ఆ తప్పుల్లో తప్పు లేదట!

ABN , First Publish Date - 2022-01-19T08:31:07+05:30 IST

ఆ తప్పుల్లో తప్పు లేదట!

ఆ తప్పుల్లో తప్పు లేదట!

మోపిన చార్జ్‌లు రుజువైనా క్లీన్‌చిట్‌

వాస్తవాల ముఖంపై ఇసుక కొట్టిన వైనం

విశాఖ ఇసుక వివాదంలో ఏసీకి ఊరట

ఆవేదనతో డీసీపై ఇసుక కొట్టానని వివరణ

హుండీ లెక్కింపుల్లో పొంతనలేని అంశాలు

ఉద్యోగులపై వేధింపుల ప్రస్తావనే లేదు

అయినా వివరణ పట్ల కమిషనర్‌ సంతృప్తి

విమర్శలపాలవుతున్న దేవదాయశాఖ తీరు


(అమరావతి, ఆంధ్రజ్యోతి)

పై అధికారి ముఖంపై ఇసుక కొట్టడం, ఆలయ హుండీ నగదును ఇష్టమొచ్చినట్లు కారులో తీసుకెళ్లడం, కింది ఉద్యోగులను తీవ్రంగా వేధించడం లాంటివి తప్పులు కావని దేవదాయశాఖ ధ్రువీకరించింది. శాఖలో ఎవరైనా ఇలాంటి తప్పులు చేసినా.. వివరణ ఇస్తే ఎలాంటి విచారణ లేకుండా క్లీన్‌చిట్‌ ఇవ్వొచ్చని కొత్త న్యాయం చెప్పింది. విధుల్లో ఉన్న తన పై అధికారి వద్దకు వెళ్లి ము ఖంపై విసురుగా ఇసుక చిమ్మితే దాన్ని ఆవేదనలో చేసిన చర్యగా చూడాలని చెప్పింది. ఇలాంటి వింత వైఖరితో దేవదాయశాఖ తీవ్ర విమర్శలపాలవుతోంది. గత ఏడాది చివర్లో విశాఖ దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కె.శాంతి...అదే శాఖలోని తన పైఅధికారి డిప్యూటీ కమిషనర్‌ పుష్పవర్ధన్‌పై ఇసుక కొట్టిన విషయం తెలిసిందే. అది సీసీ కెమెరాల్లోనూ రికార్డు కావడం, ఆ ఫుటేజ్‌ టీవీల్లో రావడం అప్పట్లో కలకలం రేపింది. విధుల్లో ఉన్న డీసీ చాంబర్‌లోకి వెళ్ళిన ఏసీ...నేరుగా ఈ చర్యకు పాల్పడటంతో దేవదాయశాఖలో ఆ ఘటన సంచలనం రేపింది. వెంటనే దీనిపై అప్పటి ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. రాజమహేంద్రవరం ఆర్జేసీ సురేశ్‌బాబును విచారణాధికారిగా నియమించారు. ఈ ఘటనతో పాటు ఏసీ శాంతిపై వచ్చిన అనేక ఆరోపణలపై ఆయన విచారణ చేశారు. ఆమెపై తక్షణం క్రమశిక్షణ చర్యలు చేపట్టాలంటూ నివేదిక ఇచ్చారు. అనంతరం దానిపై ఏసీ శాంతి వివరణ ఇచ్చారు. ఆ వివరణ సంతృప్తికరంగా ఉందని దేవదాయశాఖ కొత్త కమిషనర్‌ హరి జవహర్‌లాల్‌ భావించారు. ఆమెపై పెట్టి అభియోగాలను తొలగించి, క్లీన్‌చిట్‌ ఇచ్చారు. దీంతో దేవదాయశాఖలో ఎలాంటి తప్పులు చేసినా వాటిపై చర్యలుండవని, విచారణలు, వివరణలతో సరిపెడతారనే సంకేతాలు ఇచ్చారు.


నివేదికలో ఏమున్నదంటే..

పలువురు ఉద్యోగుల వివరణ తీసుకుని ఇసుక ఘటనపై రాజమహేంద్రవరం ఆర్‌జేసీ నివేదిక ఇచ్చారు. ఈ క్రమంలో ఏసీ శాంతి చేస్తున్న అవకతవకలు, ఉద్యోగులపై వేధింపులు తెరపైకి వచ్చాయి. ఏసీగా విధులు నిర్వర్తించడంలో ఆమె పూర్తిగా విఫలమయ్యారని, ఉద్యోగులను తీవ్రస్థాయిలో వేధిస్తూ, మొత్తం ఉద్యోగుల్లోనే టెన్షన్‌ వాతావరణం సృష్టించారని నివేదికలో తెలిపారు. కిందిస్థాయి ఉద్యోగుల పట్ల ఆమె సుపీరియారిటీ కాంప్లెక్స్‌తో ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. అనేక ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నారని, పై అధికారుల ఆదేశాలు పాటించడం లేదని వివరించారు. విశాఖ జిల్లాలోని దారపాలెంలో ఉన్న దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయం హుండీ లెక్కింపు సమయంలో ఆలయ ఈవో, చీఫ్‌ ఫెస్టివల్‌ ఆఫీసర్‌(సీఎ్‌ఫవో) లేరని, ఆ ఆలయంతో సంబంధం లేని మరో అధికారిని అక్కడ పెట్టుకున్నారని స్పష్టంగా ఉల్లంఘనలను వివరించారు. విధుల్లో ఉన్న డీసీ ముఖంపై ఇసుక చిమ్మారని పేర్కొన్నారు. ఇన్ని ఉల్లంఘనలకు పాల్పడిన అధికారిపై కచ్చితంగా చర్యలుండాలని పేర్కొన్నారు.


