జనం గుర్తుకొస్తున్నారు!

ABN , First Publish Date - 2022-07-24T08:46:25+05:30 IST

ఒకవైపు ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత! మరోవైపు... సమీపిస్తున్న ఎన్నికలు! ఈ క్రమంలోనే... ప్రజల్లో ఉండి, ప్రజల్లో తిరిగి, ప్రజల సమస్యలు తెలుసుకుని, వారి మనసు

జనం గుర్తుకొస్తున్నారు!

ప్రజల్లో ఉండాల్సిన అవసరాన్ని గుర్తించిన జగన్‌ 

మూడేళ్ల తర్వాత ‘తాడేపల్లి’ దాటి కార్యక్రమాలు

బటన్‌ నొక్కుడుకు జిల్లాల పర్యటనలు

ప్రజల్లోకి వెళ్లాలని నేతలకు పదేపదే సూచనలు

అయినా... ఎమ్మెల్యేలు, నాయకుల్లో నీరసం

నిలదీతలు, నిరసనలతో ‘గడప’దాటని వైనం


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఒకవైపు ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత! మరోవైపు... సమీపిస్తున్న ఎన్నికలు! ఈ క్రమంలోనే... ప్రజల్లో ఉండి, ప్రజల్లో తిరిగి, ప్రజల సమస్యలు తెలుసుకుని, వారి మనసు గెలుచుకోవాల్సిన ‘అవసరం’ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి తెలిసొచ్చింది. అధికారంలోకి వచ్చిన తొలి రెండున్నరేళ్లు తాడేపల్లి భవనానికే పరిమితమై, అక్కడి నుంచి ‘బటన్‌’లు నొక్కిన ఆయన... ఆ తర్వాత బటన్‌ నొక్కుడు కోసం జిల్లాల పర్యటనలు పెట్టుకుంటున్నారు. ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ పేరుతో ఎమ్మెల్యేలను జనంలోకి బలవంతంగా పంపిస్తున్నారు. దీనిపై వర్క్‌షాపులు కూడా ఏర్పాటు చేసి... ‘జనంలోకి వెళ్లాల్సిందే. గ్రాఫ్‌ పెంచుకోవాల్సిందే’ అని హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ... పార్టీ నేతల్లో ఉత్సాహం కొరవడింది. నీరసమే కనిపిస్తోంది. అధినేత ఎన్నిసార్లు చెబుతున్నా, హూంకరిస్తున్నా మెజారిటీ ఎమ్మెల్యేలు ‘గడప’ దాటడంలేదు. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి లేమిపై ప్రజలు సూటిగా, ఘాటుగా నిలదీస్తుండటమే దీనికి కారణం. దీంతో.. ప్రజా ప్రతినిధులకంటే ‘సోషల్‌ మీడియా’ను నమ్ముకోవడమే మేలనే అభిప్రాయానికి జగన్‌ వచ్చినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

తేడా తెలిసొచ్చిందా...

ప్రతిపక్షనేత చంద్రబాబు జిల్లాల పర్యటనలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. టీడీపీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. దీంతో ముఖ్యమంత్రిలో కలవరం మొదలైందని వైసీపీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. పాలనాపగ్గాలు చేపట్టిన మూడేళ్లదాకా ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేలు కూడా గుర్తుకు రాలేదు. మూడేళ్ల తర్వాత మార్చిలో మొదటిసారిగా శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. గతనెలలో పార్టీ ప్లీనరీ నిర్వహించారు. విశేషమేమిటంటే... ఇప్పుడు ఆయనకు కార్యకర్తలు కూడా గుర్తుకొస్తున్నారు. వచ్చేనెల 4వ తేదీ నుంచి కార్యకర్తలతో సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి ఎంపిక చేసిన  50 మంది కార్యకర్తలతో జగన్‌ సమవేశమవుతారు. ఇక... పార్టీ జిల్లా అధ్యక్షులు, సమన్వయకర్తలు పార్టీ అప్పగించిన పదవులనూ సక్రమంగా నిర్వర్తించాలని జగన్‌ ఆదేశిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో నెలలో పది రోజుల పాటు పర్యటించాలని జిల్లా అధ్యక్షులు, పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలను ఆదేశించారు. నెలలో 20 రోజులపాటు ‘గడప గడపకూ’ నిర్వహించాలని ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. వెరసి... ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ ప్రజల్లో ఉండాల్సిన ‘అవసరాన్ని’ జగన్‌ గుర్తించారు.

సుతిమెత్తగా... 

‘నా మాటే శాసనం’ అంటూ పార్టీ నేతలపై హూంకరించే జగన్‌ వైఖరిలో ఇప్పుడు చాలా మార్పు కనిపిస్తోంది. సుతిమెత్తగా మాట్లాడి చేయించుకోవాలనే ధోరణి  ప్రదర్శిస్తున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. పార్టీ జిల్లా అధ్యక్ష, ప్రాంతీయ  సమన్వయకర్తల బాధ్యతలను అప్పగించేముందు మాజీ మంత్రులను,  నేతలను జగన్‌ అడగలేదు. ఈ బాధ్యతలు సక్రమంగా నిర్వహించడంలేదని భావిస్తే... వారిని పక్కకు తప్పించవచ్చు. తనకు నచ్చిన వారికి పదవులు అప్పగించవచ్చు. కానీ... శుక్రవారం నిర్వహించిన పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో వారితో జగన్‌ అనునయంగా మాట్లాడారు. ‘అప్పగించిన బాధ్యతలు చేసేందుకు ఇష్టం లేనివారు చేతులెత్తండి’ అని కోరారు. ఎవరూ స్పందించకపోవడంతో... ‘ఎవరూ చేతులెత్తలేదంటే అందరికీ ఇష్టమేనన్నమాట’ అని నవ్వుతూ అన్నారు. బూత్‌ కమిటీ నుంచి జిల్లా కమిటీల వరకు నియామకాలను సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు తలనొప్పిగా భావిస్తున్నారు. ఈ పదవులు వేస్తే .. జిల్లాలవారీగా పార్టీలో అంతర్గత యుద్ధం వస్తుందేమోనన్న భయం ముఖ్యనేతల్లో ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.


ఆ కోరికా తీరేనా...

గతంలో వైఎస్‌ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో ప్రజలను, పార్టీ నేతలను కలిసేవారు. వెళ్లేటప్పుడో, వచ్చేటప్పుడో... తన కార్యాలయం ముందు నిలుచున్న ఎమ్మెల్యేలను పలకరించి వారి చేతిలోని కాగితాలు తీసుకునేవారు. దీనిని ‘ద్వారదర్శనం’ అని సరదాగా పిలుచుకునే వారు. జగన్‌ కనీసం ఇలా ద్వార దర్శనమైనా ఇప్పించాలని, ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండాలని మాజీ మంత్రి పేర్ని నాని ఇటీవల కోరుకున్నారు. ‘‘అధినేత మాకు గౌరవమిస్తే... జిల్లాలో నాయకులు, అధికారులు మమ్మల్ని గౌరవిస్తారు. సీఎం వద్ద మాకు విలువలేనప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు?’’ అని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే... త్వరలోనే ఎమ్మెల్యేలకు జగన్‌ ‘ద్వార దర్శనం’తో కనికరించే అవకాశం కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. 

Read more