ఆహా... ఏమి స్కీము!

ABN , First Publish Date - 2022-04-24T08:37:59+05:30 IST

వైఎస్‌ హయాంలో రాజీవ్‌ ఆరోగ్యశ్రీ! చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక... ‘ఎన్టీఆర్‌ వైద్యసేవ’! జగన్‌ అధికారంలోకి రాగానే...

ఆహా... ఏమి స్కీము!

పేర్లు, అమలు తీరు మార్చి.. ఏమార్చే ‘పథకం’

పథకాల అమలులో వైఎస్‌ జగన్‌ కొత్త పంథా

దశాబ్దాలుగా ఉన్న పథకాలకే కొత్త కలరింగ్‌

పెన్షన్‌ నుంచి ఆసరా వరకూ అదే గిమ్మిక్కు

పింఛను తొలి రెండేళ్లు పెంచింది రూ.250

‘దీవెన, వసతి’ పేరిట విద్యార్థులకు టోకరా

ఫీజు రీయింబర్స్‌మెంట్‌కే ‘జగనన్న విద్యాదీవెన’

మెస్‌ చార్జీలు, ఇతర చెల్లింపులే ‘వసతి దీవెన’

డ్వాక్రా సంఘాల స్ఫూర్తికి జగనన్న ‘ఉరి’

కొన్ని పథకాల్లో గతంలో ఉన్న లబ్ధి కూడా మాయం

జగన్‌ మహా ‘మార్కెటింగ్‌ మాయ’


ఒక కారు మోడల్‌ను నాలుగైదేళ్ల తర్వాత ‘అప్‌గ్రేడ్‌’ చేస్తారు. రూపు, షేపు కాస్త మార్చి... కొత్త వెర్షన్‌ తెచ్చామంటారు. ప్రకటనలు గుప్పిస్తారు. వినియోగదారులను ఆకర్షిస్తారు. స్కీముల విషయంలో ముఖ్యమంత్రి జగన్‌దీ అచ్చంగా ఇదే ‘మార్కెటింగ్‌’ టెక్నిక్‌! పాత పథకాలకే పేర్లు మార్చేశారు. వాటి అమలు తీరూ మార్చేశారు. గతంలో ఆయా పథకాల లబ్ధి సైలెంట్‌గా ప్రజలకు అందేది. కానీ... జగన్‌ తన మార్కెటింగ్‌ స్కిల్స్‌ అన్నీ ఉపయోగించి, అదే పథకానికి ప్రతిసారీ బటన్‌ నొక్కి నిధులు విడుదల చేస్తున్నారు. ప్రతిసారీ అదేదో కొత్త పథకం ప్రారంభిస్తున్నట్లుగా  ప్రకటనలు గుప్పిస్తారు. అందులోనూ... తన సొంత మీడియాకు కోట్లు దోచి పెడతారు. ఇది... గతంలో ఏ ముఖ్యమంత్రీ అనుసరించని ‘మార్కెటింగ్‌ మోడల్‌’. సొమ్ములు ప్రజలవి! పేరు.. జగన్‌కు. ప్రకటనల ఆదాయం... సొంత మీడియాకు! కాకపోతే, పలు సందర్భాల్లో... అప్‌గ్రేడ్‌ వెర్షన్‌ కంటే, పాతకారే బాగుంటుంది! జగన్‌ పథకాలూ అంతే!


(అమరావతి - ఆంధ్రజ్యోతి): వైఎస్‌ హయాంలో రాజీవ్‌ ఆరోగ్యశ్రీ! చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక... ‘ఎన్టీఆర్‌ వైద్యసేవ’! జగన్‌ అధికారంలోకి రాగానే... ‘డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ’ పథకం ఒక్కటే! కానీ... ప్రభుత్వం మారగానే పేరు మారుతూ వచ్చింది. ఇదొక్కటే కాదు! తాము అమలు చేస్తున్నామని జగన్‌ చెప్పుకొంటున్న అనేక సంక్షేమ పథకాలు ఆయన కొత్తగా కనిపెట్టినవి కావు! గత ప్రభుత్వ హయాంలో అమలైనవే! వాటి పేరు మార్చి, అమలు చేసే తీరు మార్చి... ప్రజలను ఏమార్చడమే ఆది నుంచీ జగన్‌ ‘పథకం’. ఇంకా చెప్పాలంటే... పలు పథకాల ద్వారా ఇప్పటికంటే గతంలోనే ఎక్కువ లబ్ధి చేకూరేది. మరో దారుణమేమిటంటే... అనేక సంక్షేమ పథకాలను జగన్‌ సీఎం కాగానే ఎత్తేశారు. ఇదీ... జగనన్న సంక్షేమం!


కేంద్రం ఇచ్చే కిసాన్‌ యోజన, చంద్రబాబు హయాంలో మొదలుపెట్టిన ‘అన్నదాతా సుఖీభవ’... ఈ రెండు కలిస్తే వైఎస్‌ జగన్‌ అందించే ‘రైతు భరోసా’. ఇందులో కొత్తేమిటి? 


ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్పులు, మెస్‌ చార్జీల వంటివన్నీ మిక్సీలో వేసి రుబ్బితే... జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అనే రెండు పథకాలు తయారవుతాయి. ఇవి నాలుగైదు దశాబ్దాలుగా అమలవుతున్నవే!


కోటిమంది డ్వాక్రా మహిళలందరికీ లబ్ధి చేకూర్చకుండా... వారిలో పాతిక శాతం మంది తీసుకున్న అప్పులను నాలుగు విడతల్లో మాఫీ చేస్తే... అదే ‘ఆసరా’!


అప్పటికే అందుతున్న రూ.2వేల పెన్షన్‌ను రెండేళ్లపాటు రూ.250 పెంచి ఇవ్వడమే... గొప్ప!


రాష్ట్ర ప్రజలారా... వినండి! మూడేళ్ల ముందు ‘సంక్షేమం’ అనేదే లేదట! జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాతే... సంక్షేమ పథకాలు మొదలయ్యాయట! వాటిని ఆపాలని ప్రతిపక్షాలు గోల చేస్తున్నాయట! జగన్‌ కొత్తగా ఎన్ని పథకాలు అమలు చేశారో తెలియదుకానీ... ఎన్నికలు రెండేళ్లు ఉండగానే, ‘బ్లాక్‌ మెయిలింగ్‌’ పథకం మొదలుపెట్టారు. అసలు... జగన్‌ ‘పథకం’ ఏమిటి? దీనజనోద్ధరణ మొదలు పెట్టింది జగనేనా? జగన్‌ హయాంలో పేదలకు కొత్తగా ఒరుగుతున్నదేమిటి? లోతుగా ఆరా తీస్తే... అంతా పాత స్కీముకే కొత్త పేరు!రూ.40వేల కోట్ల గుట్టు

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు వివిధ రూపాల్లో ఏటా రూ.40వేల కోట్లు పంచుతున్నామని వైసీపీ గొప్పగా చెబుతోంది. ఇందులో నిజమెంతో చూద్దాం! ప్రజలకు పంచిపెడుతున్నామంటున్న రూ.40,000 కోట్లలో సామాజిక పింఛన్ల వాటాయే రూ.18వేల కోట్లు! ఒకప్పుడు వృద్ధాప్య పింఛను రూ.75. తర్వాత రూ.200. దానిని చంద్రబాబు ఒకేసారి వెయ్యి చేశారు. ఆ తర్వాత రెండువేలకు పెంచారు. అధికారంలోకి వస్తే పింఛను రూ.3వేలు చేస్తామని చంద్రబాబు, జగన్‌ ఇద్దరూ హామీ ఇచ్చారు. కానీ... ప్రజలు జగన్‌కు అధికారం అప్పగించారు. జగన్‌... సీఎం కాగానే, ఏడాదికి రూ.250 చొప్పున పెంచుతూ నాలుగేళ్లలో రూ.3వేలు చేస్తామని కొత్త పల్లవి అందుకున్నారు. అందులోనూ మళ్లీ మోసమే. తొలి రెండేళ్లు రూ.2250కే పరిమితం చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి మాత్రం రూ.2500 చేశారు. వెరసి... ఈ ఆర్థిక సంవత్సరం జగన్‌ సర్కారు పింఛన్లపై ఖర్చు చేసేది రూ.18వేల కోట్లు. చంద్రబాబు హయాంలో ఇది రూ.15వేల కోట్లు. తొలి రెండేళ్లు జగన్‌ రూ.250 మాత్రమే పెంచారు. అంటే... ఏటా అదనంగా పడిన భారం రూ.1640 కోట్లు మాత్రమే. అసలు విషయం ఇది. చంద్రబాబు గద్దెదిగేనాటికి అన్ని రకాల పింఛన్లు 54 లక్షలు ఉండేవి. జగన్‌ వచ్చీ రాగానే ‘ఆరు రకాల ఆంక్షలు’ అమలు చేస్తూ... దాదాపు 4 లక్షల మందికి పింఛన్లు రద్దు చేశారు. మరోవైపు వృద్ధాప్య పింఛను వయసును 60 ఏళ్లకు కుదించారు. 10 లక్షల మందికిపైగా పింఛను కోసం దరఖాస్తు చేసుకోగా, కఠినమైన వడపోతలు చేస్తూ అర్హులైన వారివి సైతం పక్కన పడేస్తున్నారు. లక్షల దరఖాస్తులు గ్రామ సచివాలయాల్లోనే మూలుగుతున్నాయి. 


‘ఆసరా’... అంతటితో సరా?

‘ఆసరా’ పథకంతో రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలందరికీ అండగా నిలుస్తున్నామని వైసీపీ చెప్పుకొంటోంది. ఇందులో ఎంత నిజముందో చూద్దాం! రాష్ట్రంలో 1.02 కోట్ల మంది డ్వాక్రా మహిళలున్నారు. ‘ఆసరా’ కింద డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తున్నట్లు జగన్‌ ప్రకటించారు. 2019 ఏప్రిల్‌ 1వ తేదీని డెడ్‌లైన్‌గా పెట్టి... గరిష్ఠంగా రూ.లక్ష వరకు రుణమాఫీ అమలవుతుంది. తీసుకున్న అప్పులో కట్టగా మిగిలిన మొత్తాన్ని... నాలుగు విడతల్లో మాఫీ చేస్తారు. ఇదీ... స్థూలంగా ‘ఆసరా’ పథకం! కానీ... దీనివల్ల లబ్ధిచేకూరేది 25 శాతం మందికి మాత్రమే. మొత్తం డ్వాక్రా మహిళల్లో రుణాలు తీసుకున్నది పాతిక శాతమే. అందులోనూ...  ఐదుపదివేలు రుణం తీసుకున్న వారే ఎక్కువ. అంటే... నాలుగేళ్లలో వారికి కలిగే లబ్ధి అది మాత్రమే. మొత్తంగా చూస్తే... కోటి మంది డ్వాక్రా మహిళల్లో, అప్పు తీసుకున్న వారికి మాత్రమే ‘ఆసరా’ పనికొస్తుంది. అదే చంద్రబాబు సర్కారు మొత్తం డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరేలా... 2015-16లో పెట్టుబడి సాయం కింద ఒక్కో సభ్యురాలికి రూ10,000 చొప్పున ఇచ్చారు. తిరిగి 2018-19లో పసుపు - కుంకుమ పేరుతో ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున ఇచ్చారు. డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసిందే చంద్రబాబు. జగన్‌ హయాంలో డ్వాక్రా మహిళలకు జరిగిన మేలు కంటే కీడే ఎక్కువ. పొదుపు సంఘాలను ఆయన నిర్వీర్యం చేశారు. మహిళలు సొంతంగా నడుపుకొనే ఈ గ్రూపులను సచివాలయాల పరిధిలోకి తీసుకొచ్చారు. సంఘాలలోకి పార్టీ కార్యకర్తలను చొప్పించారు. బ్యాంకు ఖాతాలను ‘నిధుల మళ్లింపు’లకు వీలుగా... కోఆపరేటివ్‌ బ్యాంకుల్లోకి మార్పించారు. చివరికి ప్రభుత్వం... డ్వాక్రా సంఘాల పొదుపు మొత్తాన్ని చూపించి అప్పులు తెచ్చుకునేంత దారుణమైన పరిస్థితి నెలకొంది.


