ప్రాణం తీసిన ఫేస్‌బుక్ పరిచయం
ABN , First Publish Date - 2022-10-07T08:43:26+05:30 IST
ప్రాణం తీసిన ఫేస్‌బుక్ పరిచయం
యువకుడి వేధింపులతో బాలిక ఆత్మహత్య
తనకల్లు, అక్టోబరు 6: ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన యువకుడి వేధింపులు భరించలేక ఇంటర్ విద్యార్థిని సంధ్యారాణి (17) ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండల పరిధిలోని ఎర్రబల్లి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. ఎస్‌ఐ రాంభూపాల్ కథనం మేరకు.. ఎర్రబల్లికి చెందిన సంధ్యారాణి అన్నమయ్య జిల్లా మొలకలచెరువు మోడల్ స్కూల్‌లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈమెకు శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువుకు చెందిన రాళ్లపల్లి ఇంతియాజ్ అనే యువకుడితో ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైంది. కొన్నాళ్ల తరువాత ఇంతియాజ్ ప్రేమ పేరుతో సంధ్యారాణిని వేధిస్తుండ టంతో భరించలేక ఆమె ఇంట్లోనే ఉరివేసుకుంది. తన ఆత్మహత్యకు ఇంతియాజ్ వేధింపులే కారణమని సెల్ఫీ వీడియోలో పేర్కొంది. విద్యార్థిని తండ్రి శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.