పొంతనలేని వివరణ

ఆర్జేసీ నివేదిక తనను తప్పుబట్టడంపై ఏసీ శాంతి పొంతన లేని వివరణ ఇచ్చారు. దారపాలెం ఆలయం నక్సల్‌ ప్రభావిత ప్రాంతంలో ఉన్నందున పోలీస్‌ సలహా మేరకు ఏఎ్‌సఐ, హెడ్‌ కానిస్టేబుల్‌, రెవెన్యూ అధికారుల సమక్షంలో హుండీ లెక్కింపు చేశామని ఆమె వివరించారు. కానీ అసలు నిబంధనల ప్రకారం ఈవో ఎందుకు లేరనే విషయం తెలపలేదు. ఇక ఆర్‌జేసీ విచారణలో సీఎ్‌ఫవో లేరని పేర్కొనగా, ఏసీ వివరణలో ఉన్నారని పేర్కొనడం గమనార్హం. ఇక భద్రతా కారణాల రీత్యా హుండీ నగదును తన వెంట తీసుకెళ్లి నర్సీపట్నంలో అప్పగించానని ఏసీ పేర్కొన్నారు. కానీ గత విచారణల సమయాల్లో అసలు పోలీసులు ఉన్నారనే విషయం ఎక్కడా పేర్కొనలేదు. పైగా సంబంధం లేని వేరే ప్రాంతానికి చెందిన శ్రీనివాసరాజు అనే దేవదాయ ఇన్‌స్పెక్టర్‌ అక్కడ ఎందుకున్నారనేదానిపై ఆమె ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇక ఈవో లేకుండా ఎందుకు లెక్కించారన్నదానిపైనా వివరణ లేదు. ఇక ఇసుక కొట్టిన సమయంలో డీసీ తనను రెచ్చగొట్టారని... ఆవేదనతోనే వెళ్లి ప్రశ్నించానని పేర్కొన్నారు. కానీ ఆమె డీసీని ప్రశ్నించలేదని, నేరుగా వెళ్లి ఇసుక కొట్టారని సీసీ టీవీ ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే విషయాన్ని ఆర్‌జేసీ నివేదికలో పేర్కొన్నారు. ఇక ఆమె ఉంటే పనిచేయడం తమవల్ల కాదని విశాఖ దేవదాయ ఉద్యోగులు సమ్మెకట్టడంపైనా ఆమె వివరణ ఇవ్వలేదు.


అర్థంలేని వివరణకు సంతృప్తి 

ఏ కోణంలోనూ ఆమె వివరణ సంతృప్తికరంగా లేనప్పటికీ కమిషనర్‌ ఆమె వివరణ పట్ల సంతృప్తి చెంది ఆమెపై పెట్టిన అన్ని చార్జ్‌లను ఎత్తివేశారు. ఆమె వివరణతో సరిపెట్టుకునేలా అయితే అసలు ఆర్‌జేసీ విచారణ చేయడం, నివేదిక ఇవ్వడం ఎందుకనేది అర్థంకావడం లేదు. కాగా ఆమె ప్రొబేషన్‌ కాలం పూర్తికావొస్తున్నందునే ఆమెకు క్లీన్‌చిట్‌ ఇచ్చారనే వాదన దేవదాయశాఖలో వినిపిస్తోంది. ప్రొబేషనరీ కూడా డిక్లేర్‌ కాకుండా ఇన్ని ఆరోపణలు వస్తే పూర్తిగా ఉద్యోగం నుంచి తొలగించే వీలుంది. కానీ ఆమెకు ప్రొబేషనరీ డిక్లేర్‌ చేసేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వివరణ ఇప్పించి, పొంతన లేని వివరణకే సంతృప్తి చెంది క్లీన్‌చిట్‌ ఇచ్చేశారు. ఈ వ్యవహారంతో దేవదాయశాఖలో ఎలాంటి ఉల్లంఘనలు చేసినా ఈ విచారణను ఉదాహరణగా చూపించి, చర్యలు లేకుండా తప్పించుకునే వీలును కల్పించారని ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. ఏ అధికారిపైనా ఏకకాలంలో ఇంతకుమించిన ఆరోపణలు రావని, వీటినే కొట్టిపారేసిన ఉన్నతాధికారులు ఇక చిన్న ఆరోపణలపై ఎలా చర్యలు తీసుకోగలరని ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2022-01-19T08:31:07+05:30 IST