భారత్‌ నంబర్‌ 1 కావాలి

ABN , First Publish Date - 2022-08-16T08:41:02+05:30 IST

మనదేశం ప్రత్యేకమైన విజన్‌తో పని చేస్తే వచ్చే 25 ఏళ్లలో ప్రపంచంలోనే నంబర్‌ 1 దేశంగా మారుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు.

భారత్‌ నంబర్‌ 1 కావాలి

  • 100వ స్వాతంత్య్ర వేడుకలకు సాకారం చేయాలి
  • ప్రపంచ మేటి కావడానికి అన్ని అర్హతలున్నాయి
  • విజన్‌-2047 రూపకల్పనకు చంద్రబాబు పిలుపు
  • విద్య, ఆరోగ్యం అందరికీ చేరువ కావాలి
  • సంపద సృష్టించి పేద ప్రజలకు పంచాలి
  • రైతులకు ప్రత్యేక పాలసీలు తీసుకురావాలి
  • దేశంలో నదులను అనుసంధానం చేయాలి
  • టెక్నాలజీతో అవినీతిని అంతం చేయాలి
  • స్వాతంత్య్ర వేడుకలో టీడీపీ అధినేత ఉద్ఘాటన


గుంటూరు, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): మనదేశం ప్రత్యేకమైన విజన్‌తో పని చేస్తే వచ్చే 25 ఏళ్లలో ప్రపంచంలోనే నంబర్‌ 1 దేశంగా మారుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. 100వ స్వాతంత్య్ర వేడుకల నాటికి నంబర్‌ కావడానికి భారత్‌కు అన్ని అర్హతలూ ఉన్నాయన్నారు. వచ్చే 25 ఏళ్లు దేశానికి ఎంతో కీలకమన్నారు. దేశం ప్రపంచ మేటిగా నిలవడానికి విజన్‌-2047 రూపొందించుకోవాలని పిలుపునిచ్చారు. సోమవారం గుంటూరులోని చేబ్రోలు హనుమయ్య ప్రాంగణంలో స్వాతంత్య్ర వేడుకను ప్రజల సమక్షంలో జరుపుకొన్నారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకున్నా రు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు కన్నెగంటి సీతారామయ్య, జయలక్ష్మి దంపతులను చంద్రబాబు శాలువాతో సత్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. వచ్చే 25 ఏళ్లకు ప్రభుత్వాలు విజన్‌ రూపొందించుకోవాలన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, నదుల అనుసంధానం తదితర కీలక అంశాలపై చంద్రబాబు సూచనలు ఇచ్చారు. సమస్యలు, సవాళ్లపై ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. 


జెండా స్ఫూర్తితో ముందుకు.. 

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ, భగత్‌ సింగ్‌, అల్లూరి, సర్దార్‌ పటేల్‌, నేతాజీ వంటి జాతీయ నేతలను స్మరించుకుందాం. ప్రపంచ చరిత్రలో భారత దేశం ఉన్నంత వరకు గుర్తుండిపోయేలా జాతీయ జెండాను మన పింగళి వెంకయ్య రూపొందించారు. అది ప్రతి ఒక్కరి చేతుల్లో రెపరెపలాడాలి. జాతీయ జెండా స్ఫూర్తితో మనందరం ముందుకుపోవాలి. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ప్రతి ఒక్కరి గుండెల్లో నాటుకుపోవాలి.  


ప్రతి ఒక్కరికీ ‘నేషన్‌ ఫస్ట్‌’