ఎవరిది ‘భరోసా?’

‘రైతు భరోసా’ పేరుతో అన్నదాతలకు ఏటా రూ.13,500 అందిస్తున్నామని... చెప్పినదానికంటే ఎక్కువే ఇస్తున్నామని జగన్‌ సర్కారు చెబుతోంది. ఆ సంగతేమిటో చూద్దాం!

రైతు బంధు, అన్నదాతా సుఖీభవ, పీఎం కిసాన్‌ యోజన, రైతు భరోసా... పేరు ఏదైనా రైతులకు పెట్టుబడి సాయం చేయడమే లక్ష్యం. దేశవ్యాప్తంగా 2018 డిసెంబరు నుంచి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈ పథకం అమలు చేస్తోంది. ఆ తర్వాత ఫిబ్రవరిలో ఏపీ సీఎం చంద్రబాబు ‘అన్నదాతా సుఖీభవ’ను ప్రారంభించారు. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత సీఎం అయిన జగన్‌ దానిని ‘రైతు భరోసా’గా కొనసాగిస్తున్నారు. ‘మేమే ఇస్తున్నాం అంటున్న’ రూ.13,500లలో కేంద్రం వాటాయే రూ.6వేలు. రైతుకు ఏటా రూ.12,500 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్‌... కేంద్రం వాటాను కూడా కలిపి రూ.13,500 ఇస్తున్నారు. అంతకుముందు చంద్రబాబు ‘అన్నదాతా సుఖీభవ’ కింద కేంద్రంతో సమానంగా రూ.6వేలు  ఇవ్వాలని నిర్ణయించారు. తొలి విడతగా రూ.3వేలు జమ చేశారు. ఆ తర్వాత ఎన్నికలు వచ్చాయి. చంద్రబాబు హయాంలో రైతులకు సంబంధించి రూ.16వేల కోట్ల రుణాలను మాఫీ చేశారు. మరి... రైతులకోసం జగన్‌ కొత్తగా అమలు చేసిన సంక్షేమ పథకం ఏమిటి?


‘విద్యార్థి’కి వాత

విద్యా దీవెన, వసతి దీవెన... అబ్బబ్బో, విద్యార్థులకోసం ఎన్నెన్నో ఇస్తున్నామని జగన్‌ సర్కారు చెబుతోంది. దీని ‘అసలు’ రూపం ఏమిటో పరిశీలిస్తే...

వివిధ రకాల స్కాలర్‌షిప్పులు, ఫీజు రాయితీ/చెల్లింపు, మెస్‌ చార్జీలు, కాస్మెటిక్‌ చార్జీలు... ఇవి నాలుగైదు దశాబ్దాలుగా విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్నవే. జగన్‌ అమలు చేస్తున్నవీ అవే. ఫీజు రీఇంబర్స్‌మెంట్‌కు విద్యా దీవెన అని... స్కాలర్‌షిప్పులు, మెస్‌ చార్జీలు, కాస్మెటిక్‌ ఖర్చులు, ఇతర ఆర్థిక ప్రయోజనాలను కలిపి జగనన్న వసతి దీవెన అని పేర్లు మార్చారు. మరోవైపు.. జగన్‌ హయాంలో విద్యార్థులకు నష్టమే ఎక్కువ జరుగుతోంది.  జీవో నెంబరు 77 ద్వారా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు తీరని అన్యాయం చేశారు. ఉన్నత విద్యలో 70 శాతంపైగా సీట్లు  ప్రైవేట్‌ ఎయిడెడ్‌, ప్రైవేటు కాలేజీల్లోనే ఉంటాయి. అయినప్పటికీ ప్రైవేట్‌ ఎయిడెడ్‌, ప్రైవేటు కాలేజీల్లో కన్వీనర్‌ కోటా కింద సీట్లు పొందిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్పులు రాకుండా జీవో 77 విడుదల చేశారు. ఇది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించకుండా జగన్‌ సర్కార్‌ చేసిన కుట్ర అనే విమర్శలున్నాయి. 


