ఇది దొంగల ప్రభుత్వం
ABN , First Publish Date - 2022-12-15T03:32:59+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం దొంగల ప్రభుత్వంగా మారింది. దీనికి ప్రధాని మోదీ అడ్డుకట్ట వేయాలి’’ అని కురమామిడి గ్రామం వైసీపీ సర్పంచ్ సుధాకర్ అన్నారు.
పనులన్నీ కేంద్రం నిధులతోనే
రాష్ట్ర నిధుల నుంచి పైసా ఖర్చు పెట్టడం లేదు
ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలి
వైసీపీ ప్రభుత్వంపై అధికార పార్టీ సర్పంచ్ ఫైర్
గాండ్లపెంట, డిసెంబరు 14: ‘‘రాష్ట్ర ప్రభుత్వం దొంగల ప్రభుత్వంగా మారింది. దీనికి ప్రధాని మోదీ అడ్డుకట్ట వేయాలి’’ అని కురమామిడి గ్రామం వైసీపీ సర్పంచ్ సుధాకర్ అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలం కురమామిడిలో టీడీపీ నాయకులు ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా సర్పంచ్ ఇంటి వద్దకు వెళ్లారు. టీడీపీ నాయకుల వద్ద సర్పంచ్ తన ఆవేదనను పంచుకున్నారు. ‘‘కేంద్ర నిధులతో గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ సెంటర్లు, నాడు-నేడు పనులు, రోడ్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. సీఎం జగన్ రాష్ట్ర నిధులతో ఏ అభివృద్ధీ చేయడంలేదు. గ్రామ పంచాయతీలకు కేంద్రం అందిస్తున్న నిధులను కూడా లాక్కుంటున్నారు. ఇలా చేస్తే పంచాయతీల అభివృద్ధి ఎలా జరుగుతుంది? ఇలాంటి దొంగల ప్రభుత్వానికి కేంద్రం నిధులు ఆపివేయాలి. నేను ఎన్నికల ముందు ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసి గెలిచా. ప్రస్తుతం వాటిని నేరవేర్చలేకపోతున్నా. నా పంచాయతీలో తాగు నీటి కోసం బోర్లు వేయించా. ఆ బిల్లులను ఇంతవరకు ఇవ్వలేదు’’ అని సర్పంచ్ సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు.