వంశీరామ్‌ బిల్డర్స్‌పై ఐటీ దాడులు

ABN , First Publish Date - 2022-12-07T02:48:23+05:30 IST

తెలంగాణలోని అధికార పక్షం టీఆర్‌ఎస్‌ ఆర్థిక మూలాలను లక్ష్యంగా చేసుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు కొనసాగుతున్నాయి.

వంశీరామ్‌ బిల్డర్స్‌పై ఐటీ దాడులు

ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు

తనిఖీల్లో కీలక ఆధారాలు లభ్యం

గ్రీన్‌పార్క్‌ చైర్మన్‌ ఇంట్లో తనిఖీలు

దేవినేని అవినాశ్‌ నివాసంపైనా దాడులు

కీలక కమర్షియల్‌ ప్రాజెక్టుల్లో వంశీరామ్‌

వేల కోట్ల రూపాయల్లో లావాదేవీలు

కేటీఆర్‌కు సన్నిహితులుగా ప్రచారం

హైదరాబాద్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని అధికార పక్షం టీఆర్‌ఎస్‌ ఆర్థిక మూలాలను లక్ష్యంగా చేసుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ సన్నిహితులుగా ప్రచారంలో ఉన్న వంశీరామ్‌ బిల్డర్స్‌ ప్రధాన కార్యాలయాలతో పాటు డైరెక్టర్‌ ఇళ్లలో మంగవారం తెల్లవారు జామునుంచే(ఉదయం 4 గంటలకే) ఐటీ అధికారులు సోదాలు ప్రారంభించారు. నందగిరి హిల్స్‌లోని వంశీరామ్‌ బిల్డర్స్‌ ఛైర్మన్‌ సుబ్బారెడ్డి నివాసంలోనూ తనిఖీలు జరిగాయి. పెద్దమ్మతల్లి దేవాలయం దగ్గర ఉన్న కార్పొరేట్‌ కార్యాలయంలో, జూబ్లీహిల్స్‌లోని సుబ్బారెడ్డి బావమరిది జనార్ధన్‌రెడ్డి నివాసంలోనూ అధికారులు తనిఖీ చేపట్టారు. మొత్తం హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా 15 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు జరిపారు. బంజారాహిల్స్‌లో వివాదంలో ఉన్న ఒక పెద్ద స్థలంలో వీరు నిర్మాణాలు చేపట్టారు. ఈ విషయంలో ఇటు వంశీ రామ్‌ బిల్డర్స్‌, ఏపీలో దేవినేని అవినాష్‌, వల్లభనేని వంశీ ఇళ్లపై దాడులు జరిపినట్లు సమాచారం. గత ఇరవై ఐదేళ్లుగా వంశీరామ్‌ బిల్డర్స్‌ సంస్థ నిర్మాణం రంగంలో ఉంది. వివిధ ప్రాంతాల్లో వంశీరామ్‌ బిల్డర్స్‌ పలు ప్రాజెక్టులు పూర్తి చేసింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం పలు భారీ కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం చేపడుతోంది.

ఇతర రాష్ట్రాల్లో వందల ఎకరాల ఫామ్‌ లాండ్‌ విక్రయించిందని సమాచారం. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులతో పాటు గతంలో పూర్తి చేసిన ప్రాజెక్టుల వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నారు. వేల కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు జరిపిన వంశీరామ్‌ బిల్డర్స్‌ సంస్థ లాభాలను తక్కువగా చూపి పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. ఆ నిధులను ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని భావిస్తున్నారు. కాగా, గ్రీన్‌పార్క్‌ హోటల్‌ ఛైర్మన్‌ మల్లికార్జునరెడ్డి నివాసంలోనూ ఐటీ బృందాలు సోదాలు నిర్వహించాయి. వంశీరామ్‌ బిల్డర్స్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారన్న సమాచారం మేరకు మల్లికార్జునరెడ్డితో పాటు ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లల్లోనూ ఐటీ బృందాలు సోదాలు జరిపాయి. మంగళవారం రాత్రి పొద్దుపోయే వరకు సోదాలు కొనసాగాయి.

హైదరాబాద్‌ నుంచి ప్రత్యేకంగా వెళ్లిన ఐటీ అధికారులు విజయవాడలో వైసీపీ నేతలు దేవినేని అవినాష్‌, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇళ్లల్లో తనిఖీలు జరిపారు. వంశీరామ్‌ బిల్డర్స్‌పై తనిఖీల్లో భాగంగానే వైసీపీ నేతల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌-2లో వైసీపీ నేత దేవినేని అవినా్‌షకు చెందిన స్థలాన్ని డెవల్‌పమెంట్‌ కోసం వంశీరామ్‌ బిల్డర్స్‌ తీసుకుంది. ఒప్పందంలో భాగంగా జరిగిన లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. అవినాష్‌ విజయవాడ తూర్పు నియోజకవర్గానికి వైసీపీ ఇన్‌చార్జిగా వ్యహరిస్తున్నారు.

Updated Date - 2022-12-07T02:48:24+05:30 IST