ఎలా ‘చేయూత’?

ఇది జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకమే! 45  నుంచి 60 సంవత్సరాల మహిళలకు నాలుగేళ్లలో రూ.75వేలు సాయం అందించడమే దీని లక్ష్యం. అంటే... ఏటా రూ.18,750 ఇస్తారు. ఇలా ముక్కలుగా అందే సహాయం ఎందుకు, ఎలా ఉపయోగపడుతుందో కూడా తెలియదు! వచ్చిన డబ్బులు ఏదో అవసరానికి ఖర్చు చేసుకునే వారే ఎక్కువమంది. అలాకాకుండా... ఒకేసారి రూ.75వేలు అందిస్తే బడుగు బలహీనవర్గాల మహిళలు సొంత కాళ్లపై నిలబడేందుకు ఉపయోగపడుతుంది. ఈ పథకం కోసం ఏడాదికి రూ.4,200 కోట్ల చొప్పున రెండేళ్లలో రూ.8,400 కోట్లు ఖర్చు చేశారు. కానీ...  దీనివల్ల లబ్ధిదారులకు స్వల్పకాలిక సంతోషమే తప్ప దీర్ఘకాలికంగా ప్రయోజనం శూన్యం. ‘బడుగులు తమకు అందబోయే సహాయం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. అంతేతప్ప, సొంత కాళ్లపై నిలబడకూడదు’ అనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశ్యమా? అదే గత ప్రభుత్వంలో... మహిళలు స్వయం ఉపాధి పొందేలా భారీ ఎత్తున సబ్సిడీ లోన్లు ఇచ్చేవారు. స్థిరమైన ఆదాయం కల్పించేవారు. జగన్‌ వాటన్నింటినీ ఎత్తేసి... ‘చేయూత’ ప్రవేశపెట్టారు.


 ఆరోగ్యశ్రీకి రోగం...

రేపటి సంచికలో ‘అమ్మఒడి’ అసలు గుట్టు..

మరిన్ని పథకాల లోగుట్టు

‘పేద ప్రజలకూ కార్పొరేట్‌ వైద్యం’ అనే నినాదంతో 2007లో వైఎస్‌ రాజశేఖర రెడ్డి ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని ప్రవేశపెట్టారు. దానిని ఆయన తర్వాత వచ్చిన రోశయ్య, కిరణ్‌ కుమార్‌ రెడ్డి, నవ్యాంధ్రలో చంద్రబాబు నాయుడు సంపూర్ణంగా అమలు చేశారు. జగన్‌ వచ్చీ రాగానే... దాదాపు 2వేల కొత్త ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీలోకి చేర్చడంతో, ఈ పథకానికి మరింత మహర్దశ పడుతుందని అంతా అనుకున్నారు. కానీ... ఇప్పుడు అసలుకే మోసం వచ్చింది. బిల్లులు పెండింగ్‌లో పెట్టడం, క్లియర్‌ చేయాలంటే కమీషన్లు డిమాండ్‌ చేయడంతో... ‘ఆరోగ్యశ్రీ’ పేషంట్‌ అంటేనే చాలావరకు ప్రైవేటు ఆస్పత్రులు దండం పెడుతున్నాయి. 

Read more