400 ఏళ్ల క్రితం నాగరికతలో భారతదేశం ఎంతో ముందుండేది. అప్పట్లోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది. అయితే వలస పాలనలో దేశం తీవ్రంగా నష్టపోయింది. స్వాతంత్య్రం వచ్చాక పరిస్థితి మారింది. నెహ్రూ, పీవీ, వాజ్‌పేయి, మోదీ వంటి వారు దేశాన్ని ముందుకు నడిపించారు. స్వాతంత్య్రం రాకముందు, వచ్చిన తర్వాత దేశం ఎలా ఉందనేది చూడాలి. అలా గే సంస్కరణలకు ముందు సంస్కరణల తరువాత అని చూడాలి. నాడు పీవీ నరసింహారావు తీసుకొచ్చిన సంస్కరణలతో ప్రపంచ దేశాలతో భారత్‌ పోటీ పడిం ది. ప్రతి ఒక్కరూ నేషన్‌ ఫస్ట్‌ అని ఆలోచించాలి. అందుకోసం పాటుపడాలి. వ్యక్తుల కంటే దేశం మిన్న అనే భావన ప్రతి ఒక్కరిలో రావాలి. హరిత, పాల విప్లవంతో దేశ గమనం మారిపోయింది. కరువు కాటకాల నుంచి ప్రపంచానికి ఆహారం పెట్టే దేశంగా భార త్‌ ఎదిగింది. ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చే స్థాయికి చేరుకుంది. దేశంలో వచ్చిన అనేక సంస్కరణలతో టీడీపీ భాగస్వామిగా ఉంది. దీనికి నేను ఎంతో ఆనందిస్తున్నాను. 


విజన్‌-2020తో నాడే టీడీపీ లక్ష్యాల ను నిర్దేశించుకుని పనిచేసింది. టీడీపీ ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ పార్టీగా పనిచేసింది. టెలి కమ్యూనికేషన్‌ సంస్కరణలు, స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్‌, ఓపెన్‌ స్కై పాలసీ, గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌ పోర్ట్‌ల ఏర్పాటులో టీడీపీ ప్రభుత్వం జాతీయ స్థాయిలో కీలకంగా వ్యవహరించింది. మేకిన్‌ ఇండియాలో రక్షణ రంగ వస్తువుల తయారీలో 35 నుంచి 70 శాతానికి ఎదిగాం. ఇది 100 శాతం కావాలి. వచ్చే 25 ఏళ్లకు ఏమి చేయాలనేది నేడు ఆలోచించాలి. ప్రత్యేకమైన ప్రణాళిక, లక్ష్యం తో పని చేయాలి. ఇప్పటికీ పేదరికం ఉంది. రైతుల ఆత్మహత్యలు, నిరుద్యో సమస్యలు ఉన్నాయి. వీటిపై ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ దేశం నాకేమిచ్చిందని గాక దేశానికి నేనేమిచ్చానని ఆలోచించాలి. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ నేతలు వర్ల రామయ్య, పరుచూరి అశోక్‌బాబు, సత్యన్నారాయణ రాజు, టీడీ జనార్దన్‌, ప్రత్తిపాటి పుల్లారావు, కొండ్రు మురళీ, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, జీవీ ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీదర్‌, అనగాని సత్యప్రసాద్‌, తెనాలి శ్రావణ్‌కుమార్‌, నన్నపనేని రాజకుమారి, పిల్లి మాణిక్యాలరావు, తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం, కోవెలమూడి రవీంద్ర, మన్నవ మోహనకృష్ణ తదితరులు పాల్గొన్నారు.  


విజన్‌-2047కు చంద్రబాబు సూచనలు 

విలువలతో కూడిన సమాజాన్ని స్థాపించాలి.

ఆర్థిక అసమానతల్లేని సమాజాన్ని నిర్మించాలి.

బలమైన యువశక్తి ఉన్న దేశం మనది. యువతకు అవకాశాలు కల్పించాలి.

దేశంలో సంపద సృష్టి జరగాలి. ఆ సంపదను పేద ప్రజలకు పంచాలి.

రైతుల కోసం ప్రత్యేక పాలసీలు తీసుకురావాలి. 

స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా రైతుల ఆత్మహత్యలు దేశానికి గౌరవం కాదు. 

విద్య, ఆరోగ్యం అందరికీ చేరువ కావాలి.

మహిళా సాధికారతకు ప్రణాళికలు.

దేశంలో నదుల అనుసంధానం చేయాలి. ఏపీలో గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం చేశాం.

అవినీతి లేని పాలన అందించాలి. టెక్నాలజీతో అవినీతిని అంతం చేయాలి.

వచ్చే 25 ఏళ్లలో భారత్‌ నంబర్‌ 1 కావడానికి ప్రభుత్వంతో పాటు ప్రజలు ప్రత్యేక ప్రణాళిక, సంకల్పంతో పనిచేసి సుసాధ్యం చేయాలి.

Read more