‘ఎగ’సాయం

ABN , First Publish Date - 2022-10-04T06:54:52+05:30 IST

‘‘రైతును చేయి పట్టుకుని నడిపిస్తాం. విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకు అన్ని దశల్లో అండగా ఉంటాం. వ్యవసాయ రంగానికి రూ.కోట్లు ఖర్చు చేస్తున్నాం’’ జగన్‌ సర్కార్‌ చెబుతున్న గొప్పలు ఇవి. ఆచరణలో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది.

‘ఎగ’సాయం

రైతు సంక్షేమంపై జగన్‌ సర్కారుది ఆర్భాటమే 

టీడీపీ హయాంలోనే పెట్టుబడికి ఊతం 

రూ.లక్ష లోపు రుణాలకు వడ్డీ రాయితీ

లక్ష నుంచి 3 లక్షల వరకూ పావలా వడ్డీ

కౌలురైతులకు విరివిగా బ్యాంకు రుణాలు 

వైసీపీ పాలనలో పావలా వడ్డీకి మంగళం

వడ్డీ సహా రుణం చెల్లిస్తేనే రాయితీ

90ు కౌలు రైతులకు అందని రుణాలు

రైతు భరోసా కూడా అరకొరగానే..


రాష్ట్రంలో అత్యధిక మంది ఆధారపడేది వ్యవసాయంపైనే. సాగు చేయాలంటే పెట్టుబడి కావాలి. గతంలో సున్నా వడ్డీ, పావలా వడ్డీ పంట రుణాలు అందించేవారు. దీనివల్ల రైతన్నలకు వడ్డీల భారం తగ్గేది. జగన్‌ సర్కారు పావలా వడ్డీ రుణాలకు మంగళం పాడేసింది. వడ్డీతో సహా రుణం చెల్లిస్తేనే సున్నా వడ్డీ రాయితీ అని మెలిక పెట్టింది. దీంతో రైతులపై వడ్డీల భారం పడుతోంది. ఇక 90 శాతం మంది కౌలురైతులకు రుణాలు అందించడం లేదు. ఈ లెక్కన వైసీపీ ప్రభుత్వం వల్ల అన్నదాతలకు కొత్తగా ఒనగూరుతున్నదేమిటి?

సగటున సన్నకారు, మధ్యతరగతి రైతు కుటుంబాలకు ఎవరి హయాంలో ప్రయోజనం కలిగినట్టు..? 


గత ప్రభుత్వం రూ.లక్ష లోపు రుణాలకు వడ్డీ వసూలు చేయకుండా, వడ్డీని రాయితీ రూపంలో రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసేది. ఇప్పుడు  వడ్డీతో సహా రుణాన్ని కడితేనే వడ్డీ రాయితీ ఇస్తున్నారు. 

గతంలో రూ.3 లక్షల రుణం వరకూ పావలా వడ్డీ అమలు చేశారు. 3 లక్షలు రుణం తీసుకుంటే.. అందులో రూ.లక్షకు వడ్డీ రాయితీ, మిగిలిన రూ.2 లక్షలకు పావలా వడ్డీ వర్తించేది. జగన్‌ సర్కారు వచ్చాక పావలా వడ్డీకి స్వస్తి చెప్పింది. అలాగే రూ.లక్షపైన రుణాలకు వడ్డీ రాయితీని ఎత్తేసింది. 

గత ప్రభుత్వం హయాంలో 2018-19లో 10.69 లక్షలమంది కౌలురైతులకు రుణాలు ఇచ్చారు. వైసీపీ సర్కారు వచ్చాక గతేడాది 1.80 లక్షల మందికి, ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో కేవలం లక్ష మందికే రుణాలు ఇచ్చారు.


