జగన్ తెచ్చిన కంపెనీ ఒక్కటైనా ఉందా?
ABN , First Publish Date - 2022-08-17T07:49:09+05:30 IST
జగన్ తెచ్చిన కంపెనీ ఒక్కటైనా ఉందా?

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
అమరావతి, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి) : కియ మోటార్స్, హీరో మోటార్స్, అశోక్ లేల్యాండ్, ఇసుజు, అపోలో టైర్స్, టీసీఎల్, యోకొహమా.. ఇలా గత ప్రభుత్వం తెచ్చిన కంపెనీలన్నింటికీ రిబ్బన్ కటింగ్ చేయడం తప్ప జగన్రెడ్డి ప్రభుత్వం తెచ్చిన కంపెనీ ఒక్కటైనా ఉందా? అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఎవరికో పుట్టిన బిడ్డకు తానే తండ్రినని ప్రచారం చేసుకోవడమంటే ఇదేనని విమర్శించారు. మంగళవారం ఆయన ట్విటర్ వేదికగా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ‘‘ఈ మూడేళ్లలో జగన్ ప్రభుత్వం ఒక్క కొత్త రోడ్డు వేయలేదు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ప్రజలకు బాగా తెలుసు. నాడు-నేడు పేరిట పాఠశాలల అభివృద్ధి అని సొంత పార్టీ వాళ్లను మేపడానికి నిధులు వాడారు. ఇప్పుడు తరగతి గదుల్లో పెచ్చులు ఊడిపడుతున్న వార్తలు రోజూ చూస్తున్నాం. ప్రజల నెత్తిన, పుట్టబోయే బిడ్డల నెత్తిన కూడా అప్పుల భారాన్ని వేశారు. అప్పుల మొత్తంలో మూలధన వ్యయం ఎంతనేది చూస్తే గత మూడేళ్లుగా అభివృద్ధిలో వెనక్కి.. అప్పుల్లో ముందుకు వెళ్తున్నామని తేలిగ్గానే అర్థమైపోతుంది. గతంలో ఎవరూ చేయని అప్పులు వీళ్లు కేవలం మూడేళ్లలో మూడు రెట్లు అధికంగా చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా మార్చారు. ఈ ముఖ్యమంత్రి అసమర్థ, ప్రణాళిక లేని పరిపాలన వల్లనే రాష్ట్రానికి ఈ దుస్థితి’’ అంటూ అచ్చెన్నాయుడు వరుస ట్వీట్లతో ధ్వజమెత్తారు.
జగన్ ప్రసంగం అబద్ధాలమయం: తులసిరెడ్డి
ముఖ్యమంత్రి జగన్ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం యావత్తు అబద్ధాలమయమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా వజ్రోత్సవాలు అనే అచ్చమైన తెలుగుపదాన్ని ఉచ్ఛరించలేని జగన్రెడ్డి సీఎం కావడం తెలుగు ప్రజల దౌర్భాగ్యమని ధ్వజమెత్తారు. మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల్లో 95 శాతం అమలు చేశామని జగన్ చెప్పడం పచ్చి అబద్ధమని, ప్రసంగం యావత్తూ అబద్ధాలేనని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు తదితర కార్పొరేషన్లను నిధులు లేకుండా నిర్వీర్యం చేసి ఆయా వర్గాలకు ఎంతో మేలు చేశామని సీఎం చెప్పడం హాస్యాస్పదమన్నారు.
బటన్ నొక్కడమే పాలనా?: సోము
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి బుర్ర లేదని, అభివృద్ధిలో పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి వర్ధంతి సందర్భంగా విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న వీర్రాజు మాట్లాడారు. ప్రోక్రాన్ అణుపరీక్షలతో భారత దేశ శక్తిని ప్రపంచానికి చాటిన మహా నాయకుడు వాజపేయిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. రాష్ట్రాన్ని పాలిస్తోన్న జగన్ ప్రభుత్వానికి తోలు మందమని, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 35లక్షల ఇళ్లు మంజూరు చేస్తే వాటిని నిర్మించలేక పోతోందని ఎద్దేవా చేశారు. కేంద్ర నిధులతో నిర్మించే నేచర్ క్యూర్ ఆసుపత్రికి గత ప్రభుత్వం ఇచ్చిన భూమిలో ఆసుపత్రి నిర్మాణం జరగకుండా వైసీపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాలిచ్చి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.

