జగనన్న రోడ్లకు మళ్లీ ‘జలకళ’!

ABN , First Publish Date - 2022-08-10T09:01:50+05:30 IST

జగనన్న అన్న మాట నిలబెట్టుకున్నారు! రోడ్లపై ఒక్క గుంత కనిపించకూడదన్న జగనన్న ఆదేశం అమల్లోకి వచ్చింది...

జగనన్న రోడ్లకు మళ్లీ ‘జలకళ’!

  • వర్షాలతో జలమయమైన గుంతల రోడ్లు
  • వాహనచోదకులకు తప్పని అవస్థలు
  • అక్కడక్కడా ప్యాచ్‌వర్కులు చేసినా షరా మామూలే
  • పక్కాగా రోడ్లు బాగుచేసే వరకూ ఇదే దుస్థితి
  • జగనన్న మాట నెరవేరేదెన్నడోనని జనఘోష

(అమరావతి-ఆంధ్రజ్యోతి): జగనన్న అన్న మాట నిలబెట్టుకున్నారు! రోడ్లపై ఒక్క గుంత కనిపించకూడదన్న జగనన్న ఆదేశం అమల్లోకి వచ్చింది!! అవును.. ఇప్పుడు రోడ్లపై గుంతలే కనిపించడం లేదు!! తాజాగా కురిసిన వర్షాలతో రోడ్లపై గుంతలన్నీ జలమయమయ్యాయి. దీంతో ఎక్కడ విన్నా.. జగనన్న చెప్పినట్లు.. రోడ్లపై గుంతలే లేవు.. గుంతల నిండా వర్షపు నీళ్లు నిండాయిగా.. అని వాహనచోదకులు ఎద్దేవా చేస్తున్నారు. అధ్వాన రోడ్లపై తమ అవస్థలు భరించలేక ఈ విధంగా మండిపడుతున్నారు. నాలుగైదు రోజుల క్రితం వరకు రాష్ట్ర, జిల్లా, గ్రామీణ రహదారులపై ఎక్కడపడితే అక్కడ భారీ గోతులు కనిపించాయి. ఇటీవల కొంతకాలంగా రోడ్లను పట్టించుకోలేదంటూ తీవ్ర విమర్శలు రావడంతో అధికారులు అక్కడక్కడా ప్యాచ్‌ వర్కులు చేసినా.. అవి తూతూమంత్రంగానే చేశారు. 


దీంతో.. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గుంతల రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ఎక్కడ గోయి ఉందో తెలియని పరిస్థితి. వాస్తవానికి.. రాష్ట్రంలో ప్రతి ఏటా 8వేల కిలోమీటర్ల చొప్పున రహదారి మెయింటెనెన్స్‌, రిపేర్‌వర్క్‌లు చేపట్టాలి. ఈ లెక్కన గత మూడేళ్లలో 24వేల కిలోమీటర్ల మేర మరమ్మతులు, నిర్వహణ పనులు చేపట్టాలి. అయితే, జగన్‌ సర్కారు 2200 కోట్లతో మరమ్మతు పనులకు టెండర్లకు పిలిచింది. అక్కడక్కడా ప్యాచ్‌ వర్కులు చేపట్టారు. అయిన్పటికీ.. చిన్న చినుకుపడితే చాలు.. పరిస్థితి షరా మామూలే! ఇటీవల భారీ వర్షాలు, గోదావరి వరదల కారణంగా ఐదు జిల్లాల పరిధిలో 1800 కిమీ రోడ్లు దెబ్బతిన్నాయి. తాజా వర్షాలతో ఈ సంఖ్య మరింత పెరగనుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేసి రోడ్లు పునరుద్ధరించాలని వాహనచోదకులు, ప్రయాణికులు కోరుతున్నారు.

Updated Date - 2022-08-10T09:01:50+05:30 IST