-
-
Home » Andhra Pradesh » JAC of AP Panchayat Raj Engineers-NGTS-AndhraPradesh
-
వేధింపులు ఆపకపోతే పనులు ఆపేస్తాం
ABN , First Publish Date - 2022-10-11T09:52:37+05:30 IST
పంచాయతీరాజ్ ఇంజనీర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సహాయ నిరాకరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 13 నుంచి

దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు
13 నుంచి నిరసనలు... 24 నుంచి సహాయ నిరాకరణ
ఏపీ పంచాయతీరాజ్ ఇంజనీర్ల జేఏసీ
అమరావతి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్ ఇంజనీర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సహాయ నిరాకరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 13 నుంచి దశలవారీగా ఆందోళనకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం ఏడాదిగా పీఆర్ ఇంజనీర్ల పట్ల అవలంభిస్తున్న వైఖరికి నిరసనగా ఉద్యమానికి సిద్ధమైనట్లు ఏపీ పంచాయతీరాజ్ జేఏసీ చైర్మన్ వీవీఎంకే నాయుడు, సెక్రటరీ జనరల్ కె.రవీంద్ర సోమవారం ప్రకటించారు. ఆ మేరకు పీఆర్ ఈఎన్‌సీకి వినతి పత్రాన్ని అందించారు. ప్రభుత్వ పథకాలు, గ్రామ సచివాలయం భవనాలు, వెల్‌నెస్ కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలు, బల్క్ మిల్క్ చిల్లింగ్ కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీ భవనాల నిర్మాణాలకు సంబంధించి ఇంజనీర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ప్రభుత్వానికి, ఈఎన్‌సీకి పలు దఫాలు వివరించామన్నారు. జిల్లా కలెక్టర్లు పంచాయతీరాజ్ ఇంజనీర్ల పట్ల అనుసరిస్తున్న వైఖరిపై ప్రభుత్వానికి తెలియజేశామని తెలిపారు. కొంత మంది జిల్లా కలెక్టర్లు ఇంజనీర్ల పట్ల అనుచిత వైఖరి అవలంభిస్తున్నారని, టెలీకాన్ఫరెన్స్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌లు పదేపదే పెట్టి పురోగతి లేకుండా కాలం వృథా చేస్తున్నారని ఆరోపించారు.
ప్రధానమైన డిమాండ్లు...
పనులకు సంబంధించి ఇంజనీర్లను బాధ్యులను చేయడం నిలిపేయాలని, ముఖ్యమంత్రి హామీ మేరకు ఎస్‌డీఎఫ్, ఉపాధి పనులకు సంబంధించి పంచాయతీరాజ్ ఇంజనీర్లపై చర్యలు తీసుకోరాదన్నారు. జిల్లా కలెక్టర్లు ఇంజనీర్లను వేధించడం మానేయాలని, ఎస్టిమేట్లను రివిజన్ చేయాలని కొత్త జిల్లాల్లో ఎస్‌ఈ, ఈఈ పోస్టులు వెంటనే క్రియేట్ చేయాలని డిమాండ్ చేశారు.
13 నుంచి ఉద్యమానికి శ్రీకారం...
ఈ డిమాండ్లను సాధించే క్రమంలో ఈ నెల 13 నుంచి ఉద్యమం ప్రారంభిస్తామన్నారు. 13 నుంచి 15 వరకు నల్లబ్యాడ్జీలతో ఇంజనీర్లు నిరసన తెలుపుతారని, 17 నుంచి 19 వరకు ఈఎన్‌సీ/సర్కిల్/డివిజన్ కార్యాలయాల్లో లంచ్ అవర్‌లో నిరసనలు తెలియజేయనున్నారు. 20న ఈఎన్‌సీ కార్యాలయంలో ధర్నా నిర్వహిస్తారు. 24 నుంచి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపడతారని పంచాయతీరాజ్ ఇంజనీర్ల జేఏసీ చైర్మన్ వీవీఎంకే నాయుడు, సెక్రటరీ జనరల్ కె.రవీంద్ర ఈఎన్‌సీకి వినతి పత్రం అందించారు.