ఇక్బాల్‌ సాబ్‌.. రోడ్డెక్కడ?

ABN , First Publish Date - 2022-08-04T07:59:48+05:30 IST

ఇక్బాల్‌ సాబ్‌.. రోడ్డెక్కడ?

ఇక్బాల్‌ సాబ్‌.. రోడ్డెక్కడ?

హిందూపురం ఎమ్మెల్సీ ఆఫీసు వద్ద తమ్మినాయనపల్లి వాసుల ధర్నా

హిందూపురం, ఆగస్టు 3: ‘సర్పంచ్‌ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారుడిని గెలిపిస్తే తారు రోడ్డు వేయిస్తామన్నారు. ఏడాది గడిచినా పట్టించుకోవడం లేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ఊరి జనం బుధవారం ఎమ్మెల్సీ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ కార్యాలయం వద్ద బైఠాయించారు. శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం దేమకేతేపల్లి పంచాయతీ మజరా తమ్మినాయనపల్లి గ్రామస్థులు గత ఏడాది సర్పంచ్‌ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. దీంతో ఎమ్మెల్సీ వారితో చర్చించారు. ‘ఓటింగ్‌లో పాల్గొనండి. మా పార్టీ మద్దతుదారుడిని గెలిపించండి. దేమకేతేపల్లి నుంచి తమ్మినాయనపల్లికి తారురోడ్డు వేయిస్తా’ అని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ హామీ మేరకు వైసీపీ మద్దతుదారుడిని సర్పంచ్‌గా గెలిపించామని, ఏడాదవుతున్నా రోడ్డు వేయలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల కిందట దేమకేతేపల్లిలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. 108 అంబులెన్స్‌ కూడా గ్రామానికి వచ్చే పరిస్థితి లేదని జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయానికి తాళంవేసి నిరసన తెలిపినా పట్టించుకోలేదన్నారు. బుధవారం ఎమ్మెల్సీ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్నవారితో పోలీసులు మాట్లాడి, త్వరలోనే ఎమ్మెల్సీ రోడ్డు వేయిస్తారని సర్దిచెప్పి పంపించారు.

Read more