(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

‘‘రైతును చేయి పట్టుకుని నడిపిస్తాం. విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకు అన్ని దశల్లో అండగా ఉంటాం. వ్యవసాయ రంగానికి రూ.కోట్లు ఖర్చు చేస్తున్నాం’’ జగన్‌ సర్కార్‌ చెబుతున్న గొప్పలు ఇవి. ఆచరణలో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. రైతులు పెట్టుబడి భారం మోయలేక సతమతమవుతున్నారు. జగన్‌ సర్కారు పంట రుణాలకు పావలా వడ్డీ ఎత్తేసింది. రైతులు వడ్డీతో సహా రుణాన్ని చెల్లించాకే సున్నా వడ్డీ రాయితీ జమ చేస్తుండడంతో అవసరానికి సాయం అందడం లేదు. ఇక కౌలురైతులను ప్రభుత్వం గాలికొదిలేసింది. బ్యాంకు రుణాలు అందకపోవడంతో పెట్టుబడి కోసం ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించాల్సి వస్తోంది.


అలాగే ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా కూడా చాలా తక్కువ మందికి అందుతోంది. గత ప్రభుత్వంలో రాయితీపై సూక్ష్మపోషకాలు, విత్తనాలు, ఎరువులు, యంత్రాలు, ఇలా అనేక రకాలుగా రైతాంగానికి లబ్ధి ఉండేది. ఇప్పుడు రాయితీ పథకాలను అరకొరగా అమలు చేస్తున్నారు. కొన్ని పథకాలు ఉన్నాయో లేవో రైతులకే తెలియని పరిస్థితి. ప్రభుత్వం నిర్లక్ష్యం, వైఫల్యం వల్ల రైతులకు మేలు జరగడం లేదు. వ్యవసాయానికి తగినంత ఊతం అందడం లేదు. ప్రభుత్వం పెట్టుబడి సాయం, పరిహారం అరకొరగా ఇస్తూ చేతులు దులుపుకొంటోంది.  పెట్టుబడులు పెరగడం, అధిక వడ్డీలకు అప్పులు చేయడం, ప్రకృతి విపత్తులు, గిట్టుబాటు ధర లేకపోవడం వంటి కారణాలతో రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు. బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. 


రైతులపై వడ్డీ భారం

గత ప్రభుత్వం రైతులకు సున్నా వడ్డీ, పావలా వడ్డీ పంట రుణాలను అమలు చేసింది. వడ్డీ భారం తగ్గడంతో రైతులకు ఎంతో ప్రయోజనం కలిగేది. జగన్‌ సర్కార్‌ వచ్చాక పావలా వడ్డీకి రుణాలు ఇవ్వడం లేదు.


లక్షలోపు తీసుకున్న రుణాన్ని వడ్డీతో సహా ఏడాదిలోగా తిరిగి చెల్లిస్తేనే.. వైఎస్సార్‌ సున్నా వడ్డీ రాయి తీ అమలు చేస్తోంది. రూ.లక్షపైన తీసుకునే రుణాలకు 7ు వడ్డీ వసూలు చేస్తున్నారు. మూడున్నరేళ్లలో జగన్‌ సర్కార్‌ సున్నా వడ్డీ కింద ఇచ్చిన వడ్డీ రాయితీ రూ.487.4 కోట్లు మాత్రమే. ఈ ఏడాది ఖరీఫ్‌ ముగుస్తున్నా.. నిరుటి వడ్డీ రాయితీ ఇంకా ఇవ్వలేదు. వచ్చే నెలలో చెల్లిస్తామని చెబుతున్నారు. 2020-21 రబీలో తీసుకున్న రుణాలను రైతులు తిరిగి చెల్లించి ఆరు నెలలవుతోంది.  రైతులు చెల్లించిన వడ్డీపై ప్రభుత్వానికి వడ్డీ వస్తోంది. 2014-15 నుంచి 2018-19 వరకు పెండింగ్‌లో ఉన్న రూ.784.71 కోట్లు విడుదల చేశామని చెబుతున్న ప్రభుత్వం తమ హయాంలో చెల్లింపులపై తాత్సారం చేస్తోందని రైతులు అంటున్నారు. 


