ఆయన సీఐనా.. రౌడీనా..?

ABN , First Publish Date - 2022-10-08T09:58:55+05:30 IST

ఆయన సీఐనా.. రౌడీనా..?

ఆయన సీఐనా.. రౌడీనా..?

కదిరి సీఐని, పోలీసులను వెంటనే అరెస్టు చేయాలి

పోలీసు శాఖకు ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ ఆదేశం


కదిరి, అక్టోబరు 7: కులాంతర వివాహం కేసులో నిందితుడి పట్ల కదిరి సీఐ తమ్మిశెట్టి మధు వ్యవహరించిన తీరు అత్యంత దారుణమని, ఆయన పోలీసో లేక రౌడీనో అర్థం కావడం లేదని రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ విక్టర్‌ ప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశించినా సీఐని ఎందుకు అరెస్టు చేయలేదని పోలీస శాఖ ఉన్నతాధికారులను ప్రశ్నించారు. ఈ కేసులో నిందితులైన సిద్దిపేట సీఐ శ్రీనివాసు, మరో తొమ్మిది మంది పోలీసులను వెంటనే అరెస్టు చేయాలని పోలీసు శాఖను ఆయన ఆదేశించారు. శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీతోపాటు డీఐజీ, డీజీపీకి ఈ కేసు విషయమై లేఖ రాస్తానని శుక్రవారం మీడియాకు తెలిపారు. 2021లో జరిగిన కులాంతర వివాహం కేసులో విచారణ జరిపేందుకు శుక్రవారం ఆయన కదిరికి వచ్చి బాధితులతో మాట్లాడారు. అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు. 


అసలేం జరిగిందంటే..

కదిరి మండలం ఎర్రదొడ్డికి చెందిన ఉదయ్‌కుమార్‌, తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన యువతిని 2021 జూన్‌ 4న ప్రేమ వివాహం చేసుకున్నాడు. జూన్‌ 9న ఆ అమ్మాయి మైనర్‌ అంటూ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో సిద్దిపేట సీఐ శ్రీనివాస్‌.. నాటి కదిరి రూరల్‌ సీఐ మధు, సిబ్బంది కలిసి కదిరిలోని ఉదయ్‌కుమార్‌ తండ్రి ఇంటికెళ్లి నానా బీభత్సం చేశారు. ఇంట్లోని వస్తువులన్నింటినీ చిందరవదరగా పడేశారు. తేరు బజారులోని ఉదయ్‌కుమార్‌ ఇంటికెళ్లి, అతన్ని చితకబాదారు. అతడితోపాటు ఉన్న యువతిని సిద్దిపేట సీఐ వెంట తీసుకెళ్లిపోయారు. ఉదయ్‌కుమార్‌ను నాలుగు రోజులపాటు చిత్రహింసలు పెట్టారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. జూన్‌ 13న సిద్దిపేట కోర్టులో హాజరుపరిచారు. 54 రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలై వచ్చిన ఉదయ్‌కుమార్‌.. సీఐ బెదిరింపులకు తట్టుకోలేక ఏడాదిగా కనిపించకుండా పోయాడు. దీంతో ఉదయ్‌కుమార్‌ తండ్రి తమకు ప్రాణహాని ఉందని ఎస్సీ, ఎస్టీ కోర్డులో కేసు వేశారు. ఇద్దరు సీఐలతోపాటు, పోలీసు సిబ్బందిపై కేసు నమోదుచేసి, అరెస్టు చేయాలని ఈ ఏడాది ఆగస్టు 29న కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయినా ఇంతవరకు అరెస్టు చేయలేదు. ఈ నేపథ్యంలోనే వారు ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించారు. దీనిపై విచారణ నిమిత్తం శుక్రవారం కదిరికి వచ్చిన చైర్మన్‌.. కనిపించకుండా పోయిన ఉదయ్‌కుమార్‌ ఎక్కడున్నాడో కనిపెట్టి తీసుకురావాలని, అసలు ఉన్నాడో లేదో తేల్చాలన్నారు. సీఐ తమ్మిశెట్టి మధుపై చైర్మన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు వ్యవహారంలో అతిగా ప్రవర్తించారని చీవాట్లు పెట్టారు. 


Updated Date - 2022-10-08T09:58:55+05:30 IST