జగన్‌ పాలనలో ఆడబిడ్డలకు రక్షణేదీ?

ABN , First Publish Date - 2022-04-23T08:49:13+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌ పాలనలో ఆడబిడ్డలకు రక్షణ కరువైందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు.

జగన్‌ పాలనలో ఆడబిడ్డలకు రక్షణేదీ?

  • బాధ్యతలేని సీఎంకు పాలించే అర్హత లేదు 
  • జీజీహెచ్‌లో అత్యాచార ఘటనపై చంద్రబాబు ఆగ్రహం 
  • బాధితురాలికి పరామర్శ రూ.5 లక్షల ఆర్థిక సాయం 
  • ఈ ప్రభుత్వానికి సిగ్గుందో లేదో తెలియదు
  • ఈ ఘటన వెలుగు చూశాక పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా నేను సిగ్గుపడుతున్నాను
  • కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు ఇస్తే.. వెతుక్కోమని పోలీసులు చెబుతారా?
  • టీడీపీ అధినేత ఫైర్‌

విజయవాడ, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్‌ పాలనలో ఆడబిడ్డలకు రక్షణ కరువైందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో వరుసగా అత్యాచార ఘటనలు జరుగుతున్నా ఈ ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్న ఈ ముఖ్యమంత్రికి రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదని స్పష్టం చేశారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అత్యాచారానికి గురైన బాధితురాలిని శుక్రవారం ఆయన పరామర్శించారు. పాత ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధితురాలికి, ఆమె తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. టీడీపీ తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. అనంతరం ఆస్పత్రి వెలుపల చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ‘ప్రభుత్వాస్పత్రికి ఒక ఆడబిడ్డను తీసుకొచ్చి ఒక గదిలో బంధించి 30 గంటలపాటు ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేయడం అత్యంత హేయమైన చర్య. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. గర్హిస్తున్నాను. రాష్ట్రంలో ఏ ఆడబిడ్డకైనా రక్షణ ఉందా అని ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను.


ఇంట్లో ఉన్న అమాయకురాలిని, అందునా మానసికస్థితి సరిగా లేని అమ్మాయిని ఆస్పత్రికి తీసుకొచ్చిన శ్రీకాంత్‌ తాగి ఆమెపై అత్యాచారం చేయడమే గాకుండా బాబూరావు అనే వ్యక్తికి అప్పగించడం, అతను పవన్‌ కల్యాణ్‌ అనే మరో వ్యక్తికి అప్పగించడం.. ఈ ముగ్గురూ సామూహిక మానభంగం చేశారంటే.. ఈ ఘటనను ఏవిధంగా అభివర్ణించాలో కూడా అర్థం కావడం లేదు. ఈ ప్రభుత్వానికి సిగ్గుందో లేదో తెలియడం లేదు గానీ.. ఈ ఘటన వెలుగు చూసిన తర్వాత ఒక పౌరుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా నేను సిగ్గుపడుతున్నాను. ఈ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డకైనా రక్షణ ఉందా? అని ఈ ముఖ్యమంత్రి (జగన్‌)ను అడుగుతున్నాను. 


కనీసం ముఖ్యమంత్రి జగన్‌ విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ఉన్న అత్యాచార బాధితురాలిని పరామర్శించి రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డల రక్షణకు భరోసా ఇచ్చి ఉంటే నేను కూడా మెచ్చుకునేవాడిని. కానీ సీఎం జగన్‌ బాధ్యత లేకుండా ప్రవర్తించి ఈరోజు (శుక్రవారం) ఒంగోలు వెళ్లారు. తన కూతురు కనిపించడం లేదంటూ బాధితురాలి తండ్రి పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు ఇస్తే.. పట్టించుకోకుండా వెతుక్కోమని చెబుతారా? ఆ తండ్రే వెతుక్కుంటూ తన కూతురు ప్రభుత్వాస్పత్రిలో ఉందని తెలుసుకుని అక్కడకు వెళ్తే.. అప్పుడు కూడా నిందితులు తలుపులు తీయకుండా బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారని చెబుతున్నారు. ఇది మీ ప్రభుత్వానికి అవమానమనిపించలేదా? మీకు సిగ్గుందా? ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత ఉందా? రాష్ట్రాన్ని తగలబెడతారా? ఈ ప్రభుత్వ వైఖరి వల్ల సమాజంలో సంఘ విద్రోహ శక్తులు రెచ్చిపోతున్నారు. వారికి పాలకులు వంత పాడుతున్నారు.