కౌలురైతులకు ఏవీ రుణాలు..?

గత ప్రభుత్వం 2018-19లో 10.69 లక్షలమంది కౌలురైతులకు రూ.4,757 కోట్లు రుణాలు ఇచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం కొత్త కౌలుదారు చట్టం తెచ్చే క్రమంలో 2019-20లో కౌలురైతులకు రుణాలివ్వాలని బ్యాంకర్లకు సిఫార్సు చేయలేదు. స్థానికంగా కౌలురైతుల ఆర్థిక స్థితిగతులను బట్టి అతి కొద్దిమందికి మాత్రమే బ్యాంకులు రుణాలిచ్చాయి. 2020-21లో కోటిమంది రైతులకు పైగా పంట రుణాలు ఇవ్వగా... కేవలం 2 లక్షల మంది  కౌలు రైతులకే రుణాలు ఇచ్చారు. అలాగే 2021-22లో తక్కువ మంది కౌలురైతులకు రుణాలు ఇచ్చారు. ప్రస్తుత ఖరీ్‌ఫలో రూ.86 వేల కోట్లు దాకా పంట రుణాలు పంపిణీ చేయగా.. కేవలం లక్ష మంది కౌలురైతులకు రూ.786 కోట్లే ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం ఒక ఏడాదిలోనే 4757 కోట్లు రుణాలు ఇస్తే.. జగన్‌ సర్కారు ఇప్పటి వరకూ ఇచ్చింది 3595 కోట్లు మాత్రమే. 


భరోసాపై మడత పేచీ

రైతు భరోసా అందించడంలోనూ జగన్‌ సర్కారు మడత పేచీ పెట్టింది. అధికారంలోకి వస్తే రైతులకు రూ.12,500 పెట్టుబడి సాయం అందజేస్తామని వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక మరో రూ.1000 పెంచి 13,500 రైతు భరోసా ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తోంది 7,500 మాత్రమే. కేంద్రం పీఎం కిసాన్‌ కింద మూడు విడతలుగా 2000 చొప్పున ఏడాదికి రూ.6000 రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. కేంద్రం ఇస్తున్న ఈ 6 వేలు సాయాన్ని కూడా జగన్‌ సర్కారు  తన ఖాతాలో వేసుకుని రైతులకు 13,500 ఇస్తున్నట్టు కలరింగ్‌ ఇస్తోంది. అంతేగాక కౌలురైతులకు రైతు భరోసా అందించడంలో వివక్ష చూపుతోంది. రాష్ట్రంలో 47 లక్షల మంది రైతులకు సాయం అందుతుండగా.. కౌలు రైతుల్లో 10 శాతం మందికి కూడా దక్కడం లేదు. 


పెరిగిన సాగు ఖర్చు

పంటల సాగుకు ఏటా ఖర్చులు పెరిగిపోతున్నాయి. గత మూడేళ్లలో ఎరువులు, పురుగు మందుల ధరలు, కూలి రేట్లు, పంట ఉత్పత్తుల రవాణా చార్జీలు సగటున 30ు పెరిగాయి. 2018లో ఎకరా వరి సాగుకు రూ.35 వేలు ఖర్చు కాగా.. ఈ ఏడాది రూ.60వేలయ్యే పరిస్థితి వచ్చింది. మిర్చికి రూ.30 వేలు, పత్తికి రూ.20వేలు, వేరుశనగకు రూ.15 వేలు, అపరాల పంటలకు రూ.10 వేలు చొప్పున అదనపు వ్యయం అవుతోందని రైతులు చెబుతున్నారు. పెరిగిన ఖర్చుకు అనుగుణంగా  ఉత్పత్తులకు 30% మద్దతు ధర పెరగలేదు. పంట రుణాలకు ప్రామాణికంగా తీసుకునే స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ 10% మాత్రమే పెరిగింది. దీంతో సాగు వ్యయం భారమై, అప్పులపాలవుతున్నారు.

Read more