అప్పులపై.. అవే అబద్ధాలు!

ABN , First Publish Date - 2022-07-22T07:45:30+05:30 IST

సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌ అప్పుల ఊబిలోకి దిగజారిన వైనంపై మీడియాలో వస్తున్న కథనాలపై వివరణ ఇచ్చేందుకు గురువారం ప్రభుత్వం పెట్టిన ప్రెస్‌మీట్‌లో సీఎం సెక్రటరీ దువ్వూరి కృష్ణ మళ్లీ అవే అబద్ధాలు చెప్పారు.

అప్పులపై.. అవే అబద్ధాలు!

కార్పొరేషన్ల అప్పులపై జగన్‌ సర్కారు బుకాయింపులు

ఫిబ్రవరి-మార్చిలోని వేల కోట్ల గోల్‌మాల్‌పై మాట్లాడరేం?

మార్చిలో మాయమైన 21 వేల కోట్లు ఏమయ్యాయ్‌?

39 వేల కోట్ల ఖర్చు దాచేసి.. ద్రవ్యలోటుపై కథలు

అప్పులపైనా అసత్యాలు.. తెచ్చింది 1,20,000 కోట్లేనట!

కార్పొరేషన్లు 58 వేల కోట్లే తీసుకున్నాయన్న సజ్జల

ఎక్కడెక్కడ ఎంతెంత అప్పులు తెచ్చారో చెబుతారా?

కార్పొరేషన్ల రుణాలపై థర్డ్‌ పార్టీ ఆడిట్‌కు సిద్ధమేనా?


నోరు తెరిస్తే అబద్ధాలు.. 

ఏజీ కార్యాలయానికీ తప్పుడు లెక్కలు.. రాష్ట్ర రాబడి, ఖర్చులపై ఒక్క రోజైనా నిజం చెప్పరు. అప్పులపై అన్నీ అసత్యాలే. ఆదాయ వ్యయాలను దాచేసి ద్రవ్యలోటు తగ్గిపోయిందని చంకలు కొట్టుకునే జగన్‌ సర్కారు.. దీనిపై థర్డ్‌ పార్టీతో ఆడిట్‌ చేయించడానికి సిద్ధమేనా?


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌ అప్పుల ఊబిలోకి దిగజారిన వైనంపై మీడియాలో వస్తున్న కథనాలపై వివరణ ఇచ్చేందుకు గురువారం ప్రభుత్వం పెట్టిన ప్రెస్‌మీట్‌లో సీఎం సెక్రటరీ దువ్వూరి కృష్ణ మళ్లీ అవే అబద్ధాలు చెప్పారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి గతంలో చెప్పిన అసత్యాలను, స్ర్కిప్టునే ఈయనా వల్లె వేశారు. గతంలో ఆర్థిక పరిస్థితిపై పెట్టిన ప్రెస్‌మీట్లలో కార్పొరేషన్ల అప్పులపై మౌనం వహించిన ప్రభుత్వం.. ఈసారి బుకాయింపులు మొదలుపెట్టడం గమనార్హం. బడ్జెట్‌ పుస్తకాల్లోని వాల్యూమ్‌ 5లో ముద్రించామని.. అవి మాత్రమే కార్పొరేషన్ల అప్పులంటూ కృష్ణ చెప్పుకొచ్చారు. అయితే, అవన్నీ తప్పుల తడకలని ‘ఆంధ్రజ్యోతి’ గతంలోనే వరుస కథనాలు ప్రచురించింది.


పరిమితికి మించి అప్పులు పుట్టించుకోవడం కోసం జగన్‌ సర్కారు తనకు నచ్చినట్లుగా బడ్జెట్‌ పుస్తకాలు ముద్రిస్తోందని విమర్శలు చెలరేగాయి.  ఇప్పుడు అవే తప్పుడు లెక్కలను అకౌంటెంట్‌ జనరల్‌ (ఏజీ) కార్యాలయానికి కూడా ప్రభుత్వం పంపిస్తోంది. వీటిపై ఏజీ వివరణ అడుగుతూ లేఖల మీద లేఖ రాస్తూ ఉన్నప్పటికీ కూడా బుకాయిస్తూనే ఉంది. పెండింగ్‌ బిల్లులు ప్రభుత్వానికున్న అప్పులు కావని.. వాటిని అప్పుల్లో కలపకూడదని దువ్వూరి కృష్ణ సెలవివ్వడం విస్తుగొల్పుతోంది. ఇలాగైతే అవి చెల్లించాల్సినవి కావా.. ఎగనామం పెట్టేస్తారా? పెండింగ్‌ బిల్లులు చెల్లించాలంటూ హైకోర్టు నిత్యం మొట్టికాయలు వేయడం లేదా? ఇది జనానికి తెలియదనుకుని అడ్డగోలుగా బుకాయిస్తున్నారు.


