AMUL MILK: అమూ..లాగ్రం అబద్ధాలే!
ABN , First Publish Date - 2022-12-15T03:36:45+05:30 IST
రాష్ట్రంలో విజయా బ్రాండ్‌తో నడిచిన సహకార డెయిరీలు కొన్నేళ్లుగా నిర్వహణ భారమై పలు జిల్లాల్లో మూతపడ్డాయి. వాటిని పునరుద్ధరించి తీరుతామని ఎన్నికల సమయంలో జగన్ ఆర్భాటం చేశారు.
డెయిరీలు పునరుద్ధరిస్తామన్న జగన్
పాడి రైతులకు రూ.4 బోన్‌సకు హామీ
అధికారంలోకి రాగానే అమూల్‌తో డీల్
ప్రైవేట్ డెయిరీలపై వైసీపీ దొంగదెబ్బ
బోన్‌సపై రాష్ట్ర ప్రభుత్వం వింత భాష్యం
పెరిగే ధరలే బోనస్ అంటూ తేల్చివేత
(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విజయా బ్రాండ్‌తో నడిచిన సహకార డెయిరీలు కొన్నేళ్లుగా నిర్వహణ భారమై పలు జిల్లాల్లో మూతపడ్డాయి. వాటిని పునరుద్ధరించి తీరుతామని ఎన్నికల సమయంలో జగన్ ఆర్భాటం చేశారు. అధికారంలోకి రాగానే షరామామూలుగానే ఆయన మాట తప్పారు. మడమ తిప్పేశారు. మూతపడ్డ సహకార డెయిరీలను పునరుద్ధరణ పేరుతో అమూల్‌కు వరుసగా పరాధీనం చేస్తున్నారు. ఇప్పటికే మదనపల్లిలోని ప్లాంట్‌ను అమూల్‌కు అప్పగించారు. తాజాగా చిత్తూరు డెయిరీని లీజు పద్ధతిలో ఈ గుజరాత్ పాల సంస్థకు కట్టబెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసు కుంది. ఏటా రూ.కోటి చెల్లించేలా 99ఏళ్లకు లీజుకిస్తూ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసింది. అయితే 99 సంవత్సరాల్లో లీజు పెంపుదల అంశం కేబినెట్ తీర్మానంలో ప్రస్తావించలేదని తెలిసింది. అంటే వచ్చే 99ఏళ్లూ రూ.కోటి లెక్కనే లీజుకిచ్చినట్టేనా? మరోవైపు అమూల్ సంస్థ అన్నేళ్లకు లీజు కోరలేదని తెలిసింది. అయితే, రాష్ట్రంలోని ఇతర సహకార డెయిరీలను కూడా లీజు పద్ధతిలో అమూల్‌కే కట్టబెట్టే యోచనలో ప్రభుత్వం ఉందని చెప్తున్నారు. ఏపీ డెయిరీ డెవల్‌పమెంట్ ఫెడరేషన్ పరిధిలో వృధాగా, ఉపయోగంలో లేని ఆస్తులు, యంత్రాలను అమూల్‌కు నామమాత్రపు లీజు కు ఇస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలోని పాల సహకార సంస్థల్లోని ఆస్తులను ఈ సంస్థకు ఉత్పత్తి ఆధారిత లీజుకు ఇవ్వనున్నట్లు పేర్కొంది. ‘జగనన్న పాల వెల్లువ’ పేరుతో ఏపీ అమూల్ ప్రాజెక్ట్‌కు సహకార డెయిరీల ఆస్తులను కట్టబెడుతోంది. ఏపీ డెయిరీ ఫెడరేషన్ సంపాదించిన, కొనుగోలుచేసిన, సృష్టించిన ఆస్తులను ఒప్పందంలో భాగంగా అమూల్‌కు లేదా దాని అనుబంధ సంఘాలకు నామమాత్రపు లీజు కు ఇవ్వాలని నిర్ణయించింది.
‘చిత్తూరు’పై ఎన్ని చెప్పారో..
