వినేవాళ్లు విదేశీయులని..

ABN , First Publish Date - 2022-05-24T08:14:38+05:30 IST

అది దావోస్‌ వేదిక! ప్రశ్నలు అడిగేది విదేశీ ప్రతినిధులు! సమాధానాలు చెప్పింది... ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి

వినేవాళ్లు విదేశీయులని..

ఆరోగ్య రంగంపై ‘అద్భుతమైన’ ప్రసంగం

16 కొత్త మెడికల్‌ కాలేజీలపై ‘పాత కథే’

నిధుల్లేక, బిల్లులు ఇవ్వక కదలని పనులు

అగమ్య గోచరంగా మారిన కాలేజీల పరిస్థితి

‘ఆరోగ్యశ్రీ’లో 2446 చికిత్సలంటూ గొప్పలు

600 కోట్ల పెండింగ్‌తో ఆస్పత్రులు గగ్గోలు

ఉత్తుత్తి ఫీవర్‌ సర్వేపైనా గొప్పగా ప్రకటన

మందులు, సర్జికల్స్‌ కూడా కొనలేని దుస్థితి


రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో వైద్యం ఒక మిథ్యగా మారుతోంది. పేరుకు మాత్రమే బడ్జెట్‌లో కేటాయింపులు చేస్తున్నారు. కానీ... క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరు. మందులు, సర్జికల్స్‌ కూడా సమకూర్చుకోలేని పరిస్థితి. కొవిడ్‌ తర్వాత  చాలావరకు ఆస్పత్రుల్లో సర్జరీలు చేయడంలేదు. భారీగా బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో... జాతీయస్థాయి సరఫరాదారులు ఆంధ్రప్రదేశ్‌ను ‘రెడ్‌ లిస్ట్‌’లో పెడుతూ ప్రకటనలు ఇచ్చారు. ‘‘వైద్యం కోసం ఆస్తులు అమ్ముకున్నారు... అనే మాటలు పదీ పదిహేనేళ్ల కిందట వినిపించేవి. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి దాపురించింది’’... అని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.


(అమరావతి - ఆంధ్రజ్యోతి): అది దావోస్‌ వేదిక! ప్రశ్నలు అడిగేది విదేశీ ప్రతినిధులు! సమాధానాలు చెప్పింది... ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి! వినేవారు ఉన్నారు కదా... రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితిపై చాలా గొప్పగా చెప్పారు.  అసత్యాలు, అర్ధసత్యాలు, అతిశయోక్తులతో రాష్ట్ర ఆరోగ్యరంగాన్ని ‘అద్భుతం’గా ఆవిష్కరించారు. కరోనాను ఎదుర్కొనడం నుంచి ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు దాకా... ఎన్నెన్నో గొప్పలు చెప్పుకొచ్చారు. ‘పొట్ట విప్పి చూస్తే’ దావోస్‌ వేదికపై సీఎం జగన్‌ చెప్పిన మాటల్లోని అసలు వాస్తవాలు బయటపడతాయి. ‘ఫ్యూచర్‌ ప్రూఫింగ్‌ హెల్త్‌ సిస్టమ్స్‌’ అనే సెమినార్‌లో జగన్‌ సోమవారం మాట్లాడారు. అక్కడి ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. 


ఇంట్లోనే ఇంటింటి సర్వే...

‘‘కొవిడ్‌ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 44 సార్లు ఫీవర్‌ సర్వే నిర్వహించాం’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఇదో పెద్ద అబద్ధం. కొవిడ్‌ సమయంలో ఆరోగ్య సిబ్బంది కూడా కరోనా దెబ్బకు గజగజలాడారు. 90 శాతం మంది సిబ్బంది ఇంట్లోనే కూర్చుని ‘ఇంటింటి సర్వే’ చేశారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ అనేక ప్రత్యేక కథనాలు ప్రచురించింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులకు, ఫీవర్‌ సర్వే రిపోర్టులకు అసలు పొంతన ఉండేది కాదు. 


మరణాలను ‘తగ్గించి’...

‘‘కొవిడ్‌ సమయంలో మరణాల రేటును తగ్గించగలిగాం. జాతీయ సగటు మరణాల శాతం 1.21 శాతం కాగా... ఏపీలో 0.63 శాతం మాత్రమే’ అని జగన్‌ పేర్కొన్నారు. అసలు విషయేమిటంటే... కరోనా మరణాల రేటును ఏపీ  ప్రభుత్వం తక్కువ చేసి చూపించింది. కొవిడ్‌ విజృంభించిన ప్రతిసారీ దేశంలోనే ఏపీ మొదటి లేదా రెండు, మూడు స్థానాల్లో ఉండేది. కరోనా మరణాలు కూడా ఇలాగే నమోదయ్యాయి. అసలు లెక్కలను దాచేస్తూ వచ్చారు. హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతూ చనిపోయిన వారిని ‘సహజ మరణాల’ ఖాతాలో కలిపేశారు. 2020 ఏప్రిల్‌ నుంచి 2021 చివర వరకూ రాష్ట్రంలో 80 వేల మందికి పైగా మరణ ఽద్రువీకరణ పత్రాలు అందించామని ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. ఇది... కరోనా మరణాల తీవ్రతకు నిదర్శనం.


కొత్త కాలేజీలు ఎక్కడ?