ఎలా నమ్మడం..?

గత ఆర్థిక సంవత్సరం చివరిలో ఫిబ్రవరి, మార్చి నెలల్లో వచ్చిన ఆదాయం, చేసిన ఖర్చులకు సంబంధించి ఏజీ కార్యాలయానికి ఇచ్చిన సమాచారంలో జగన్‌ సర్కారు భారీ గోల్‌మాల్‌ చేసింది. దీనిపై అటు ప్రభుత్వాన్ని, ఇటు ఏజీ కార్యాలయాన్ని విమర్శిస్తూ ‘ఆంధ్రజ్యోతి’ పలు కథనాలు ప్రచురించింది. దీంతో ఈ గోల్‌మాల్‌ గుట్టు విప్పాలని ఏజీ కార్యాలయం నుంచి రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌కు లేఖలు కూడా అందాయి. ఫిబ్రవరిలో ఖర్చుచేశామని పంపిన రూ.18,000 కోట్ల వ్యయాన్ని.. జరగలేదంటూ అన్నింటికీ మైనస్‌ ఎంట్రీలు వేసి మార్చిలో పంపడాన్ని ఏజీ కార్యాలయం తప్పుపట్టింది. ఈ రూ.18,000 కోట్ల మొత్తాన్ని సస్పెన్స్‌ ఖాతాకు జమ చేయాలని, ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖర్చుగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. అలాగే మార్చి నెలలో ప్రభుత్వానికి రూ.21 వేల కోట్ల ఆదాయం వచ్చింది. ఈ మొత్తానికి సంబంధించిన ఖర్చులను ప్రభుత్వం ఏజీ కార్యాలయానికి పంపలేదు. అంటే మార్చిలో ఖర్చులేమీ పెట్టలేదా? ఖర్చుచేయకుంటే ఆ మొత్తాన్ని మిగులులో చూపించాలి కదా! అటు ఖర్చులోనూ చూపక, ఇటు మిగుల్లోనూ చూపక ఏమైపోయినట్లు? ఆ రూ.21,000 కోట్లు.. అప్పటికే ఖర్చు చేసిన ఆ రూ.18,000 కోట్లు.. మొత్తం కలిపి రూ.39,000 కోట్లకు తాజా ప్రెస్‌ మీట్లో ఎందుకు లెక్కలు చెప్పలేదు? కేవలం 2 నెలల్లోనే రూ.39,000 కోట్ల గోల్‌మాల్‌ చేసి.. ఇప్పుడు చెబుతున్న లెక్కలు కరెక్టేనని ఎలా నమ్మాలి?


ఖర్చులు దాచి లోటు తగ్గిందంటారా?

