లో అహరోన్‌, ఎమేలిమ్మ దంపతులకు రమేశ్‌ జన్మించారు. తల్లిదండ్రులు గ్రామంలో సొంతంగా చర్చిని నిర్మించి నిర్వహించేవారు. రమేశ్‌ తెనాలిలోని వీఎ్‌సఆర్‌ కళాశాలలో బీఏ చదువుతుండగా.. విప్లవ రాజకీయాలు పరిచయమయ్యాయి. తెనాలిలో లెక్చరర్‌గా పనిచేసే విరసం నాయకుడు వీజే వర్థనరావు ఆయనకు రాజకీయ మార్గదర్శి. గ్రామంలోని చర్చి ప్రార్థనల్లో రమేశ్‌ డోలక్‌, డ్రమ్స్‌ వాయించేవారు. ఈ ప్రావీణ్యం ఆయనను పీపుల్స్‌వార్‌ పార్టీకి అనుబంధంగా ఉండే కళాసంస్థ జననాట్యమండలి వైపు ఆకర్షించేలా చేసింది.


నెల్లూరులో 1983-84లో ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు ఆధ్వర్యంలో నెలపాటు జరిగిన వర్క్‌షాపు ఆయన ఆలోచనలు, దృక్పథాన్ని పూర్తిగా మార్చివేసింది. పూర్తి జీవితాన్ని కళారంగంలో గడపాలని ఆయన నిర్ణయించుకుని.. చివరివరకు అలాగే కొనసాగారు. ప్రముఖ కళాకారులు గద్దర్‌, వంగపండుకు డప్పు సహకారం అందిస్తూ దేశమంతా ప్రదర్శనలు ఇచ్చారు. కారంచేడులో 1985లో దళిత సామాజికవర్గంపై దాడులు జరిగాయి. ‘దళిత పులులమ్మా..’ అంటూ ఈ ఘటనపై పాడిన గీతం మంచిపేరు తెచ్చింది. గుంటూరుకు చెందిన కళాకారిణి కుమారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. జననాట్యమండలిని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని సంస్థలతో కలిపి 1992 మే 21న నిషేధించడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అక్కడ ఉండగానే కుమారి మలేరియా బారినపడి 1997లో చనిపోయారు. ఆ తర్వాత జ్యోతి అనే కళాకారిణిని జీవిత భాగస్వామిని చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు నక్సల్స్‌ తో ప్రభుత్వం చర్చలు జరిపింది. ఈ కాలంలో రమేశ్‌ అజ్ఞాతవాసం వీడి బయటకు వచ్చారు. తర్వాత హృద్రోగ సమస్యలు బయటపడటంతో ఉద్యమాన్ని విరమించి హైదరాబాద్‌లో స్థిర పడ్డారు. 9నెలలుగా ఆయన కుటుంబం విజయవాడలోనే ఉంటోంది. జననాట్యమండలిలో పనిచేస్తుండగా 1980ల్లో ఖమ్మంలో ఒకసారి రమేశ్‌ అరెస్టు అయి కొంతకాలం జైలుజీవితం గడిపారు. ఛత్తీ్‌సగఢ్‌లోని నాగర్నార్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో నమోదైన కేసులో ఇతర ప్రజాసంఘాల నాయకుల ఇళ్లతోపాటు ఇటీవల విజయవాడలోని ఆయన నివాసంలోనూ ఎన్‌ఐఏ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ విచారణలతో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టలేదని చెబుతున్నారు. ఈ క్రమంలో గుండె కొట్టుకునే సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. కొద్దిరోజుల క్రితం వరకు నిమిషానికి 50 సార్లు కొట్టుకున్న గుండె 20కి పడిపోవడంతో ఈ నెల 5న విజయవాడలో ఓ ప్రైవేటు అస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆయన మరణించారు.




గద్దర్‌ నుంచి జేఎన్‌ఎం పగ్గాలు..

జననాట్యమండలిలో గద్దర్‌, దివాకర్‌ రమేశ్‌కు గురువులు. మెడిసిన్‌ చదువుతూ ఉద్యమంలోకి వచ్చిన దివాకర్‌ అనంతర కాలంలో ఓ ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. జన నాట్యమండలిలో సీనియర్‌ నేతలు సంజీవ్‌, ఏసు, వెంకటస్వామితో సాన్నిహిత్యం ఉంది. జననాట్యమండలికి గద్దర్‌ దూరం అయ్యాక రమేశ్‌ ఒంటిచేత్తో బాధ్యతలు నిర్వహించారు. 1975 నుంచి 2017 వరకు జననాట్యమండలి, ఇతర అనుబంధ సంఘాల పాటలు, చరిత్రను డిజిటల్‌ రూపం లో తీసుకొచ్చారు. అజ్ఞాతంలో ఉండగా దండకారణ్యంలో రికార్డు చేసిన పాటలు, వీడియోలను డప్పురమేశ్‌ చానల్‌ పేరిట డిజిటలైజ్‌ చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు.

Updated Date - 2022-03-19T07:55:00+05:30 IST