‘‘వైద్య విద్యను, వైద్యాన్ని అందరికీ దగ్గరకి చేసేందుకు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం. మేం అధికారంలోకి వచ్చినప్పుడు 11 బోధనాస్పత్రులు ఉండగా... మరో 16 కొత్తగా స్థాపిస్తున్నాం’’ అని జగన్‌ దావోస్‌ వేదికపై గొప్పగా ప్రకటించారు. మాటలు గొప్పగానే ఉన్నాయి కానీ... చేతల్లోకి వచ్చేసరికి అంతా తుస్సే! 16  కొత్త కాలేజీలకు అట్టహాసంగా శంకుస్థాపనలు చేశారు. కానీ...  కాలేజీల నిర్మాణానికి నిధుల్లేవ్‌. ఏడాదిన్నరగా రుణం కోసం అధికారులు ప్రయత్నిస్తున్నా... ఫలితం దక్కడంలేదు. అధికారులు ఎక్కని బ్యాంక్‌ల మెట్లు... తొక్కని కార్యాలయాలు లేవు. కానీ... ఒక్క బ్యాంక్‌ కూడా లోన్‌ ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. 16 కాలేజీల్లో మూడు కాలేజీలకు కేంద్రం నిధులు ఇస్తోంది.  మరికొన్ని కాలేజీల నిర్మాణం నాబార్డు నిధులతో చేపడుతున్నారు. మిగిలిన వాటికి కూడా కేంద్రం నుంచి నిధులు తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడా కాలేజీల నిర్మాణ పనులు జరగడంలేదు. టెండర్‌ ప్రక్రియ మొత్తం గందరగోళం చేసేశారు. బిల్లులు రాకపోవడంతో... అస్మదీయ కంపెనీలు కూడా పనులు నిలిపివేశాయి. మూడేళ్లకు పూర్తవుతాయన్న కాలేజీల నిర్మాణం... ఎప్పుడు పూర్తవుతుందో తెలియడంలేదు.


‘ఆరోగ్యశ్రీ’కి గ్రహణం...

‘‘ఆరోగ్యశ్రీ పథకానికి మా తండ్రి పేరు పెట్టాం. ఏపీలో 2446 రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చాం. 1.44 కోట్ల ఇళ్లకు ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చాం’’ అని దావో్‌సలో జగన్‌ తెలిపారు. ‘ఆరోగ్యశ్రీ’ గొప్ప పథకమనడంలో ఏమాత్రం సందేహం లేదు. వైఎస్‌ ప్రారంభించిన ఈ పథకాన్ని తర్వాత వచ్చిన సీఎంలు మరింత మెరుగ్గా, సమర్థంగా అమలు చేయడానికే ప్రయత్నించారు. ఆరోగ్యశ్రీ పథకానికి తండ్రి పేరు పెట్టిన జగన్‌ మాత్రం ఈ పథకాన్ని నీరుగారుస్తున్నారు. ప్యాకేజీల ధరలు పెంచకపోవడంతో... ఆరోగ్యశ్రీ చికిత్సలు తమకు ఏమాత్రం గిట్టుబాటు కావడంలేదని నెట్‌వర్క్‌ ఆస్పత్రులు వాపోతున్నాయి. మరోవైపు... ఆస్పత్రులకు రూ.600 కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. బతిమాలి, బామాలి... కమీషన్లు ఇచ్చుకుంటే తప్ప బిల్లులు క్లియర్‌ కాని పరిస్థితి. దీంతో.. ఆరోగ్యశ్రీ కార్డు చూపితే ‘సారీ, ఇక్కడ మీకు చికిత్స లేదు’ అని మెజారిటీ ఆస్పత్రులు ముఖానే చెబుతున్నాయి. చికిత్స ఖర్చు రూ.వెయ్యి దాటితే చాలు... ఆరోగ్యశ్రీ వర్తింపచేస్తామన్న జగన్‌ ప్రకటన అమలులోకి రాలేదు. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే... పేదల చికిత్సకు ఉపయోగించాల్సిన ‘ఆరోగ్యశ్రీ’ నిధులను కొత్త మెడికల్‌ కాలేజీలకు మళ్లిస్తున్నారు. దీంతో పేదలు తమ ఆరోగ్యం కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. 


ఫ్యామిలీ డాక్టర్‌... ఎక్కడ?

‘‘30 వేల మందికి 2 పీహెచ్‌సీలు ఉంటాయి. ప్రతి 2వేల మందికి ఒక విలేజ్‌ క్లినిక్‌ ఏర్పాటు చేస్తున్నాం. పీహెచ్‌సీ నుంచి షెడ్యూల్‌ ప్రకారం గ్రామాలకు డాక్టర్‌ వెళతారు. ఆ కుటుంబాలను పేరుతో గుర్తుపట్టేలా... ఫ్యామిలీ డాక్టర్‌లా వ్యవహరిస్తారు’’ అని సీఎం జగన్‌ దావో్‌సలో చెప్పారు. ‘ఫ్యామిలీ డాక్టర్‌’ కాన్సెప్ట్‌ గురించి ఏడాదిన్నరగా జగన్‌ చెబుతూనే ఉన్నారు. ఇప్పటి వరకూ ఇది పూర్తిస్థాయిలో అమలులోకి రాలేదు. అసలు దాని విధివిధానాలు ఏమిటీ? పీహెచ్‌సీ డాక్టర్‌ ఏం చేస్తారు? 104లో ఉండే డాక్టర్‌ ఏం చేస్తారు? గ్రామ సచివాలయాల్లో ఉండే క్లినిక్స్‌లో విధులు నిర్వహించే సిబ్బంది ఏం చేయాలి? ఈ అంశాలపై స్పష్టతే లేదు. ఆరోగ్య శాఖపై సీఎం చేసే సమీక్షల్లో ప్రతిసారీ ‘ఫ్యామిలీ డాక్టర్‌’ కాన్సెప్ట్‌ కనిపిస్తుంది. కానీ... క్షేత్రస్థాయిలో మాత్రం అమలుకు నోచుకోవడంలేదు. 

Read more