తమ హయాంలో ద్రవ్యలోటు 2.1 శాతానికి తగ్గిందని గతంలో ఆర్థిక మంత్రి బుగ్గన చెప్పిన కథనే గురువారం ప్రెస్‌మీట్లో కృష్ణ కూడా చెప్పారు. రెండు నెలల్లో రూ.39,000 కోట్ల ఖర్చు దాచేస్తే  ఏడాదంతా ఎంత ఖర్చు దాచి ఉంటారు..? ఖర్చులు దాచిపెడితే లోటు తగ్గినట్లే కనిపిస్తుంది.  ప్రభుత్వం చెప్పిన ప్రకారం 2021-22లో రెవెన్యూ లోటు రూ.8,370 కోట్లు. దీనికి ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగిన గోల్‌మాల్‌ రూ.39,000 కోట్లు కలిపితే లోటు రూ.47,370 కోట్లకు చేరుతుంది. కార్పొరేషన్ల మాటున దాచిన ఖర్చులు కూడా కలిపితే ఈ లోటు ఇంకా పెరుగుతుంది. రెవెన్యూ లోటు పెరిగితే ఆటోమేటిగ్గా ద్రవ్య లోటు కూడా పెరుగుతుంది. అప్పుడు కచ్చితంగా కాగ్‌ చెప్పిందంటున్న 2.1 శాతానికి అనేక రెట్లు అధికంగా ఉంటుంది. కార్పొరేషన్లకు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ పేరుతో ఇస్తున్న నిధులపై థర్డ్‌ పార్టీ ఆడిట్‌కు జగన్‌ సర్కారు సిద్ధపడుతుందా? ఈ మూడేళ్లలో తాము చేసింది రూ.1,20,000 కోట్ల అప్పే.. కార్పొరేషన్లు చేసిన అప్పు రూ.58,000 కోట్లేనంటూ ప్రభుత్వం చెబుతున్న లెక్కలు కరెక్టే అయితే కార్పొరేషన్ల అకౌంట్‌ పుస్తకాలను ఆడిట్‌ కోసం థర్డ్‌ పార్టీకి ఇస్తారా ? ప్రభుత్వ ఖర్చులన్నీ కార్పొరేషన్ల ఖాతాలకు మళ్లిస్తూ వాటిని లెక్కల్లోకి రాకుండా చూస్తున్నారు. కార్పొరేషన్లు తెస్తున్న అప్పుల వివరాలు ఇవ్వాలంటూ ఏజీ కార్యాలయం అనేక సార్లు ప్రభుత్వాన్ని అడిగింది. కార్పొరేషన్‌ అప్పులను కూడా రాష్ట్ర ప్రభుత్వ అప్పుల కిందే చూపించాలని కేంద్రం కూడా మార్చి 31వ తేదీన అన్ని రాష్ర్టాలకు లేఖ రాసింది. కానీ వీటన్నిటినీ పట్టించుకోకుండా వేలకోట్ల నిధులకు లెక్కలే చెప్పకుండా అటు కేంద్రం, ఇటు కాగ్‌ కళ్లకు జగన్‌ సర్కారు గంతలు కడుతోంది. 


అప్పులు బహిర్గతం చేస్తారా?

తాము ఈ మూడేళ్లలో చేసిన అప్పులు రూ.1,20,000 కోట్లు మాత్రమేనని.. కార్పొరేషన్లు చేసింది రూ.58,000 కోట్లేనని ప్రభుత్వం చెబుతోంది. ఈ అప్పులను ఏయే సంస్థలు, బ్యాంకు ల నుంచి ఎంతెంత తీసుకున్నారో జాబితా ప్రకటించి.. దానికి ఆయా బ్యాంకులు, ఆర్థిక సంస్థల, ఇతర వర్గాల నుంచి ఆమోదం పొందగలరా? ఈ వివరాలతో శ్వేతపత్రం విడుదల చేసి తమ లెక్కలు కరెక్టేనని జగన్‌ సర్కారు నిరూపించుకోగలదా? ఈ మూడేళ్లలో రూ.1,65,000 కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా జనాలకు పంచామంటూ వైసీపీ నేతలు ఆర్భాటంగా చెప్పుకొంటున్నారు. గురువారం నాటి ప్రెస్‌మీట్లో కూడా సజ్జల అదే విషయం పదేపదే చెప్పారు. ఈ డీబీటీలో దాదాపుగా సగం సామాజిక పెన్షన్లే ఉంటాయి. రూ.200గా ఉండే ఈ పింఛనును రూ.2,000 చేసిన ఘనత చంద్రబాబుదే. జగన్‌ వచ్చాక మరో రూ.250 పెంచారు. రెండేళ్ల తర్వాత ఇంకో రూ.250 పెంచారు. వేరే ప్రభుత్వం వస్తే వీటిని తీసేస్తుందని వైసీపీ ప్రచారం చేస్తోంది. ఏ ప్రభుత్వమైనా సామాజిక పెన్షన్లను కొనసాగిస్తూనే ఉంటుంది. చంద్రబాబు కంటే ముందున్న ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో రూ.200 పెన్షన్‌ ఇచ్చేది. చంద్రబాబు వచ్చాక దానిని కొనసాగిస్తూ రూ.2,000 చేశారు. అదే విధంగా జగన్‌ ప్రభుత్వమూ సామాజిక పెన్షన్లు ఇస్తోంది. అధికారంలోకి వచ్చాక ఎన్నో పథకాలు.. ముఖ్యంగా బడుగు, బలహీనవర్గాలకు చేయూతనిచ్చే అనేక స్కీములను రద్దు చేసింది. వాటి ఊసెత్తకుండా డీబీటీ కింద రూ.1,65,000 కోట్లు ఖర్చు చేశామని ఆర్భాటం చేయడం హాస్యాస్పదమని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

Read more