వీరికి శీలం విలువ తెలియడం లేదు. ఆడబిడ్డల మనోవేదన అర్థం కావడం లేదు. నిర్భయ సంఘటనతో దేశవ్యాప్తంగా మహిళలు కంపించిపోయారు. రాష్ట్రంలో ఇంకా ఎంతమంది ఆడబిడ్డలపై అత్యాచారాలు జరగాలి? మొన్ననే గుంటూరులో ఒక సంఘటన చూశాం. ఒక అమ్మాయిని ఎక్కడెక్కడో తిప్పి 70 మంది అత్యాచారం చేశారంటే మీకు సిగ్గుందా? రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత ఉందా? వేరే రాష్ట్రం నుంచి పల్నాడుకు వచ్చిన మరో అమ్మాయిపై అత్యాచారం చేశారు. తాడేపల్లిలో మరో ఘటన చూస్తే.. పెళ్లి నిశ్చయమైన తర్వాత కలిసి మాట్లాడుకుందామని అమ్మాయి, అబ్బాయి వెళితే.. కాబోయే భర్త ముందే కామాంధులు కాటేస్తే మీరంతా ఎక్కడున్నారని అడుగుతున్నా. మీది అసమర్థ ప్రభుత్వమా? లేక దగాకోరులకు అండగా నిలబడుతున్నారా? సమాధానం చెప్పాలి. ఇలా ఒకటీ రెండూ కాదు..


రాష్ట్రంలో వందల సంఘటనలు జరుగుతున్నాయి. నిన్ననే ప్రకాశం జిల్లా ఓ కుటుంబం తిరుపతికి వెళుతూ.. టీ తాగుదామని కారును హోటల్‌ దగ్గర నిలబెడితే.. ముఖ్యమంత్రి వస్తున్నారని ఓ కానిస్టేబుల్‌ ఆ కారును తీసుకెళ్లిపోతాడా? ఇది అహంకారమా.. లేక ఉన్మాదమా? రాష్ట్రంలో ఆడబిడ్డలకు, ఎవరి ఆస్తులకూ రక్షణ లేదు. దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పకుండా తన చెంచాలతో మాట్లాడిస్తే భయపడిపోతామని అనుకుంటున్నారా? ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి పోరాడతాం. మిమ్మల్ని వదిలిపెట్టం. ఈ జాతి మిమ్మల్ని క్షమించదు. ఒక్క చాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చి మొత్తం రాష్ట్రాన్నే తగలబెడతామంటే చూస్తూ ఊరుకునేది లేదు’ అని స్పష్టం చేశారు.


జే బ్రాండ్స్‌ మద్యం తాగేసి..

ప్రభుత్వ మద్యం విధానం సరిగా లేదని.. ఎక్కడికక్కడ జే బ్రాండ్స్‌ పేరుతో నాసిరకం తీసుకొచ్చి విపరీతంగా విక్రయిస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘రాష్ట్రం డ్రగ్స్‌ కేపిటల్‌గా తయారైపోయింది. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా.. దానికి చిరునామా ఏపీగా చెబుతున్నారు. ఇక్కడ యువత గంజాయి, జే బ్రాండ్స్‌ మద్యం తాగేసి ఆడబిడ్డలపై అత్యాచారాలకు తెగబడుతున్నారు. విజయవాడ ఆస్పత్రిలో అత్యాచారానికి గురైన పేద బాధితురాలికి న్యాయం చేయాలి. ముగ్గురు నిందితులను కఠినంగా శిక్షించాలి. విశాఖలో ఎల్జీ పాలిమర్స్‌లో జరిగిన ప్రమాద బాధితులకు ప్రభుత్వం రూ.కోటి చొప్పున పరిహారం ఇచ్చింది. ఈ బాధితురాలికీ రూ.కోటి ఇవ్వాలి. ఆమె జీవించడానికి ఒక ఇల్లు నిర్మించి ఇవ్వాలి.


తెలుగుదేశం పార్టీ తరపున బాధితురాలికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందజేస్తాం. బాధితురాలి తల్లిదండ్రులు ఒకటే కోరుకుంటున్నారు. తమ కూతురిపై అత్యాచారానికి పాల్పడిన ఆ ముగ్గురికీ ఉరిశిక్ష వేయించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి.. ఆ ముగ్గురికి ఉరిశిక్ష విధించేలా చర్యలు తీసుకోవాలి. అత్యాచార బాధితురాలికి న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది’ అని స్పష్టం చేశారు. ఆయన వెంట టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమా, మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌, మహిళా నాయకురాలు అనురాధ ఉన్నారు.

Updated Date - 2022-04-23T08:49:13+05:30 IST