సహకార డెయిరీల్లో అతి పెద్దది చిత్తూరు డెయిరీ. 1945లో పాల శీతలీకరణ కేంద్రంగా ప్రారంభమైంది. ఈ డెయిరీ 1969-70లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఏపీతోపాటు తమిళనాడు సరిహద్దు పాడి రైతులకు బాసటగా నిలిచింది. అయితే, నిర్వహణ భారమై 2002లో మూతపడగా, 2008లో తిరిగి ప్రారంభించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ, అవేవీ ఫలించకపోవడంతో 2015లో మరోసారి మూతబడింది. చిత్తూరు డెయిరీ పరిధిలో దాదాపు రూ.500కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఈ డెయిరీని పునరు ద్ధరిస్తామని జగన్ చిత్తూరు ప్రాంత పాడి రైతులకు హామీ ఇచ్చారు. దీంతో చిత్తూరు డెయిరీకి మంచిరోజులు వచ్చినట్టేనని వారంతా సంతోషించారు. ఈ డెయిరీని ఏపీ డెయిరీ డెవల్‌పమెంట్ ఫెడరేషన్ కిందకు తెస్తారని ఆశపడ్డారు. కానీ, అమూల్‌కు అప్పగించేస్తున్నారు. చిత్తూరు డెయిరీ పరిధిలో చాలా విలువైన ఆస్తులున్నాయి. వాటన్నింటినీ అమూల్‌కు లీజుకు ఇచ్చేస్తున్నారు. వందల కోట్లలో ఆస్తులు కలిగిన డెయిరీని ఏటా కోటి రూపాయలకే లీజుకు ఇవ్వాలని నిర్ణయించడం గమనార్హం. దీనిపై స్థానిక పాడి రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. డెయిరీని తెరిపిస్తామని హామీ ఇచ్చి, రైతుల్ని మోసం చేశారంటూ మండిపడుతున్నారు. డెయిరీని తిరిగి ప్రారంభించి నిర్వహణను టీటీడీకి ఇస్తే, రాయలసీమ, తమిళనాడులోకి సరిహద్దు ప్రాంతాల నుంచీ పాల సేకరణకు అవకాశం ఉండేదని వాదిస్తున్నారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబు కుటుంబసభ్యులకు చెందిన ’హెరిటేజ్ డెయిరీతోపాటు ఇతర ప్రైవేట్ డెయిరీలు నాణ్యమైన పాల ఉత్పత్తులతో వినియోగదారుల ఆదరణ పొందుతున్నాయి. వాటిని దొంగ దెబ్బ తీయడం లక్ష్యంగా అమూల్‌కు రాష్ట్రానికి తెచ్చినట్టు అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇందుకు బలం చేకూరుస్తూ వరుసగా డెయిరీలను వదిలించుకుంటున్నారు. అంతకన్నా ముందుగా, డెయిరీల్లోని ఉద్యోగులకు ప్రభుత్వం ఉద్వాసన పలుకుతోంది. వీఆర్ఎస్ (స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకం) ఇచ్చి ఇంటికి పంపి.. ఆపై డెయిరీలను లీజుకు ఇచ్చే ప్రక్రియను మొదలుపెడుతోంది. ఇలా చిత్తూరు డెయిరీలో 560మంది, ఒంగోలు డెయిరీలో సుమారు 100 మందికి ఇప్పటికే వీఆర్ఎస్ అమలు చేశారు. హోదాని బట్టి ఏక మొత్తంగా డబ్బులిచ్చి, రెగ్యులర్ ఉద్యోగులకు సెటిల్మెంట్ చేయగా, తాత్కాలిక సిబ్బందిని రోడ్డున పడేశారు. కంపెనీస్ యాక్ట్ కింద ఉన్న ఒంగోలు డెయిరీని అమూల్‌కు అప్పగించడానికి చట్టంలో అవకాశం లేకపోవడంతో చివరి నిమిషంలో అప్పగింత ఆగిపోయింది. ఈ క్రమంలోనే చిత్తూరు డెయిరీని కట్టబెట్టేశారు.
ఎంత చేసినా పెరగని పాలు..
రాష్ట్రంలో ఉత్పత్తయ్యే పాలను అమూల్‌కు పోయించడం ద్వారా ప్రైవేట్ రంగంలోని డెయిరీలను నిలువరించాలని ప్రభుత్వ పెద్దలు యోచించారు. అందులో భాగంగా అమూల్ బ్రాండ్ పేరుతో నడిచే గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్తో రాష్ట్ర ప్రభు త్వం 2020జూలై 21న ఒప్పందం చేసుకుంది. అమూల్‌కు ఖర్చు లేకుండా మౌలిక సదుపాయాలన్నీ ప్రభుత్వమే సమకూరుస్తోంది. అలాగే 4.69లక్షలమంది మహిళలకు చేయూత పథకంలో మూడు దశల్లో ఆవులు, గేదెలు పంపిణీ చేసేందుకు రూ.6,551కోట్లు ప్రభుత్వం వెచ్చిస్తోంది.. మహిళా పాడి రైతులనుంచి సేకరించే పాలను అమూల్‌కు పోయించాలని ప్రభుత్వం అనేక శాఖల అధికారులకు బాధ్యతలు అప్పగించింది. పాల డబ్బులు 10రోజుల్లో నేరుగా మహిళల ఖాతాల్లో జమ అవుతాయని, ఇతర డెయిరీల కంటే లీటరుకు రూ.5నుంచి రూ.20వరకు ధర అదనంగా వస్తుందని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. కానీ అనేక చోట్ల పాడి రైతులు అమూల్‌కు పాలు పోసేందుకు అయిష్టత చూపుతున్నారు. దీంతో రాష్ట్రంలో రోజుకు లక్షన్నర లీటర్ల పాలు కూడా అమూల్ సేకరించలేకపోతోంది.
ధర పెరిగితే బోనస్సా..?
పాడి రైతులకు బోనస్ ఇస్తానని పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చారు. లీటర్ మంచినీళ్ల బాటిల్ ధర రూ.21 ఉంటే.. లీటర్ పాల ధర కూడా అంతే ఉందంటూ.. ఆయన మాట్లాడారు. లీటర్‌కు రూ.4బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకొచ్చాక తన మాటలకు వింత భాష్యం పలికారు. అమూల్ ఇచ్చే అదనపు ధరనే బోన్‌సగా భావించాలని సెలవిస్తున్నారు. ‘‘అమూల్ రాకతో లీటర్ పాలకు రూ.5 నుంచి రూ.7 వరకు పెరుగుతుంది. దీనివల్ల ప్రైవేటు డెయిరీలు కూడా రేట్లు పెంచుతాయి. అమూల్ ఎక్కువ రేటుకు కొనడమే కాకుండా ఏపీలో వచ్చే లాభాలన్నింటినీ కూడా ఏడాదికి రెండు విడతల్లో అక్కచెల్లెమ్మలకే చెల్లిస్తుంది. ఇదే బోనస్’’ అని తేల్చేశారు.